రోగుల సహాయకులకూ ఉచిత భోజనం

20 Aug, 2019 03:10 IST|Sakshi

తొలుత బోధనాస్పత్రుల్లో అమలు

అనంతరం జిల్లా ఆస్పత్రులకు విస్తరణ

త్వరలో ఇస్కాన్‌ ప్రతినిధులతో చర్చలు

వైద్యం కోసం వచ్చేవారికి ఆర్థిక భారం నుంచి ఊరట

నిత్యం 10 వేల మందికి ప్రయోజనం

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా బోధనాసుపత్రుల్లో రోగుల సహాయకులకు కూడా ఉచితంగా భోజనం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇన్‌పేషెంట్లుగా చేరిన వారికి ప్రభుత్వమే ఉచితంగా ఆహారం (డైట్‌) అందిస్తున్నా వారి సహాయకులు మాత్రం భోజనం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారి అవస్థలు తొలగించేందుకు ఇన్‌పేషెంట్ల సహాయకులకు కూడా ఉచితంగా భోజనం సమకూర్చనున్నారు. మధ్యాహ్నం, రాత్రి రెండు పూటలా ఉచితంగా భోజనం అందించేందుకు వైద్య విద్య  సంచాలకులు కసరత్తు ప్రారంభించారు. ఇస్కాన్‌ (ఇంటర్నేషనల్‌ సొసైటీ ఫర్‌ కృష్ణా కాన్షియస్‌నెస్‌)తో చర్చించి  రెండు మూడు రోజుల్లో ఓ నిర్ణయానికి రానున్నారు. 

ఆర్థిక భారం నుంచి ఉపశమనం..
ఇస్కాన్‌ ఇప్పటికే హైదరాబాద్‌లోని నీలోఫర్, గాంధీ, ఉస్మానియా, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రుల్లో రోగుల సహాయకులకు ఉచితంగా భోజనం సమకూరుస్తోంది. అదే తరహాలో ఏపీలోనూ అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని వైద్య విద్య సంచాలకులను వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డా.కె.జవహర్‌రెడ్డి ఆదేశించారు. రోగులతో పాటు వారి సహాయకులకు కూడా ఆహారం అందచేయడం ద్వారా వైద్య చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రులకు వచ్చే కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్‌ ఉచితంగా భోజనం సమకూరుస్తుండగా కాకినాడలోని రంగరాయ బోధనాసుపత్రిలో హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్‌ ఆహారాన్ని అందిస్తోంది. ఇలా కొన్ని ఆస్పత్రుల్లో స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా భోజనం అందిస్తున్నా అన్ని చోట్లా ఈ సదుపాయం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భోజనం సమకూరుస్తున్న సంస్థలను అలాగే కొనసాగిస్తూ మిగతా ఆస్పత్రులకు భోజనం అందించడం లేదంటే అన్నీ ఒకరికే అప్పగించాలా? అనే అంశాన్ని ఇస్కాన్‌తో చర్చించిన అనంతరం నిర్ణయించనున్నట్టు వైద్య విద్య అధికారులు తెలిపారు.

రోజూ 10 వేల మందికిపైగా ప్రయోజనం
రాష్ట్రవ్యాప్తంగా 11 బోధనాసుపత్రుల్లో సుమారు 12 వేల వరకు పడకలున్నాయి. సగటున రోజూ 11,500 మంది ఇన్‌పేషెంట్లుగా చేరుతుంటారు. వారి కోసం సహాయకులు కూడా వస్తుంటారు. ఉచిత భోజనం సమకూర్చడం వల్ల నిత్యం 10 వేల మందికిపైగా రోగుల సహాయకులకు మేలు జరుగుతుంది. రోగి సహాయకులు పాస్‌ చూపిస్తే డిస్‌చార్జి అయ్యే వరకు రెండు పూటలా భోజనం అందిస్తారు. వీలైనంత త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. బోధనాసుపత్రుల తరువాత ఈ సేవలను 14 జిల్లా ఆస్పత్రులకు కూడా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. 

మరిన్ని వార్తలు