వడగాడ్పులు.. పిడుగుల వానలు!

28 May, 2019 04:31 IST|Sakshi

రాష్ట్రంలో 8 మంది మృత్యువాత

ఆవరించిన ద్రోణి, ఆవర్తనాలు

సాక్షి, విశాఖపట్నం/తాడేపల్లి: రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకపక్క ఉష్ణతీవ్రతతో వడగాడ్పులు కొనసాగుతుండగా మరోపక్క పిడుగులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. సాధారణంకంటే 3–5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల వడగాడ్పులు ప్రభావం మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయని ఐఎండీ సోమవారం రాత్రి నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో సోమవారం వడగాడ్పులకు 8 మంది మృతి చెందారు. గుంటూరు జిల్లాలో ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. రాయలసీమ నుంచి కొమరిన్‌ ప్రాంతం వరకు తమిళనాడు మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

దీంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్రలో, రెండు రోజులు రాయలసీమలో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల పిడుగులు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. గడచిన 24 గంటల్లో ఆళ్లగడ్డ, గుత్తిలో 5, వింజమూరు, అర్థవీడు, జియ్యమ్మవలస, మార్కాపురం, కోయిలకుంట్ల, రాయదుర్గం, పమిడిల్లో 3 సెం.మీ వర్షపాతం నమోదైంది. సోమవారం రాత్రి విశాఖలో ఉరుములు, పిడుగులతో వర్షం కురిసింది. 

రానున్న 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇలా.. 
- మే 28న ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 46 నుంచి 48 డిగ్రీలు, శ్రీకాకుళం, ప్రకాశం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నివారణ సంస్థ తెలిపింది.  
మే 29న విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 46 నుంచి 47 డిగ్రీల వరకు, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి.
మే 30న ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 43 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. 
మే 31వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 43 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతల నమోదుకు అవకాశం ఉంది. జూన్‌ ఒకటిన.. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు, విశాఖ, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంత జిల్లాల్లో 42 నుంచి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది.  

మరిన్ని వార్తలు