తిరగబడ్డ తీరబిడ్డ

13 Sep, 2015 01:04 IST|Sakshi
తిరగబడ్డ తీరబిడ్డ

భూ సేకరణపై అవగాహన సమావేశంలో ఉద్రిక్తత
మంత్రి కొల్లు, ఎంపీ కొనకళ్లకు చేదు అనుభవం
 భూములు ఇవ్వబోమంటూ తరిమిన కోన గ్రామస్తులు
 పలాయనం చిత్తగించిన ప్రజాప్రతినిధులు మంత్రి పీఏకు గాయాలు

 
బందరు మండలం కోన గ్రామంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావుకు శనివారం చేదు అనుభవం ఎదురైంది. పోర్టు కోసం భూసేకరణ  అంశంపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సు ఉద్రిక్తతకు దారితీసింది. భూములు ఇచ్చేది లేదని నినాదాలు చేసిన  గ్రామస్తులు మంత్రి, ఎంపీ ప్రసంగాన్ని అడ్డుకోవడమే కాకుండా వారు కారు ఎక్కి తిరుగుముఖం పట్టే వరకూ తరిమికొట్టారు. దీంతో కోన
 గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

 
మచిలీపట్నం : బందరు మండలం కోన గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం రాత్రి భూసేకరణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు పాల్గొని భూసేకరణ విషయంపై మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఇంతలో ‘మా జీవనాధారమైన భూములను ఇచ్చేది లేదు. గ్రామాన్ని మేమెందుకు ఖాళీ చేయాలి. ఎక్కడికి వెళ్లి ఉండాలి.’ అంటూ  గ్రామస్తులు వారిని ప్రశ్నించారు. మంత్రి కొల్లు రవీంద్ర వారికి సర్దిచెప్పేందుకు మైక్ తీసుకోగా, ‘మా భూములు ఇవ్వం. మీరు వెంటనే గ్రామాన్ని విడిచి వెళ్లండి.’ అంటూ గ్రామస్తులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు మంత్రి, ఎంపీకి రక్షణగా నిలిచారు. మంత్రి రవీంద్ర మైక్‌లో బిగ్గరగా మాట్లాడటంతో ఆగ్రహించిన గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం వద్ద వేసిన షామియానాను పడగొట్టారు. విద్యుత్ కనెక్షన్‌ను తొలగించారు. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు గ్రామస్తులను నెట్టివేశారు. ఇద్దరు, ముగ్గురు యువకులపై దాడి చేయటంతో ఒక్కసారిగా గ్రామస్తులంతా పోలీసులతో తోపులాటకు దిగారు. దీంతో పరిస్థితి అదుపుతప్పింది.

తరిమితరిమి కొట్టారు
పరిస్థితి అదుపు తప్పడంతో మంత్రి, ఎంపీలను వారి గన్‌మెన్లు సమావేశం నుంచి కారు వద్దకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. గ్రామస్తులు వారి వెనకే పరుగు పెట్టారు. మంత్రి, ఎంపీని సురక్షితంగా కారులో ఎక్కించినప్పటికీ గ్రామస్తులు కార్లతో పాటే పరుగులు పెట్టారు. ఈ సమయంలో మంత్రి కొల్లు రవీంద్ర పీఏ హరినాథబాబు తలకు స్వల్ప గాయమైంది. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

 విడతలవారీగా పోలీసుల రాక
 శనివారం రాత్రి 7 నుంచి 7.10 గంటల మధ్య కోన గ్రామంలో కార్యక్రమం జరగ్గా, 4 గంటల నుంచి పోలీసుల రాక ప్రారంభమైంది. 4 గంటలకు ఒక జీపు, 4.30 గంటలకు మరో జీపు, 5 గంటలకు మరో జీపు.. ఇలా వరుస క్రమంలో పోలీసులు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. మంత్రి, ఎంపీ కాన్వాయి వెంట ప్రత్యేక బలగాలు ఓ వ్యాన్‌లో వచ్చాయి. వచ్చిన పోలీసులు గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తారా, లేదా.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రికి, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో ప్రత్యేక పోలీసు బలగాలు పరుగెత్తుకు రావటం, పోలీసులు తమపైకి దాడి చేయడానికి వస్తున్నారని గ్రామస్తులు భావించటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

అతికష్టం మీద కోన గ్రామం నుంచి బయటపడిన మంత్రి, ఎంపీ అక్కడి నుంచి సమీపంలోని పల్లెతుమ్మలపాలెం గ్రామానికి వెళ్లారు. పల్లెతుమ్మలపాలెం నుంచి తిరిగి వచ్చేటప్పుడు మంత్రి, ఎంపీని నిలదీసేందుకు గ్రామస్తులు కోన - పల్లెతుమ్మలపాలెం రోడ్డుపై బైఠాయించారు. డీఎస్పీ డీఎస్ శ్రావణ్‌కుమార్ కోన గ్రామానికి వచ్చారు. రోడ్డుపై ఉన్న గ్రామస్తులకు నచ్చజెప్పి ఆగ్రహానికి గురి కావద్దని సర్దిచెప్పారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. కోన గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి దారి తీయటంతో మచిలీపట్నం నుంచి ప్రత్యేక బలగాలను రప్పించారు.
 
 

మరిన్ని వార్తలు