తల్లిదండ్రులకు కడుపుకోత

7 Apr, 2014 03:45 IST|Sakshi
  •     నీళ్ల తొట్టె పగిలి ఇద్దరు చిన్నారుల మృతి
  •      కన్నీరు మున్నీరవుతున్న దంపతులు
  •      నాసిరకంగా నిర్మించడమే కారణం
  • మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: సిమెంట్ ఇటుకలతో నిర్మించిన నీళ్ల తొట్టె పగిలి ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. ‘నాన్నా, తల్లీ లేవండ్రా అంటూ’ ఆ తల్లి గుండెలు బాదుకుంటూ రోదించడం కంటతడి పెట్టించింది. కూలి కోసం వచ్చిన ఆ దంపతులకు తీరని దుఃఖం మిగిలింది. ఈ సంఘటన ఆదివారం పుంగనూరు మండలంలో చోటు చేసుకుంది. చిన్నారుల తండ్రి కథనం మేరకు.. బెరైడ్డిపల్లె మండలం గౌనితిప్పేపల్లెకు చెందిన హనుమంతప్ప, భాగ్యమ్మ దంపతులు కూలీనాలి చేసుకుని జీవిస్తున్నారు.

    వీరికి కుమార్తె నవ్య(04), కుమారుడు మోహన్‌బాబు(ఒకటిన్నర సంవత్సరం) ఉన్నారు. ఈడిగపల్లెలో శ్రీనివాసులుకు చెందిన ఇటుకల బట్టీ వద్దే ఉండి పనిచేస్తున్నారు. మూడు రోజుల క్రితమే పనికి కుదిరారు. శ్రీనివాసులు ఇటుక బట్టీలను నిర్వహిస్తుండగా, వారి తమ్ముళ్లు నర్సరీలను ఏర్పాటు చేసుకున్నారు. నర్సరీకి, ఇటుకల బట్టీకి ఉమ్మడిగా సిమెంట్ ఇటుకలతో సుమారు వెయ్యి లీటర్ల పైగా సామర్థ్యం ఉన్న ఆరు అడుగుల నీటితొట్టెను నిర్మించుకున్నారు.

    నీటితొట్టెకు కిందభాగంలో కొళాయిని ఏర్పాటు చేశారు. ఈ తొట్టెని నాసిరకంగా నిర్మించారు. హనుమంతప్ప తొట్టెకు నీళ్లు పట్టాడు. నిండి పోవడంతో మోటారును ఆఫ్ చేయడానికి వెళ్లాడు. ఇదే సమయంలో ఇతని పిల్లలు నవ్య, మోహన్‌బాబు నీళ్లు పట్టుకోవడానికి తొట్టె వద్దకు వెళ్లారు. కొళాయి వద్ద నీళ్లు పట్టుకుంటుండగా ఒక్కసారిగా నీటితొట్టె పగిలిపోయింది. సిమెంట్ ఇటుకలు, నీళ్లు పిల్లలపై పడడంతో గట్టిగా అరిచారు.

    తల్లిదండ్రుల కళ్లముందే ఇదంతా జరగడంతో ఏంచేయాలో వారికి అర్థం కాలేదు. గట్టిగా కేకలు వేస్తూ తీవ్రంగా గాయపడిన చిన్నారులను ఆటోలో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బిడ్డలిద్దరూ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కళ్లముందే బిడ్డలను పోగొట్టుకోవడంతో తల్లిదండ్రులకు మాటలు రాలేదు. మరణించిన బిడ్డలను తలచుకుని ఆ తల్లి బోరున విలపించింది. ఈ సంఘటనపై పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు