అభయ కిరణం

8 Feb, 2014 03:55 IST|Sakshi

 ఆ యువకుడు అందరిలా ఆలోచించలేదు.. చదువు..ఉద్యోగమే కాదు సామాజిక బాధ్యత కూడా తనదేననుకున్నాడు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకట్టవేయాలని తలంచాడు. ఇందుకు సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకున్నాడు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపకల్పన చేసి ఎంతో మంది మహిళల్లో ధైర్యాన్ని నింపాడు. అంతేకాదు సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు. రాష్ట్రపతికి సందేశాలు పంపే సాఫ్ట్‌వేర్‌ను తయారు చేశాడు. భావి ఇంజనీర్లకు ఆదర్శంగా నిలుస్తున్న కిరణ్ కుమార్ స్ఫూర్తిగాథ ఇది.
 - న్యూస్‌లైన్, ఆదోని రూరల్
 
 కడప జిల్లా రాజంపేటకు చెందిన సుబ్బనాయుడు, భాగ్యమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కిరణ్‌కుమార్ ఆదోని పట్టణంలోని భీమా ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీటెక్ (సీఎస్‌ఇ) చదివాడు. కళాశాలలో చురుగ్గా ఉండేవాడు. పలు సామాజిక సమస్యలపై స్పందించేవాడు. కళాశాలలో చదివే రోజుల్లోనే తనకు తెలిసిన సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే అలార్ సిస్టంను తయారు చేసి అందరిచేత మన్ననలు పొందాడు. రైళ్లలో వెళ్లేటప్పుడు చాలా మంది ఆదమరిచి నిద్రపోతూ స్టేజి దాటి వెళ్తుంటారు. ఇలాంటి వారి కోసం గ్లోబల్ పొజిషన్ సిస్టం ద్వారా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ తయారు చేశాడు. దీనిని సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటే మనం దిగవలసిన స్టేజీకి 20 నిమిషాల ముందే అలర్ట్ కాల్ వస్తుంది. సెల్‌కు మేసేజ్ కూడా అందుతుంది.   
    
 మహిళలకు అండగా ‘సాక్షి అభయ’ అప్లికేషన్
 నగరాలు, పట్టణాలలో ఇటీవల మహిళలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయి. దీంతో వారు ఒంటరిగా బయటికి వెళ్లాలంటే భయాందోళనలు చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలను సాక్షి అభయ అప్లికేషన్ ఆపద్భాందవుడిలా ఆదుకుంటోంది. ఈ అప్లికేషన్ తయారు చేయడానికి కిరణ్ కుమార్ ఆరు నెలలు శ్రమించారు. ఈ అప్లికేషన్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీ స్మార్ట్ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవాలి.

తరువాత మీ కుంటుం సభ్యులు, స్నేహితుల మొబైల్ నంబర్లు, ఇ మెయిల్, ఫేస్ బుక్ ఐడీలను రిజిష్టర్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఆపద సంభవించినప్పుడు అప్లికేషన్ హోం స్క్రీన్‌పై ఉండే హెల్ప్ అనే బటన్‌ను క్లిక్ చేస్తే కేవలం 10 సెకన్ల వ్యవధిలో గ్లోబుల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా ఆ సమయానికి మీరున్న ప్రదేశవివరాలతో పాటు సహాయాన్ని కోరుతూ ముందుగానే కంపోజ్ చేసిన సందేశం మీ సన్నిహితులకు ఎస్‌ఎంఎస్, ఇ-మెయిల్ రూపంలో వెళ్తుంది. ఈ సమయంలోనే మొబైల్ అటోమేటిక్‌గా వీడియోను కూడా తీసి సెల్ మెమరీ కార్డులో నిక్షిప్తం చేయడంతో నిందితులను సులువుగా గుర్తించవచ్చని కిరణ్‌కుమార్ పేర్కొంటున్నారు.
 
 సేవ్ అవర్ ఏపీ..
 రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాలను రాష్ట్రపతికి తెలియేసేందుకు సేవ్ అవర్ ఏపీ అండ్రాయిడ్ అప్లికేషన్‌ను కిరణ్‌కుమార్ తయారు చేశాడు. గూగుల్ ప్లే స్టోర్‌నుంచి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ట్చఠిౌ్ఛఠట్చఞ అని స్పేస్ లేకుండా కొట్టాల్సి ఉంది. వీడియో క్లిప్పింగ్స్, ఫోటోలను అప్‌లోడ్ చేసి సెండ్ చేస్తే నేరుగా రాష్ట్రపతి మెయిల్‌కు వెళ్తాయి.
 
 అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి
 కిరణ్ కుమార్ చదువుకునే  సమయం నుంచి సాంకేతిక రంగంలో కొత్త అంశాలపై దృష్టి సారించారు. మహిళలపై వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలకు అడ్డుకట్ట వేయాలని సాక్షి అభయ అప్లికేషన్‌ను తయారు చేసి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశాడు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని రాష్ట్రపతికి తెలియజేసేందుకు సేవ్ అవర్ ఏపీ అండ్రాయిడ్ మొబైల్ అప్పికేషన్ తయారు చేశాడు. కిరణ్ కుమార్ ప్రతిభను గుర్తించి వైఎస్సార్సీపీ ఐటీ విభాగం రాష్ట్ర కమిటీలో చోటు కల్పించారు.
 
 ప్రోత్సాహం మరువలేనిది- కిరణ్ కుమార్
 నేను ప్రస్తుతం హైదరాబాదులో ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సాక్షి ఎడిటర్ సజ్జల రామక్రిష్ణారెడ్డి, ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా మధుసూదన్ రెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి సహకారం మరువలేనిది. పార్టీకి ఉపయోగ పడడమే కాకుండా సమాజానికి ఉపయోగపడే అప్లికేషన్స్‌ను భవిష్యత్‌లో తయారు చేస్తాను. భీమా కళాశాల యాజమాన్యం, అధ్యాపకుల ప్రోత్సాహంతోనే నేను ఇంతటి వాడిని కాగలిగాను.
 
 గర్వపడుతున్నాం:  శ్రీకాంత్ గౌడ్, ప్రిన్స్‌పాల్, భీమా ఇంజినీరింగ్ కాలేజ్
 తమ కాలేజ్ విద్యార్థి సమాజానికి ఉపయోగపడే అప్లికేషన్స్ తయారు చేస్తుండడం ఎంతో గర్వ కారణంగా ఉంది. కాలేజ్‌లో కూడా కొత్త అంశాలపై ఎక్కువగా దృష్టి సారించేవారు. అప్లికేషన్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో అందరికీ అందుబాటులో ఉంచేలా చేయడం అభినందించదగ్గ విషయం. ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు కిరణ్ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు