ఆదుకుంటామన్నారు.. పట్టించుకోలేదు

20 Nov, 2018 05:04 IST|Sakshi
ఎలకలు కొరకడంతో చనిపోయిన బిడ్డతో లక్ష్మి, భర్త నాగ(ఫైల్‌)

ఎలుకలు కొరకడంతో మృతిచెందిన పసికందు తల్లి ఆవేదన

రూ.10 లక్షల నష్టపరిహారం.. పక్కా ఇల్లు, ఉద్యోగమిస్తామని హామీలిచ్చారు

రెండుసార్లు సీఎం చంద్రబాబును కలిసి విన్నవించుకున్నా న్యాయం జరగలేదు  

తాడేపల్లి రూరల్‌(మంగళగిరి): వైద్యుల నిర్లక్ష్యం వల్ల బిడ్డను పోగొట్టుకొని అన్ని విధాలా నష్టపోయిన తమను ఆదుకుంటామన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత పట్టించుకోలేదని.. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినా న్యాయం జరగలేదంటూ గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఎలుకలు కొరకడంతో మృతి చెందిన పసికందు తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు కోర్టులో పెట్టిన కేసును విత్‌ డ్రా చేసుకోవాలంటూ గుంటూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులు బెదిరింపులకు దిగుతున్నారని వాపోయింది. డిసెంబర్‌ 6న కోర్టు వాయిదా ఉందని.. దానికి వెళ్లాలంటేనే భయమేస్తోందని తెలిపింది. వీటిపై తన గోడు వెళ్లబోసుకునేందుకు సోమవారం ఆమె ఉండవలి–అమరావతి కరకట్ట వెంట ఉన్న సీఎం చంద్రబాబు నివాసం వద్దకు వచ్చింది. అయితే ఆమెకు మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో అక్కడే ఉన్న మీడియా వద్ద బాధితురాలు చావలి లక్ష్మి తన బాధ చెప్పుకున్నారు. ‘2015 ఆగస్టు 20న విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో డెలివరీ అయ్యింది. మగబిడ్డ పుట్టగా.. సమస్య ఉందంటూ మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు పంపించారు. గుంటూరు వైద్యులు ఆపరేషన్‌ చేసి.. వార్డులోకి ఎవరినీ రానివ్వలేదు.

2015 ఆగస్టు 26న వార్డులో ఎలుకలు కొరకడంతో.. మా బిడ్డ చనిపోయాడు. దానిపై ప్రభుత్వం విచారణ చేయగా వైద్యులదే తప్పని తేలింది. అప్పటి వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు, కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే మమ్మల్ని పరామర్శించి.. నష్టపరిహారంగా రూ.10 లక్షలు అందజేస్తామన్నారు. కానీ రూ.5 లక్షలే ఇచ్చారు. ప్రభుత్వం మాత్రం మాకు రూ.10 లక్షలు ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటోంది. అలాగే పక్కా నివాసం, ఉద్యోగం ఇస్తామన్నారు. వీటి గురించి కృష్ణా జిల్లా కలెక్టర్‌ను ఎన్నిసార్లు కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. ముఖ్యమంత్రికి చెప్పుకుందామని ఏడుసార్లు ఆయన ఇంటి వద్దకు వచ్చాం. ఈ ఏడాది జూన్‌ 23న, ఆగస్టు 6న రెండు సార్లు సీఎంతో మాట్లాడాం. కలిసిన ప్రతిసారీ కలెక్టర్‌ దగ్గరకు వెళ్లాలని చెబుతున్నారు. కలెక్టర్‌ను కలిస్తే.. ఆయన తమకు ఉత్తర్వులేమీ రాలేదని చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు