చితికిన చేనేత బతుకు

21 Jul, 2014 03:16 IST|Sakshi
చితికిన చేనేత బతుకు

పది నెలలుగా నిలిచిపోయిన వస్త్రాల కొనుగోళ్లు
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రూ.32 కోట్ల నిల్వలు
1.25 లక్షల మంది కార్మికుల దుర్భర జీవితం
ఆప్కో కొనుగోలు చేయకుంటే సొసైటీలు మూతే
మంత్రి జిల్లాలో అత్యధికంగా రూ.11 కోట్ల నిల్వలు
పరిధి దాటిపోయిన క్యాష్ క్రెడిట్
 
 
చల్లపల్లి: రాష్ట్రంలో చేనేత కార్మికుల బతుకులు దుర్భరంగా తయారయ్యాయి. పది నెలలుగా చేనేత వస్త్రాల కొనుగోళ్లను ఆప్కో నిలిపివేయడంతో ఈ పరిస్థితి దాపురించింది. ఫలితంగా సంఘాలపై ఆధారపడిన కార్మికులు పనులులేక పస్తులుంటున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మొత్తం 315 చేనేత సొసైటీలు ఉండగా వాటిలో 1.26 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రతినెలా ఈ సొసైటీల నుంచి సుమారు రూ.3.50 నుంచి రూ.4 కోట్లు విలువైన చేనేత వస్త్రాలు తయారవుతున్నాయి. చేనేత సొసైటీల ద్వారా ప్రధానంగా అందమైన చీరలు, కాటన్ పేటు బుటా, జరీ పేటు బుటా, రిచ్ పల్లు(జాకార్డు), కాటన్ పేటు డోరియా వంటి అందమైన వస్త్రాలను కార్మికులు తయారుచేస్తున్నారు. రాష్ట్రం మొత్తంలో కృష్ణాజిల్లాలో అత్యధికంగా చేనేత వస్త్రాల ఉత్పత్తి జరుగుతోంది. ఆశాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జిల్లాలోనే నెలకు సుమారు రూ.90 లక్షల విలువైన వస్త్రాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇక్కడ సొసైటీలపై ఆధారపడి 6,500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో కొద్దిమేర చేనేత వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేసింది. తరువాత ఈ ఏడాది మేలో కేవలం 5 నుంచి 7 శాతం వస్త్రాలను మాత్రమే  కొనుగోలు చేశారు. గత పది నెలల నుంచి నిల్వలు పేరుకుపోవడంతో సొసైటీల నిర్వహణ కష్టంగా మారింది. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక్కో సొసైటీ రూ.20 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు క్యాష్ క్రెడిట్‌ను వినియోగించుకునేందుకు వెసులుబాటు ఉంది. వస్త్రాల నిల్వలు నెలలు తరబడి పేరుకుపోవడంతో క్రెడిట్ వాడకం పెరిగిపోయి చాలా సొసైటీల్లో క్యాష్ క్రెడిట్ వినియోగ పరిధి దాటిపోయింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.32 కోట్ల మేర చేనేత నిల్వలు పేరుకుపోయాయి.

పనులు లేక.. అప్పులు పుట్టక...

చేనేత వస్త్రాలను తయారుచేసేందుకు సొసైటీలు కార్మికులకు నూలును సరఫరా చేస్తాయి. వీరు తయారుచేసిన వస్త్రాలకుగాను కూలీ ఇస్తాయి. ఒక కుటుంబంలో భార్యా, భర్త కలిసి రోజంతా కష్టపడితే రూ.150 నుంచి రూ.200 వస్తుంది. అమ్మకాలు జరిగితేనే తిరిగి వస్త్రాల తయారీ కోసం నూలు సరఫరా చేస్తారు. అలాంటిది కొనుగోళ్లు నిలిచిపోవడంతో చాలా సొసైటీలు వస్త్రాల తయారీని నిలిపివేశాయి. దీంతో తరతరాల నుంచి ఈ వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న చేనేత కార్మికులు పనులులేక, అప్పు పుట్టక పస్తులుంటున్నారు.
 
 చేనేత రంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో గత పాలకులు కల్పించిన రాయితీల, ఇతర సదుపాయాలు చాలా వరకు నిలిచిపోయాయి.ప్రభుత్వంఇచ్చే పావలావడ్డీ రుణాలు 2011నుంచి సొసైటీలకు ఇవ్వడంలేదు.ఒక్క కృష్ణాజిల్లాలోనే రూ.3 కోట్ల మేర పావలా వడ్డీ రుణాలు సొసైటీలకు అందాల్సి ఉంది.నేషనల్ హ్యాండ్‌లూం డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్‌హెచ్‌డీసీ) నుంచి గతంలో ఇచ్చిన 10 శాతం నూలు రాయితీని సొసైటీలకు ఇవ్వడంలేదు. ఈ రాయితీని 2011 నుంచి 20 శాతానికి పెంచుతున్నట్టు ఆదేశాలు జారీచేసినా ఇంతవరకు అతీగతీ లేదు. కృష్ణాజిల్లాలో రూ.10 కోట్లు నూలు రాయితీ బకాయి ఉంది.

 చేనేత అమ్మకాలపై గతంలో 20 శాతం రిబేటు ఇచ్చేవారు. 2012 నుంచి ఈ రిబేటు కింద సొసైటీలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అమ్మకాలపై రాయితీ ఇవ్వకపోవడంతో అమ్మకాలు పడిపోయాయి.చేనేత బీమా పథకంలో ఈ ఏడాది కొన్ని మార్పులు తీసుకొచ్చినప్పటికీ ఇంతవరకు అమలులోకి రాలేదు. ఈ పరిస్థితుల్లో చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ రంగానికి కల్పించిన రాయితీలను అందించడంతోపాటు, సొసైటీల్లో పేరుకుపోయిన వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే చేనేత రంగం కనుమరుగయ్యే ప్రమాదముంది.
 

మరిన్ని వార్తలు