మద్య నిషేధంలో మహిళల భాగస్వామ్యం

29 Sep, 2019 04:01 IST|Sakshi

గ్రామాల్లో మహిళా కానిస్టేబుళ్లకు బాధ్యత 

ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో కొత్తగా 678 మంది కానిస్టేబుళ్లు   

మహిళా ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యం 

బార్ల సమయం కుదింపునకు త్వరలో ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: దశల వారీగా మద్యపాన నిషేధం అమల్లో మహిళల్ని భాగస్వామ్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మహిళా కానిస్టేబుళ్లను నియమించి మద్యం రక్కసిని తరిమికొట్టనుంది. మహిళా పోలీసింగ్‌తో గ్రామాల్లో మద్యం మహమ్మారిని నిర్మూలించేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. అక్టోబర్‌ 2 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పని చేసేందుకు ప్రత్యేకంగా 14,944 మంది మహిళా కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేసింది. గ్రామాల్లో 11,158 పోస్టులు, వార్డుల్లో 3,786 పోస్టుల్లో మహిళా కానిస్టేబుళ్లను నియమించింది. ఈ తరుణంలో మద్యం షాపులు, బార్లపై మహిళలు చేసే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉన్నత స్థాయి ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ మేరకు గ్రామాలు, పట్టణ/నగర వార్డుల్లో మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి మహిళా కానిస్టేబుళ్లకు ఫిర్యాదు చేయొచ్చు. బెల్టు షాపులను నిర్మూలించేందుకు, అక్రమ మద్యం అరికట్టేందుకు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్‌ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 3,500 మద్యం షాపులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే మద్యాన్ని ప్రజలకు దూరం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. మద్యం బాటిళ్ల కొనుగోలుపైనా పలు ఆంక్షలు విధించింది.

ఈ ఆంక్షలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. ఒక వ్యక్తి ఏ సైజులో అయినా సరే.. మూడు బాటిళ్ల వరకే కొనుగోలుకు, తన ఆధీనంలో ఉంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవలే జీవో జారీ చేసింది. విదేశీ మద్యం అయినా మూడు బాటిళ్లకు మించి కొనుగోలు చేయకూడదు. స్పిరిట్‌ మూడు బల్క్‌ లీటర్లు, కల్లు 2 బల్క్‌ లీటర్లు, బీరు 650 ఎం.ఎల్‌ బాటిళ్లు ఆరు వరకు కొనుగోలు చేసేందుకు అనుమతిచ్చింది. ఈ ఆంక్షల్ని ఉల్లంఘిస్తే ఎక్సైజ్‌ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఈ నిబంధనలు అమలయ్యేలా గ్రామాలు, వార్డుల్లో ప్రత్యేకంగా మహిళలను భాగస్వాములు చేస్తున్నారు.  

బార్ల సమయం త్వరలో తగ్గింపు
ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పని చేయనున్నాయి. అయితే బార్లకు మాత్రం రాత్రి 11 గంటల వరకు సమయముంది. అయితే ఫుడ్‌ సర్వింగ్‌ పేరిట అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో బార్ల సమయాన్ని కుదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. బార్ల యజమానులు ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు చేపట్టేలా ఎక్సైజ్‌ శాఖకు ఆదేశాలు జారీ కావడం గమనార్హం.   

678 కానిస్టేబుళ్ల పోస్టులకు ప్రతిపాదనలు
ఎక్సైజ్‌ శాఖలో మొత్తం వెయ్యి వరకు కానిస్టేబుళ్ల ఖాళీలున్నాయి. వీటిలో 678 పోస్టులను కొత్తగా భర్తీ చేసేందుకు ఎక్సైజ్‌ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆర్థిక శాఖ అనుమతి రాగానే వీటిని భర్తీ చేసేందుకు ఎక్సైజ్‌ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ భర్తీలోనూ మహిళా కోటాకు ముందుగా ప్రాధాన్యత ఇచ్చి భర్తీ చేస్తారు. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో అక్రమ మద్యం, సారా తయారీ దూరం చేయడంతో పాటు తాగుడు వ్యసనాన్ని మాన్పించడమే మహిళా పోలీసింగ్‌ లక్ష్యం.

మరిన్ని వార్తలు