ఎన్ని‘కల’లో..

3 Feb, 2014 03:31 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల : జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. సాధారణ ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తుండటంతో త మ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు పక్కా వ్యూహా లతో ముందుకు వెళ్తున్నాయి. ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదల య్యే అవకాశాలుండడంతో అన్ని పార్టీ లు ఓటర్లను తమ వైపు ఆకర్శించేం దుకు కసరత్తు ప్రారంభించాయి.
 
 ఇప్పటికే అన్ని పార్టీల అధిష్టానాలు రేసు గుర్రాల అన్వేషణపై దృష్టిసారించాయి. ఒక్కో పార్టీ ఒక్కో విధానంతో ముందుకెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎత్తుగడలు ప్రారంభించాయి. స్థానిక సమస్యలు మొదలు నిత్యావసర వస్తువులు ధరల పెరుగుదల.. తెలంగాణ రాష్ట్ర సాధన వరకు అన్ని సమస్యలపై తాము చేస్తున్న పోరాటాల గురించి ప్రజలకు వివరించేందుకు సిద్ధమయ్యాయి. కొన్ని పార్టీలు స్వచ్ఛంద కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. రానున్న రోజుల్లో ఏ పార్టీ ఏ తీరుగా ప్రజల ముందుకువెళ్తుందోనని జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 
 గెలుపు గుర్రాల కోసం హస్తం
 తాజాగా రాహుల్ దూత విజయ్ వడెట్టివార్ గత నెల 24న మంచిర్యాలలో మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాల ఎంపిక కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మూడు నియోజకవర్గాలకు పది మంది టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. త్వరలోనే పశ్చిమ జిల్లాలో కూడా రాహుల్ దూత పర్యటించనున్నారు. మరోపక్క.. ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం అన్ని పార్టీల నుంచి ఆశావహులూ ఆయా అధిష్టానాలతో మంతనాలు ప్రారంభించారు. తాజాగా.. టీఆర్‌ఎస్‌కు చెందిన మంచిర్యాల ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని స్పష్టం చేయడంతో ఆ పార్టీ నుంచి టిక్కెట్ ఆశిస్తున్న నాయకులు అధిష్టానంతో మంతనాలు జరుపుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా టిక్కెట్లు గెలిచే వారికి ఇవ్వాలని భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అదే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు సూచించింది. ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజ లకు దగ్గరయ్యేందుకు గ్యాస్ సిలిండర్‌కు నగదు బదిలీ రద్దు చేసింది. ఏడాదికి తొమ్మిది సిలిండర్లకు బదులు..12 సిలిండర్లు ఇస్తున్నట్లు ప్రకటిం చింది. దీనిని ఎన్నికల్లో ప్రచారస్త్రాంగా మలుచుకునేందుకు పార్టీ నేతలు సిద్ధమయ్యారు.
 
 రాజన్న రాజ్యం కోసం వైఎస్సార్‌సీసీ పోరు
 రోశయ్య, కిరణ్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, కరెంట్ చార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం మోపాయి. మెరుగైన విద్య, వైద్యం అందని ద్రాక్షగా మారాయి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108, 104, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పింఛన్లు తదితర పథకాలతో అర్హులకు సకాలంలో లబ్ధిపొందని పరిస్థితులున్నాయి. వీటి సాధన కోసం వైఎస్సార్ సీపీ ప్రజల ముందుకెళ్తొంది. సర్కారుపై సమరం సాగించి ప్రజలకు పథకాలు చేరువయ్యేలా చేయాలని భావిస్తోంది. ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. మళ్లీ ‘రాజన్న కలలు కన్న రాజ్యం’ రావాలంటే పార్టీని గెలిపించాలనే నినాదంతో వైఎస్సార్ సీపీ ప్రజల్లోకి వెళ్తొంది.
 
 బీజేపీకి ‘మోడీ’ చరిష్మా..
 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తమతోనే సాధ్యమని బీజేపీ నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. దీనికితోడు ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ చరిష్మా కూడా తోడైంది. గుజరాత్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన మోడీ ప్రధాని అయితే దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించగలర ని బీజేపీ ప్రచారం చేపట్టింది. ఇదే నినాదంతో జిల్లాలో పలువురు నాయకులు ఈ సారి బీజేపీ టిక్కెట్టుతో బరిలో నిలబడేందుకు సిద్ధమవుతున్నారు. వారం రోజుల క్రితం ఢిల్లీలో జిల్లాస్థాయి నాయకులతో అగ్రనేతలు భేటీ అయ్యారు. క్షేత్రస్థాయి నాయకులు పలు సూచనలు చేశారు. కాంగ్రెస్ అవినీతిని ఎండగట్టాలని సూచించారు. రాహుల్‌కు పరిపాలించే సత్తాలేదనే ప్రచారాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.
 
 డీలాపడ్డ తెలుగు తమ్ముళ్లు..
 జిల్లాలో టీడీపీ డీలాపడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుతో జిల్లాకు చెందిన టీడీపీ నే తలు ఏం చేయాలో తోచక సందిగ్ధంలో పడ్డారు. ఏ విధానంతో ముందుకెళ్లాలో తెలియక సతమతమవుతున్నారు. ప్రజల్లోకి వెళితే.. తెలంగాణ ఏర్పాటుపై మీ అధినేత వైఖరి ఏంటనే వచ్చే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక సతమతమవుతున్నారు. పార్టీ నేతల్లో సయోధ్య కొరవడి.. పార్టీకి దూరమవుతున్నారు. ఇప్పటికే పార్టీ సీనియర్ నేత గోనె హన్మంతరావు పార్టీని వీడారు. తాజాగా.. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేవీపీ ప్రతాప్ కూడా పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీని వీడే ఆలోచనలో ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని వీడే వారిని ఎలా కాపాడుకోవాలి? ఎలా బుజ్జగించాలో తెలియక పార్టీ నాయకత్వం ఆందోళన చెందుతుంది.
 
 టీఆర్‌ఎస్ హస్తినబాట..
 తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పడిన టీఆర్‌ఎస్ ఇప్పటికీ అదే నినాదంతో ముందుకెళ్తొంది. తెలంగాణ ఇచ్చేంత వరకు పోరాడుతామని నాయకులు ప్రజలకు భరోసా కల్పిస్తూనే ఉన్నారు. తాజాగా అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ పునర్‌ఃవ్యవస్థీకరణ బిల్లు తిరస్కరణ గురైన మరుసటి రోజే ఫిబ్రవరి ఒకటో తేదిన ఢిల్లీకి వెళ్లిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అక్కడే మకాం వేశారు. నేడు బిల్లు నివేదిక కేంద్రానికి వె ళ్లిన నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సమాయత్తమయ్యారు. అదేవిధంగా తెలంగాణ మన ఉద్యమాలతోనే సాకారమైందని ప్రచారం చేయాలని అధిష్టానం సూచిస్తోంది.
 
 ప్రజాసమస్యలపై వామపక్షాల పోరు
 వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎం పార్టీలు ప్రజా సమస్యలనే తమ అజెండాగా ఎంచుకున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సమరం సాగిస్తున్నాయి. కరెంటు చార్జీలపై పోరు సాగించాలి. తగ్గించాలని నినదించాయి. తెలంగాణకు తమ అండ లేకపోతే సాధ్యమయ్యేది కాదని చెప్పుకొస్తున్నారు.
 
 తెరపైకి ‘ఆమ్‌ఆద్మీ’..
 జిల్లాలో ‘ఆమ్ ఆద్మీ’ పార్టీ తెరపైకొచ్చింది. ‘నేను సామాన్యుడిని’ అనే నినాదంతో దేశ రాజధాని ఢిల్లీలో పాగా వేసిన ‘ఆమ్ ఆద్మీ’ పార్టీ. జిల్లాలో సభ్యత్వ నమోదు శ్రీకారం చుట్టింది. ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ‘నేనూ ఓ సామాన్యుడి నే’ అని ఇప్పటికే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్శించారు. ఈ విధానాలతోపాటు అవినీతి రహిత పాలన కోసం పార్టీని బలోపేతం చేసి.. రానున్న ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు పార్టీ శ్రేణులు పావులు కదుపుతున్నారు.
 

మరిన్ని వార్తలు