ప్రేమ ముసుగులో..!

19 Jun, 2016 02:49 IST|Sakshi
ప్రేమ ముసుగులో..!

►  ప్రియురాలితో సహజీవనం పెళ్లికి పట్టుబట్టడంతో బెదిరింపులు
వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య
కేసును ఛేదించిన పోలీసులు
 .

కర్నూలు: ప్రేమ ముసుగులో ఓ యువతిని వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటన పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. నిందితున్ని అరెస్ట్ చేసి శనివారం.. ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట పోలీసులు హాజరు పరిచారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, ఒకటో పట్టణ సీఐ కృష్ణయ్యతో కలసి శనివారం మధ్యాహ్నం వ్యాస్ ఆడిటోరియంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలను వెల్లడించారు. నందికొట్కూరు మండలానికి చెందిన కిషోర్.. 2013లో కర్నూలు నగరం ఐడియా టెలికాంలో టెరిటోరి సేల్స్ మేనేజర్(టీఎస్‌ఎం)గా పనిచేసేవాడు. అదే సంస్థలో కర్నూలు మేదారి వీధికి చెందిన గొల్ల సురేఖ కూడా పనిచేసేది.

ఆమెతో పరిచయం ఏర్పడి కొంతకాలం తర్వాత ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో సహజీవనం చేశాడు. రెండేళ్ల తర్వాత సురేఖ ఐడియా సంస్థ నుంచి ఎయిర్‌టెల్‌కు మారింది. ఆ క్రమంలో వారిద్దరి సహజీవన వ్యవహారం కిషోర్ భార్యకు తెలిసింది. ఈ నేపథ్యంలో కాపురాన్ని అనంతపురం జిల్లా తాడిపత్రికి మా ర్చాడు. తరచూ కర్నూలుకు వచ్చి వెళ్తున్న కిషోర్‌తో పెళ్లి చేసుకోవాలని  సురేఖ ఒత్తిడి చేయడంతో మొహం చాటేశాడు. ఫోన్‌లో పెళ్లి ప్రస్తావన చేస్తుండేది. అందుకు కిషోర్ నిరాకరించి మరోసారి పెళ్లి ప్రస్తావన చేస్తే సహజీవనం చేసిన అసభ్యకరమైన ఫొటోలను మహాజర్ గ్రూప్‌లో అప్‌లోడ్ చేస్తానని, ఆ ఫొటోలను ఆమె సెల్‌ఫోన్ వాట్సప్‌కు పెట్టి బెదిరించాడు. అసభ్యకరమైన పదజాలంతో ఎస్‌ఎంఎస్‌లు పెట్టి సురేఖను తీవ్రమైన మనోవేదనకు గురిచేసి మానసికంగా హింసించాడు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఏప్రిల్ 27వ తేదీ రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

పెళ్లి సంబంధాలు చెడిపోతున్న కారణంగానే తన కూతురు అఘాయిత్యానికి పాల్పడిందని తండ్రి వన్నప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొదట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. వారం రోజుల తర్వాత సురేఖ సెల్‌ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌లు, వాట్సాప్‌లో ఉన్న అసభ్యకర ఫొటోలను గుర్తించి ఆధారాలతో సహా తండ్రి పోలీసులకు సమర్పించారు. సీఐ బి.ఆర్.కృష్ణయ్య, ఎస్‌ఐ చిరంజీవి రంగంలోకి దిగి కేసును ఛేదించారు. కల్లూరులోని తల్లిదండ్రుల ఇంట్లో నింది తుడు కిషోర్ ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు.
 
ఆత్మహత్య  సమస్యకు పరిష్కారం కాదు: ఎస్పీ
మహిళలకు సంబంధించిన సమస్యలేవైనా ఉంటే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కాని నేరుగా తనకు కాని ఫిర్యాదు చేయవచ్చునని ఎస్పీ ఆకే రవికృష్ణ తెలిపారు. చిన్నచిన్న విషయాలకు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం సమస్యకు పరిష్కారం కాదని సూచించారు.ప్రేమ పేరుతో వంచనకు గురిచేసే మాయగాళ్ల మాటలు నమ్మవద్దని మహిళలకు సూచించారు. ఆత్మహత్యలు చేసుకోవడం ద్వారా తల్లిదండ్రులకు మనోవేదన మిగిలించవద్దని సూచించారు. మహిళా సమస్యల పరిష్కారం కోసం పోలీసు శాఖ నిరంతరం పనిచేస్తుందని హామీ ఇచ్చారు. కేసు మిస్టరీని ఛేదించి నిందితుడిని అరెస్టు చేసినందుకు సీఐ, ఎస్‌ఐలను ఎస్పీ అభినందించారు.  
 

మరిన్ని వార్తలు