ఆక్వా సాగు అంపశయ్యపై..

21 Jan, 2016 00:58 IST|Sakshi
ఆక్వా సాగు అంపశయ్యపై..

సాగుకు సహకరించని వాతావరణం
శీతాకాలంలో పెరిగిన వ్యాధుల ఉధృతి
ఖాళీ అవుతున్న  చెరువులు.. తగ్గిపోతున్న సాగు విస్తీర్ణం
మూతపడిన రొయ్య  పిల్లల ఉత్పత్తి కేంద్రాలు
నాడు డాలర్లు కళ్లజూసిన రైతులు నేడు అప్పుల పాలు

 
జిల్లాలో ఆక్వా సాగు తీవ్ర సంక్షోభంలో పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఆక్వారంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.   ప్రధానంగా రొయ్యలకు వైట్‌స్పాట్, స్లోమార్టాల్టీ, ఇబ్రాయిసిస్ వ్యాధులు పడగనీడలా వెంటాడుతున్నాయి. వీటి నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. శీతాకాలంలో రొయ్యలపై వ్యాధుల ఉధృతి మరింత  పెరగడంతో రైతులకు సాగు కత్తిమీద సాములా తయారైంది.
 
బాపట్ల: రెండు దశబ్దాల క్రితం జిల్లాలో ఆక్వారంగం టైగర్ రొయ్యల సాగు విదేశీమారక ద్రవ్యంతో డాలర్ల పంట పండించింది. ఆక్వా రైతుల ఇంట సిరుల వాన కురిపించింది. అనంతరం రొయ్యలను అంతుచిక్కని వ్యాధులు వెంటాడాయి. రొయ్యల మార్కెట్‌ను దెబ్బతినడం ప్రారంభమైంది. తొలిదశలో లక్షల రూపాయలు ఆర్జించిన రైతులు అప్పుల ఊబిలో కురుకుపోయారు. క్రమంగా రొయ్యల సాగు విస్తర్ణం తగిపోయింది. వందలాది చెరువులు ఖాళీ అయ్యాయి.

వెనామీ సాగుతో కొంత ఊరట..  
ఐదేళ్ల క్రితం వచ్చిన వెనామీ రకం ఆక్వా రైతుల్లో మళ్లీ ఆశలను చిగురింపచేసింది. వ్యాధులను తట్టుకోవటంతోపాటు భారీగా లాభాలను తెచ్చిపెట్టింది. ఈసాగువైపు అధికశాతం ఆక్వా రైతులు మొగ్గు చూపారు. రెండేళ్ల క్రితం విదేశాల్లో ఆక్వా సాగు ప్రతికూలత కారణంగా దేశీయంగా మనదేశానికి చెందిన ఆక్వా రంగానికి బాగాా కలిచొచ్చింది. రికార్డుస్థాయిలో ధరలు లభించాయి. దీంతో వేలంవెర్రిగా వెనామీ రొయ్యల సాగు చేపట్టారు. గతంలో పాడుపడిన చెరువులు సైతం వెనామీ రొయ్యల సాగుకు నోచుకున్నాయి. ఆ తరువాత సీజన్‌కు పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. ధరలు పూర్తిగా పడిపోవటంతో రైతులు తీవ్రంగా నష్టపోయ్యారు. మళ్లీ ఇప్పుడు శీతాకాలం సాగు వెనామీ సాగుకు ప్రతికూలంగా మారింది. వెనామీపై రైతులు పెట్టుకున్న ఆశలు ఆడియాసలయ్యాయి. తట్టుకోలేని విధంగా ఈరకంపై వైట్‌స్పాట్ విజృంభించటంతో చెరువులు నామరూపాల్లేకుండాపోతున్నాయి. ఇప్పటికే కొందరు రైతులు ప్రస్తుత తరుణంలో వెనామీ సాగు చేసి హెక్టారుకు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు నష్టపోతున్నారు.

