నాటకాలతో చైతన్యం

27 Oct, 2014 02:41 IST|Sakshi
నాటకాలతో చైతన్యం

ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి

 ఆదోని:  తరతరాల సంస్కృతి, సాంప్రదాయాలను ముందు తరాలకు అందించడంతోపాటు ప్రజా చైతన్యానికి వేదికగా ఉండే నాటకాలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి పట్టణంలోని రిక్రియేషన్ క్లబ్‌లో ప్రదర్శించిన ‘కళ్లగురు-సుళ్లశిష్య’ (దొంగ గురువు-అబద్ధాల శిష్యుడు) నాటకం ఆద్యంతమూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. గురూజీ ముసుగులో దొంగస్వామి, ఆయన శిష్యుడు చేసే అకృత్యాలు..అంతిమంగా వారి ఆగడాలకు చెక్ పెట్టడం వరకు మధ్యలో సాగిన సన్నివేశాలు, చతురోక్తులతో కూడిన సంభాషణలతో ఆయా పాత్రధారులు తమ పాత్రలను రక్తి కట్టించారు.

 ప్రముఖ నాట కళాకారులు నాగయ్యస్వామి, గంగాధర, యరగట్టి ప్రమోద్, గోకార, బసవరాజ మదిరి, గీతా గుళేదగుట్ట, హేమావతి, అంబిక, రవి జాలహాళ తదితరులు వివిధ పాత్రలను ధరించారు. సామాజిక సందేశంతో కూడిన ఈ నాటక ప్రదర్శనకు ముందు ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. రంగస్థల ప్రదర్శనలకు ప్రోత్సాహం కరువవుతోందని, దీనినే నమ్ముకున్న కళాకారుల జీవితాలు దుర్భరంగా మారాయని  ఆవేదన వ్యక్తం చేశారు. రంగస్థలం కూడా ఒక శక్తివంతమైన మాధ్యమమేనని, కొన్ని నాటకాలు ప్రజలను ఎంతగానో చైతన్యవంతుల్ని చేశాయని కొన్నింటిని ఉదహరించారు.

నాటక రంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నాటక ప్రదర్శనను ఏర్పాటు చేసిన ఘన మఠేశ్వర నాట్య సంఘం నిర్వాహకులు కె.మహేబలేశ్వరప్ప, చెన్నబసప్పను ఆయన అభినందించారు. అధికారులతో మాట్లాడి రిక్రియేషన్ క్లబ్ నాటక ప్రదర్శన వేదిక అద్దెను రద్దు చేయిస్తానని హామీ ఇచ్చారు. మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ దత్తాత్రేయ గౌడ్ మాట్లాడుతూ, కళాకారులకు ప్రభుత్వం తనవంతుగా చేయూతనందిస్తే నాటకాలు ఎప్పుడూ సజీవంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్, పట్టణ ప్రముఖులు సూగూరప్ప, ప్రతాప్, చంద్రకాంత్‌రెడ్డి, విట్టారమేష్, సోమన్న, మదార్, రామలింగ, ఎండీ బసవరాజు, ముమ్మత్ స్వామి, కళాకారుడు గైక్వాడ్ విశ్వనాథ్ మరికొందరు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు