అధికార పార్టీ నాయకుల దౌర్జన్యం

10 Sep, 2015 03:15 IST|Sakshi
అధికార పార్టీ నాయకుల దౌర్జన్యం

♦  ఫ్లెక్సీల ఏర్పాటు పేరుతో పచ్చనేతల బరితెగింపు
♦ ఆటో డ్రైవర్లపై దాడి, స్టేషన్‌లో ఫిర్యాదు
 
 పాకాల :   ఆటోస్టాండ్‌లో ఫ్లెక్సీ ఏర్పాటుకు అడ్డు చెప్పారన్న అక్కసుతో ఆటో డ్రైవర్లపై టీడీపీ ఛోటా నాయకులు దాడికి పాల్పడ్డారు. మాకే అడ్డు చెబుతారా అంటూ విచక్షణా రహితంగా డ్రైవర్లపై పిడిగుద్దులు కురిపించారు. అక్కడితో వదలకుండా ఆటోస్టాండ్‌ను జేసీబీతో ధ్వంసం చేశారు. నేరుగా పోలీస్టేషన్‌కు వెళ్లి బాధితులైన ఆటోడ్రైవర్లపైనే ఫిర్యాదు చేసిన సంఘటన పాకాలలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు... పాకాల పట్టణం రైల్వే స్టేషన్ సమీపం, చిత్తూరు సర్కిల్లో శ్రీ వరసిద్ధి వినాయక ఆటోస్టాండ్‌లో వినాయక చవితి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం మాజీ మంత్రి గల్లా అరుణకుమారి పాకాలకు వస్తున్నారు.

దీంతో ఆమెకు స్వాగతం పలికేందుకు ఆటోస్టాండ్‌లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు టీడీపీ నాయకులు బుధవారం సాయంత్రం ప్రయత్నించారు. అయితే ఇక్కడ వినాయక చవితికి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, కొద్దిగా జరిపి ఫ్లెక్సీలు పెట్టుకోవాలని టీడీపీ నాయకులకు ఆటోడ్రైవర్లు వేడుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ నాయకులు  ఆటోడ్రైవ ర్లు నాగూర్‌పై దాడికి దిగారు. బాధితులు తమపై దాడి చేసిన టీడీపీకి చెందిన నాగరాజ నాయుడు, కిషోర్,హర్ష, రమేష్,సాయి, రావిళ్ల మోహన్‌లపై పాకాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు కూడా బాధిత ఆటోడ్రైవర్లు నాగూర్, కపిల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు.

 సానుభూతి పరులు కావడం వల్లే దాడులు...
 ఆటోస్టాండ్ నాయకులపై టీడీపీ నాయకులు దాడి చేశారన్న విషయం తెలుసుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ నంగా బాబు రెడ్డి పోలీస్టేషన్‌కు చేరుకుని బాధితులకు అండగా నిలి చారు. తమ పార్టీకి ఆటోస్టాండ్ నాయకులు సానుభూతి పరులుగా మారడాన్ని జీర్ణించుకోలేక పోయిన టీడీపీ నాయకులు ఫ్లెక్సీల పేరుతో దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. 40 కుటుంబాలకు చెందిన పేదలు ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటే వారిపై దాడికి దిగడం దారుణం అన్నారు. ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పాకాల సీఐ చల్లని దొర తెలిపారు.

>
మరిన్ని వార్తలు