ఆస్పత్రిలో ఆ రెండు గంటలు..

14 Jun, 2015 01:55 IST|Sakshi

రాజమండ్రి క్రైం : ధవళేశ్వరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలోని 22 మృతదేహాలకు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో శనివారం పోస్టుమార్టం నిర్వహించారు. రాజమండ్రి, కాకినాడలకు చెందిన ఆరుగురు వైద్యులు రెండు గంటల్లో పోస్టుమార్టం పూర్తి చేశారు. సాధారణంగా పోస్టు మార్టం మార్చురీలో చేస్తుంటారు. అయితే మృతుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఆరుబయటే పీఎం చేశారు. ఇంత విషాదం ఎలా జరిగిందా అని తెలుసుకునేందుకు వందల సంఖ్యలో ప్రజలు ఆస్పత్రికి చేరుకున్నారు. గుట్టలుగా వచ్చిన మృతదేహాలను చూసి వారు అయ్యో పాపం అంటూ విచారం వ్యక్తం చేశారు. మరో వైపు రెవెన్యూ అధికారులు.. పోలీసులు భారీ సంఖ్యలో వచ్చారు.
 
 మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని అధికారులు వెల్లడించారు. దీంతో ఆస్పత్రి ఆవరణలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆస్పత్రిలోని వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. అదే సమయంలో విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం మోసయ్యపేట నుంచి మృతుల బంధువులంతా ఉదయం 11.30 సమయానికి ఆస్పత్రికి చేరుకున్నారు. తీర్థయాత్రలకు ఆనందంగా ఇంటి నుంచి బయలుదేరిన వారంతా ఇలా విగతజీవులుగా కనిపించే సరికి వారంతా షాక్‌కు గురయ్యారు. ఏం మాట్లాడాలో... ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ‘మాకు ముద్ద దిగడం లేదు‘ అంటూ వారి కోసం తీసుకు వచ్చిన ఆహారం వదిలేశారు.
 
 ఆరుబయటే పోస్టుమార్టం
 ధవళేశ్వరం ప్రమాద స్థలం నుంచి తీసుకువచ్చిన 21 మృతదేహాలతో పాటు ఆస్పత్రిలో మృతి చెందిన సంధ్య మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మార్చుని వద్ద ఆరు బయటే  పోస్టు మార్టం చేశారు. ముందుగా పోలీసులు, రెవెన్యూ అధికారులు పంచనామా నిర్వహించారు. రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి చెందిన వైద్యులు పద్మశ్రీ, నళినీమోహన్, నాగేంద్ర ప్రసాద్, సునీల్ రాజులతో పాటు, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ విభాగానికి చెందిన పోస్టుమార్టం అటెండెంట్లు శ్రీను, సత్తిరాజు పాల్గొన్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన పోస్టుమార్టం 12.30 గంటలకు పూర్తయింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను మూడు వ్యాన్లలో వారి స్వగ్రామానికి తరలించారు. మృతుల కోసం వచ్చిన బంధువులను బస్సులో పంపించారు.
 
 మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే కోసం ‘గంట’ జాగారం
 మృతులకు 10.30 ప్రారంభమైన పోస్టుమార్టం 12.30 గంటలకు పూర్తయింది. వైద్యులు శ్రమపడి త్వరగా పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాలను విశాఖ జిల్లాలోని వారి స్వగ్రామానికి పంపేందుకు మూడు వ్యానుల్లో సిద్ధంగా ఉంచారు. ‘తాము వస్తున్నామని.. వచ్చే వరకూ మృతదేహాలను ఉంచాలంటూ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎంపీ అవంతి శ్రీనివాసరావు, యల మంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. చేసేది లేక అధికారులు కూడా వారు వచ్చే వరకూ మృతదేహాలతో ఉన్న వాహనాలను గంట పాటు అలాగే ఉంచేశారు. ‘ఎంత సేపు ఉండాలంటూ’ మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిషయమై ప్రశ్నించగా మృతుల బంధువుల భోజనాల కోసమని అధికారులు చెబుతూ వచ్చారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే వచ్చిన 10 నిమిషాలకే మూడు వాహనాలు విశాఖ జిల్లాకు బయలుదేరి వెళ్లాయి.
 
 వాహనం వరకూ వచ్చాను
 నేను కూడా తిరుపతి రావాలని భార్య సునీత కోరింది. నాకు రావడం కుదరదు.. సెలవు ఇవ్వలేదని చెప్పాను. తీర్థయాత్రలకు వెళుతున్నప్పుడు వాహనం వరకు వచ్చి భార్య సునీత,కుమారుడు పవన్‌కు వీడ్కోలు పలికాను. ఆనందంతో వెళ్లిన వారు విగతజీవులై కనిపిస్తారని అనుకోలేదు.
 - పుర్రే అవతారం, (మృతురాలు సునీత భర్త)
 
 మమ్మల్ని వీడి వెళ్లిపోయింది
 తీర్థయాత్రలకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన నా భార్య నన్ను, ముగ్గురు పిల్లల్ని వీడి వెళ్లిపోయింది. ఆనందంగా ఇంటికి తిరిగి వస్తారని అనుకుంటే ఈ ఘోరం జరిగింది.
 - నరసింగరావు, (మృతురాలు కాసులమ్మ భర్త)
 

మరిన్ని వార్తలు