సిండికేట్‌కు ఎక్సైజ్ సలామ్!

22 Jul, 2015 03:07 IST|Sakshi
సిండికేట్‌కు ఎక్సైజ్ సలామ్!

మద్యం దుకాణాలు ప్రారంభమై నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే ఎక్సైజ్‌శాఖ మద్యం సిండికేట్‌కు దాసోహం అంటోంది. మద్యం వ్యాపారంలో అక్రమాలు, నివారించేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే దుకాణాలు ఏర్పాటు చేస్తే వాటిని కూడా సిండికేట్‌కు అనుకూలంగా మార్చుతోంది. ప్రభుత్వ దుకాణాల ఏర్పాటు నుంచి మద్యం అమ్మకాల వరకు అన్ని సిండికేట్లకు లాభసాటిగా ఉండే విధంగా ఆశాఖ వ్యవహరించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
నర్సీపట్నం:
ప్రభుత్వ మద్యం దుకాణాల నిర్వహణ నామమాత్రంగా ఉంటోంది. మరోవైపు మద్యం వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలను పెంచుతున్నారు. ఎమ్మార్పీ అమలుకాలేదు. గొలుసు దుకాణాల విచ్చలవిడిగా ఏర్పాటవుతున్నాయి. ప్రారంభంలోనే ఈ విధంగా ఉంటే ఇక ముందు ఎలా ఉంటుందన్న సందేహం తలెత్తుతోంది. మద్యం దుకాణాల ఏర్పాటును మహిళలు నిరసిస్తున్నా వీధికో గొలుసు దుకాణం ఏర్పాటు చేసి వేలం పాటలు నిర్వహిస్తున్నారు.

నర్సీపట్నం సర్కిల్‌లో...
నర్సీపట్నం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని ఏడు మండలాల్లో 39 మద్యం దుకాణాలు ఉండగా వీటిలో ఆరు మండలాల్లో ఆరు మద్యం దుకాణాలను ప్రభుత్వం తరఫున ఎకై ్సజ్‌శాఖ నిర్వహిస్తోంది. మండలానికి ఒక దుకాణం మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ దుకాణాలను కూడా సిండికేట్‌కు నష్టం లేకుండా అంతగా అమ్మకాలు జరగని మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటుచేశారు. నర్సీపట్నం మున్సిపాలిటీ విషయానికి వచ్చే సరికి పట్టణానికి శివారు బయపురెడ్డిపాలెంలో ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా ఉన్న ఊరులో మద్యం దుకాణం పెట్టడంపై మహిళలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ప్రభుత్వం ఏర్పాటు చేసిన దుకాణాల్లో తక్కువగా నిల్వలు పెట్టారు. వినియోగదారులు నిత్యం వినియోగించే బ్రాండ్లు రకాలు కాకుండా ఖరీదైన మద్యం అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో సగటు మందుబాబులు వచ్చే అవకాశాలు లేకుండా పోయా యి. పరోక్షంగా ప్రైవేటు దుకాణాదారులకు ఎక్సైజ్ అధికారులు సహకరిస్తున్నారన్న వాదన ఉంది.
 
జనావాసాల్లో...
పలు ప్రాంతాల్లో బడికి, గుడికి సమీపంలో దుకాణాలు ఏర్పాటు అవుతున్నా అధికారులు మౌనంగా ఉంటున్నారు. జనవాసాల్లో నివాస ప్రాంతాల్లో దుకాణాల ఏర్పాటు చేస్తున్నారు. మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. విచ్చలవిడిగా గొలుసు దుకాణాలు ఏర్పాటువుతున్నాయి.పట్టణంలో వీధికొక బెల్టుదుకాణం వెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే గొలుసు దుకాణాలకు  వేలం పాటలు నిర్వహించడం విశేషం. దీంతో బహిరంగంగానే గొలుసు దుకాణాలను వందల సంఖ్యలో వెలుస్తున్నాయి. లెసైన్స్ దుకాణాలు కంటే అనధికార మద్యం దుకాణాలు ద్వారా మద్యం వ్యాపారులు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. ఈ విషయమై ఎక్సైజ్ సీఐ జగన్‌మోహన్‌రావును సంప్రదించగా గొలుసు దుకాణాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం దుకాణాల్లో కూడా అన్ని రకాల మద్యం బ్రాండ్లను అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు.

మరిన్ని వార్తలు