మళ్లీ టైగర్ వైపు చూపు..
వెనామీ రొయ్యకు ప్రతికూల పరిస్థితులు వెన్నాడటంతో శీతాకాలం రొయ్యల సాగుకు స్వస్తి చెబుతున్నారు. చెరువులు ఆరబెట్టి మళ్లీ మేలురకం టైగర్ రొయ్యపిల్లతో సాగు చేసేందుకు చెరువులను సిద్ధం చేసుకుంటున్నారు. రొయ్యపిల్లలు ఉత్పత్తి రాష్ర్టంలో ఆశించిన మేర అందుబాటులో లేకపోవటంతో పాండిచ్చేరి ప్రాంతం నుంచి టైగర్ రొయ్యపిల్లలను తెచ్చుకునే ఆలోచనలో ఉన్నారు. దీని కోసం ఒక్కొక్క పిల్లను 40 నుంచి 60 పైసలు చెల్లించి దిగుమతి చేసుకునేందుకు ముందుగానే ఆడ్వాన్సులు చెల్లిస్తున్నారు.
 
ఊరిస్తున్న ధరలు..
ఆక్వా రంగంలో ఉత్పత్తి గణనీయంగా ఉంటే ధరలు పడిపోతున్నాయి. ధరలు గణంగా ఉంటే ఉత్పాత్తి నామమాత్రంగా ఉంటుంది. ఈదశలో రైతాంగం కొట్టుమిట్టాడటంతోపాటు ధరలను దళారీలు నిర్ణయిస్తున్నారు. రైతులు పండించిన రొయ్యలకు ధర విషయంలో భరోసా లేకుండాపోతుంది. ప్రస్తుతం వెనామీ 30 కౌంట్ ధర రూ.500 నుంచి రూ.540 పలుకుతోంది. అదే 40 కౌంట్ ధర రూ.450, 50 కౌంట్ వస్తే రూ.400పైనే ధర ఉంది. అయితే ప్రతికూల వాతావరణం వైట్‌స్పాట్ వ్యాధి రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. పెట్టుబడులు తేలక రైతులు నష్టాలబాటలో పయనిస్తున్నారు.
 
ప్రభుత్వం ప్రోత్సాహం లేదు

ప్రభుత్వం నుంచి ఆక్వారంగానికి ప్రోత్సాహం లేదు. విదేశీమారక ద్రవ్యం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈరంగంపై చిన్నచూపు చూస్తోంది. సూర్యలంకలో రొయ్యపిల్లల ఉత్పత్తి కేంద్రం మూలన పడిపోయింది. గత ప్రభుత్వం హయాంలో బాపట్ల మార్కెట్‌యార్డులో రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని పంపిన ప్రతిపాదనలు పురోగతికి నోచుకోలేదు. రొయ్యలకు సోకే వ్యాధులకు సంబంధించి నిర్ధారణ చేసే ప్రభుత్వ నిపుణులు లేక ప్రైవేటు నిపుణులపై ఆధారపడాల్సి వస్తోంది. ఆక్వా చెరువులో రహదారి మార్గాలు సక్రమంగా లేకపోవటం, మురుగునీటి పారుదల ఇబ్బందిగా ఉండటంతో వ్యాధులు త్వరగా సోకుతున్నాయి.ప్రభుత్వం ఆక్వా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి.       - మంతెన గంగరాజు, ఆక్వా రైతు
 
 
సబ్సిడీపై సోలార్ పంపు సెట్లు
ఆక్వారంగాన్ని ప్రోత్సాహించేందుకు, విద్యుత్ సమస్యను నివారించేందుకు సోలార్‌పంపుసెట్లను 85శాతం సబ్సిడీ రైతులకు అందిస్తున్నాం. రూ.4.80లక్షలు విలువ చేసే సోలార్‌పంపుసెట్లుకు కేవలం 15శాతం రైతు చెల్లించగలిగితే ఆయూనిట్‌ను ప్రభుత్వం ద్వారా అందిస్తాం.రూ. 40విలువ చేసే ఎరియేటర్లు ఒక రైతుకు నాలుగు 50శాతం సబ్సిడీపై అందిస్తారు. రూ.16వేలు విలువ చేసే సొలార్‌లైట్ 50శాతం సబ్సిడీపై రైతులకు అందిస్తాం.           - ఉషాకిరణ్, ఎఫ్‌డీవో
 
 

మరిన్ని వార్తలు