స్నానానికి వెళ్లిన ఇద్దరు బాలుర గల్లంతు

3 Oct, 2013 05:10 IST|Sakshi
తాలాడ(సంతకవిటి)/వంగర, న్యూస్‌లైన్: చుట్టపు చూపునకు వచ్చిన యువకుడు మడ్డువలస కాలువలో స్నానానికి దిగి గల్లంతుకాగా, నాగావళి నదికి స్నానం కోసం వెళ్లిన మరో బాలుడు కొట్టుకుపోయిన ఘటనలు సంతకవిటి మండలం తాలాడ, వంగర మండలం శివ్వాం గ్రామం వద్ద బుధవారం చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే... పొందూరుకు చెందిన బుడుమూరు షణ్ముఖరావు (14) అనే బాలుడు తాలాడ గ్రామంలోని తన బావగారైన మల్లేశ్వరరావు ఇంటికి ఈనెల 1న వచ్చాడు. 
 
 ఉదయం తోటి పిల్లలతో కలసి మడ్డువలస కాలువలో స్నానానికి వెళ్లాడు. కాలువలో దిగుతుండగా కాలు జారడం, ఈత రాకపోవడంతో ఉన్న ఫలంగా కొట్టుకుపోయాడు. తోటి పిల్లలు విషయూన్ని బంధువులకు చెప్పడంతో పరుగున వెళ్లి వెతికినా ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న షన్ముఖరావు తల్లిదండ్రులు గున్నమ్మ, అప్పారావులు తాలాడకు చేరుకుని భోరున విలపిస్తున్నారు. వీరికి షన్ముఖరావుతో పాటు మరో కుమారుడు ఉన్నాడు. బాలుడి గల్లంతైన విషయంపై సంతకవిటి పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. బాలుడి కోసం గ్రామస్తులందరూ కలిసి గాలిస్తున్నారు. 
 
 కాలుజారి..
 వంగర మండలం శివ్వాం గ్రామానికి చెందిన  దమరసింగి ప్రవీణ్(15) గ్రామ సమీపంలోని నాగావళి నదిలో స్నానాలు రేవు వద్ద స్నానం చేస్తుండగా కాలుజారి నదిలో కొట్టుకుపోయాడు. దీనిని గమనించిన కొంతమంది చిన్నారులు కేకలు వేయడంతో గ్రామస్తులు వచ్చి గాలించినా ఫలితం లేదు. ప్రవీణ్ తల్లి పొట్టకూటికోసం వలస వెళ్లడంతో అమ్మమ్మ, తాతయ్య బిల్లాన ఆదమ్మ, పకీరు వద్ద ఉంటూ చదువుతున్నాడు. ప్రవీణ్ జాడతెలియక పోవడంతో వృద్ధులిద్దరూ నది ఒడ్డుకు చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు.  బాలుడి కోసం గ్రామానికి చెందిన యువకులు గాలిస్తున్నారు. 
 
మరిన్ని వార్తలు