20 వేల కార్నియాల మార్పిడితో ప్రపంచ రికార్డు

15 Jan, 2015 00:23 IST|Sakshi
20 వేల కార్నియాల మార్పిడితో ప్రపంచ రికార్డు
  • ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యుల అరుదైన ఘనత
  • వైద్య సిబ్బందిని సన్మానించిన గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్
  • గ్రామీణ ప్రాంతాలకు వైద్యసేవలు విస్తరించాలని సూచన
  • కొత్త కార్పొరేట్ ఆస్పత్రులకునగరంలో స్థలమే కాదు, స్థానం కూడా లేదని వ్యాఖ్య
  • సాక్షి, హైదరాబాద్: ‘కార్పొరేట్ ఆస్పత్రులన్నీ హైదరాబాద్‌కే పరిమితమవుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ అవసరానికి మించి ఆస్పత్రులున్నాయి. కొత్తవాటికి ఇక్కడ స్థలమే కాదు.. స్థానం కూడా లేదు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి పేద, మధ్యతరగతి ప్రజలను అనారోగ్యాల నుంచి కాపాడాలి’ అని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సూచించారు.

    హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యవిజ్ఞాన సంస్థ ఇప్పటి వరకూ 20 వేల కార్నియా మార్పిడి శస్త్రచికిత్సలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యవిజ్ఞాన సంస్థలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన నరసింహన్.. కార్నియా మార్పిడి శస్త్రచికిత్సల్లో పాల్గొన్న వైద్యులను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో వైద్యసేవలు ఖరీదైన వస్తువుగా మారాయన్నారు.

    జబ్బు చేసి వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్తే ముందు రూ.2 లక్షలు డిపాజిట్ చేయాలని సూచిస్తున్నారని, లేదంటే మృతదేహాన్ని అప్పగిస్తున్నారని ఆవేదన  వ్యక్తం చేశారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన వైద్యసేవలు అందిస్తున్నందుకు సంతోషంగా ఉన్నా.. అవి కొందరికే అందుతుండటం బాధగా ఉందన్నారు. ఈ పరిస్థితి పూర్తిగా మారాలని, వైద్యసేవలు, ఫీజు వసూళ్లపై మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రభుత్వాలకు సూచించారు.

    అతితక్కువ ఖర్చుతో కార్నియా మార్పిడి శస్త్రచికిత్సలు చేసి రికార్డు సృష్టించిన ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి.. ప్రపంచ కార్పొరేట్ వైద్య సంస్థలకే ఆదర్శంగా నిలిచిందని నరసింహన్ కొనియాడారు. కార్పొరేట్ ఆస్పత్రలతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతాలకు సేవల విస్తరణ, తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యసేవ లు అందించే అంశంపై చర్చించి, వాటిని ఆ దిశగా ప్రోత్సహించాల్సిందిగా ఏపీ, తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రులకు ఈ సందర్భంగా సూచించారు. ఇందుకు ఎల్వీ ప్రసాద్ వైద్యులు చొరవ తీసుకోవాలని కోరారు.
     
    మన కార్నియాలు మార్పిడికి పనికిరావు

    ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యవిజ్ఞాన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ గుళ్లపల్లి ఎన్ రావు మాట్లాడుతూ.. దేశంలో ఐ బ్యాంక్ ఏర్పాటు చేయాలని తాము భావించినప్పుడు చాలామంది వద్దని వారించారని, కొంతమందైతే భారతీయుల కార్నియాలు మార్పిడికి పనికిరావని చెప్పారన్నారు. అయినా అధైర్యపడకుండా 1989లో తొలి నేత్రనిధిని ప్రారంభించానని, ఇప్పటి వరకు 20 వేల కార్నియా మార్పిడి శస్త్రచికిత్సలు చేశామని చెప్పారు. వీటిలో 55 శాతం శస్త్రచికిత్సలు ఉచితంగా చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్, డాక్టర్ మనోజ్ గుల్లాటి తదితరులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు