వేయిస్తంభాల గుడిలో చోరీ

24 May, 2014 03:43 IST|Sakshi
వేయిస్తంభాల గుడిలో చోరీ

అద్దంకి, న్యూస్‌లైన్ : స్థానిక రెడ్డిరాజుల కాలం నాటి వేయిస్తంభాల గుడి(నగరేశ్వరాలయం)లో గురువారం రాత్రి చోరీ జరిగింది. ఆలయ ప్రహరీ, ముఖమండపం, ప్రధాన ఆలయాల గేట్ల తాళాలు పగులగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించారు. విద్యావాసవీ అమ్మవారి నగలు కాజేశారు. ఆలయ అర్చకుడు నూతలపాటి కోటేశ్వరరావు అందించిన సమాచారం ప్రకారం.. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు చేస్తుంటారు. గురువారం సాయంత్రం పూజల అనంతరం యాథావిధిగా గుడి తలుపులు వేసి అర్చకుడు కోటేశ్వరరావు ఇంటికి వెళ్లాడు.

 మరుసటి రోజు ఉదయాన్నే ఆలయాన్ని శుభ్రం చేసేందుకు స్వీపర్ నాగూరమ్మ వచ్చింది. ముఖ మండల తలుపునకు వేసిన తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించి ఆర్చకుడు కోటేశ్వరరావుకు సమాచారం అందించింది. ఆయన వచ్చి విద్యావాసవి మాత అమ్మవారి రెండు బంగారు తాళిబొట్లు, ఇత్తడి కిరీటం, రోల్డ్‌గోల్డ్ చైనులు, బయట ఉన్న ఐదు కిలోల గ్యాస్ స్తంభం అపహరించారని గుర్తించాడు.

అంతేకాకుండా దేవాలయంలో ఉన్న గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్పస్వామి, అమ్మవారు, అయ్యవార్ల ఉత్సవ విగ్రహాలు, దీపాలు, హారతి గరిటెను ఒక గోతంలో మూట గట్టి దాన్ని ఆలయ ప్రహరీ గోడపై పెట్టి తీసుకెళ్లే అవకాశం లేక దొంగలు పరారయ్యారు. దాన్ని తీసుకెళ్లి ఉంటే సుమారు రూ.3 లక్షల విలువైన వస్తువులు చోరీకి గురయ్యేవి. ఇదే ఆలయంలో గతంలో రెండు సార్లు దొంగలు చోరీకి పాల్పడ్డారు. అర్చకుని ఫిర్యాదు మేరకు ఎస్సై సీహెచ్ వెంకటేశ్వరరావు వచ్చి ఆలయాన్ని పరిశీలించారు.

మరిన్ని వార్తలు