-

తవ్వేస్తున్నారు

1 Mar, 2014 02:32 IST|Sakshi

వాకాడు, న్యూస్‌లైన్: కంచే చేను మేస్తోంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ బృందంలోని కొందరు సభ్యులే అక్రమ రవాణాకు అండగా నిలుస్తున్నారు. అధికారుల్లోనే కొందరు అండగా నిలవడంతో ఇసుక వ్యాపారులు మరింత రెచ్చిపోతున్నారు. రేయింబవళ్లు తేడా లేకుండా స్వర్ణముఖి నదిలోని ఇసుకను అక్రమంగా తవ్వి తరలిస్తూ రెండు చేతులా ఆర్జిస్తున్నారు. జిల్లాలోని ఇసుక రీచ్‌ల్లో మైనింగ్‌కు గతంలో ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల గడువు ఇటీవల పూర్తయింది. ఈ క్రమంలో ఇసుకకు డిమాండ్ పెరగడంతో వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. లంచాలకు అలవా టు పడ్డ కొందరు అధికారులను లోబరచుకుని వాకాడు, కోట, చిట్టమూరు మండలాల పరిధిలోని స్వర్ణముఖి నదిలో పలుచోట్ల ఇసుక ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా రేయింబవళ్లు ట్రాక్టర్లలో ఇ సుక తరలించేస్తున్నారు.
 
 సందట్లో సడేమియా : ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆయా పంచాయతీ కార్యదర్శుల నుంచి కూపన్లు పొంది ఇసుక తో లుకోవచ్చు. ఇతరులు అయితే నిర్ణీత మొత్తం చలానా కట్టి పర్మిట్లు పొందాలి. ఈ అనుమతుల మంజూరు విషయంలో కొన్ని పంచాయతీల కార్యదర్శులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ అ క్రమ రవాణాను అడ్డుకోవాల్సిన టాస్క్‌ఫోర్స్ బృందంలోని కొందరు స భ్యులు మరింత ప్రోత్సహిస్తున్నారు.
 
 ఒక్కో ట్రాక్టర్‌కు రూ.500 చొప్పున తీసుకుని ట్రాక్టర్లకు రైట్..రైట్ చెబుతున్నారని ఇసుక లోడింగ్‌కు వెళ్లే కూలీలే చెబుతున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడం కోసం కలెక్టర్ ఆదేశాలతో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ బృందాలకు వాహనాలు కూడా కేటాయించారు.
 
 అయితే ఈ బృందాల్లోని కొందరు ఇసుక రేవుల్లోనే మకాం వేసి డబ్బులు దం డుకోవడం చూసిన వారు విస్తుపోతున్నారు. ప్రధానంగా వాకాడు, బాలిరెడ్డిపాళెం, కాశీపురం ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కాశీపురంలో అయితే స్థానిక సర్పంచ్ రసీదులు ముద్రించి ట్రాక్టర్‌కు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. అక్రమ రవాణా విషయాన్ని తహశీల్దార్ కల్యాణ్ వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా కఠినచర్యలు చేపడతానని తెలిపారు.   పర్మిట్ల కంటే అదనంగా ఇసుక తోలితే ఆ వాహనాలు సీజ్ చేస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు