ఏ కష్టమొచ్చిందో..

5 Jul, 2014 02:52 IST|Sakshi
ఏ కష్టమొచ్చిందో..

వేంపల్లె :  చక్రాయపేట మండలం గండి పుణ్యక్షేత్రంలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హరితా రెస్టారెంటులోని నాల్గవ గదిలో మదనపల్లెకు చెందిన కుటుంబ యజమాని ఎలమలకుంట మీరావల్లి (45)తోపాటు అతని భార్య హజరాంబి(40), పెద్దకుమార్తె ఆశ(20), రెండవ కుమార్తె యశ్మిత (18), మూడవ కుమార్తె షర్మిల(16), కుమారుడు దస్తగిరి (14) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు పాల్పడిన గదిలో గోడపై రాసిన నోట్ ప్రకారం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
 వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారా.. లేక ఎవరైనా పురుగుల మందు బలవంతంగా తాపి  వెళ్లిపోయారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  పులివెందుల డీఎస్పీ హరినాథబాబు, సీఐ మహేశ్వరరెడ్డి, ఆర్‌కె వ్యాలీ ఎస్‌ఐ ప్రదీప్‌నాయుడు మృతదేహాలను పరిశీలించి హరితా రెస్టారెంటు సిబ్బంది, మృతుని బంధువులను విచారించారు.
 
 మృతుడు మీరావల్లి తోడల్లుడు భాస్కర్ వివరాల మేరకు... దూదేకుల కులానికి చెందిన ఎర్రమల చింత మీరావల్లి గత 7 నెలల క్రితం వరకు ఎర్రగుంట్లలో నివాసం ఉండేవాడు. పిల్లల చదువు కోసం అక్కడ ఉన్న స్థలాన్ని, ఇంటిని, ట్రాక్టర్‌ను రూ. 33లక్షలకు విక్రయించాడు.  కొంతమందికి ఇవ్వాల్సిన అప్పు ఇచ్చి ప్రస్తుతం మదనపల్లె చెంబుకూరు రోడ్డులోని ఈశ్వరమ్మ కాలనీలో నివాసముంటున్నారు. ఈనెల 1వ తేదీ శనివారం సాయంత్రం పుణ్యక్షేత్రమైన గండికి మీరావల్లి కుటుంబంతో చేరుకున్నారు. మూడు రోజుల పాటు నిద్ర చేసేందుకు వచ్చామని హరితా రెస్టారెంటులోని 4వ గదిని తీసుకుని శుక్రవారం సాయంత్రం వరకు అద్దె కూడా చెల్లించారు. శుక్రవారం మధ్యాహ్నం ఎవరూ బయట కనపడకపోవడంతో  రెస్టారెంటు సిబ్బంది గది తలుపులు తోశారు. విపరీతమైన పురుగుల మందు వాసన రావడంతోపాటు గదిలో మృతదేహాలు చిందరవందరగా పడి ఉన్నాయి.
 
  సిబ్బంది వెంటనే కర్నూలులో ఉన్న మేనేజర్ లక్ష్మణ్‌కు సమాచారం అందించగా.. ఆయన ఆర్‌కేవ్యాలీ ఎస్‌ఐ ప్రదీప్‌నాయుడుకు సమాచారం అందించారు. దీంతో  డీఎస్పీ హరినాథబాబు, సీఐ మహేశ్వరరెడ్డి, ఎస్‌ఐ ప్రదీప్‌నాయుడుఘటనా స్థలాన్ని పరిశీలించారు.  రెస్టారెంట్ సిబ్బందిని విచారించారు. మృతికి  దారితీసిన కారణాలను తెలుసుకుంటున్నామని తెలిపారు.
 
 క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు :
 మృతదేహాలు ఉన్న ఘటనా స్థలంలో గోడపై నోట్ రాసి ఉండటంతో పోలీసులు  పలు కోణాలలో దర్యాప్తు చేపడుతున్నారు. శుక్రవారం  రాత్రికి గానీ.. శనివారం ఉదయం కానీ కర్నూలు నుంచి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌లను పిలిపించి తనిఖీలు నిర్వహించిన తర్వాత.. వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి మృతదేహాలను తరలిస్తామని  పోలీసులు తెలిపారు.
 
 సంఘటనపై పలు అనుమానాలు
 హరితా రెస్టారెంటులోని నాల్గవ గదిలో శుక్రవారం పురుగుల మందు తాగి మీరావల్లీ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన తీరు చూస్తే పలు అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి.  ఆరుమంది  కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడితే  ఎటువంటి శబ్ధం  లేకుండా కేకలు వినిపించకుండానే మృతి చెందడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.  సిబ్బంది తలుపులు లాగానే వచ్చిందంటే... గదికి తాళం వేసుకోకుండానే ఒకవేళ ఆత్మహత్యకు పాల్పడి ఉంటే.. చావు భయంతో ఏ ఒక్కరైనా పరుగులు తీసి ఉండేవారు కదా అనే  భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
 అంతేకాకుండా గోడపై బొగ్గుతో రాసిన నోట్ మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ‘ రూంలోకి గుంపుగా జనం వచ్చినారు.. వారిలో ప్రొద్దుటూరుకు చెందిన రెహ్మాన్, ఎర్రగుంట్లకు చెందిన గుర్రం మిల్లార్, దస్తగిరి అనేవారిని చూసినాము.. మమ్ములను అణగబట్టి మందుపోసినారు., మా చావుకు వారే  కారణం’ అని రాసి ఉంది. దీన్ని బట్టి చూస్తే ఎవరైనా ఆహారంలో పురుగుల మందు కలిపి వీరికి ఇచ్చారా.. లేక బలవంతంగా పురుగుల మందు తాపి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు పన్నాగం  పడ్డారా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నోట్‌లో రాసిన ఇద్దరికి మీరావల్లి డబ్బులు బాకీ ఉన్నందువల్లే ఇలా రాసి ఉన్నారా.. లేక డబ్బులు వసూలుకు బలవంతం చేశారా అని మరొక అనుమానం కూడా కలుగుతోంది.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా