తొమ్మిది సరుకుల్లో మూడే పంపిణీ..

14 Dec, 2014 02:54 IST|Sakshi

కర్నూలు : చౌక దుకాణాల్లో తొమ్మిది రకాల సరుకుల పంపిణీ అటకెక్కింది. రూ.185కే సరుకులు అందుకుంటున్న నిరుపేదలు పథకం  ఆగిపోవడంతో ఆవేదన చెందుతున్నారు. లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చిన పథకం నిర్వీర్యం కావడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పేద కుటుంబాలకు ప్రయోజనకరంగా ఉన్న పథకం నిలిచిపోవడంతో జిల్లా వ్యాప్తంగా కార్డుదారుల్లో నిరసన వ్యక్తమవుతోంది. నాలుగు నెలలుగా కేవలం బియ్యం, కిరోసిన్, చక్కెరతో సరిపెడుతుండటంతో ప్రతి కార్డుదారుడు మిగిలిన సరుకుల కోసం నెలకు రూ.175 అదనపు భారం భరిస్తున్నాడు. ఈ లెక్కన నెలకు రూ.18 కోట్లు కార్డుదారులపై అదనపు భారం పడుతోంది. గత నాలుగు నెలలుగా రూ.72.16 కోట్లు పేద ప్రజలు అదనపు భారం భరించారు. కొత్త ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని వినియోగదారులు కోరుతున్నారు.
 
 జిల్లాలో 11.40 లక్షల మంది తెల్లరేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా 2411 చౌక డిపోల ద్వారా రాయితీపై తొమ్మిది రకాల సరుకులు పంపిణీ చేసేవారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మహస్తం సరుకుల్లో కోత విధించి సరఫరా నిలిపివేసింది. నాలుగు నెలలుగా కేవలం బియ్యం, కిరోసిన్, చక్కెర సరఫరాతో సరిపెడుతున్నారు. పామాయిల్, కందిపప్పు, గోధుమ పిండి, కారం, ఉప్పు, చింతపండు, పసుపు, గోధుమలు తదితర నిత్యావసర సరుకుల సరఫరా గురించి పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టించుకోవడం మానేశారు. కార్డుకు కిలో పామాయిల్ చొప్పున 11.40 లక్షల కిలోల పామాయిల్ సరఫరా చేయాల్సి ఉంది.
 
 బహిరంగ మార్కెట్‌లో పామాయిల్ రూ.75 వరకు ధర పలుకుతుండగా రేషన్ దుకాణాల్లో మాత్రం రూ.40కి సరఫరా చేసేవారు. పేదలకు ఇచ్చే సబ్సిడీ సరుకుల్లో కందిపప్పు కూడా ముఖ్యమైనదే. పామాయిల్ మాదిరిగానే కందిపప్పు కూడా జిల్లాలో 11.40 లక్షల కిలోలు సరఫరా చేయాలి. రేషన్ దుకాణంలో కందిపప్పు కిలో రూ.50 ఇచ్చేవాళ్లు. బహిరంగ మార్కెట్‌లో ధర రూ.80 పలుకుతోంది. చక్కెర సరఫరాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్కొక్క కార్డుదారునికి అరకిలో చొప్పున పంపిణీ జరుగుతుండగా ముందుగా ఎవరు వస్తే వారికే అనే రీతిలో పంపిణీ చేస్తుండటంతో కార్డుదారులందరికీ అందడం లేదు.  
 
 స్టోర్ నిర్వహణ
 భారంగా మారింది
 ప్రజా పంపిణీ సరుకుల్లో కోత విధించడంతో కమీషన్ తగ్గిపోయి స్టోర్ నిర్వహణ కూడా భారంగా మారింది. బాడుగలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. రవాణా ఖర్చులు పెరిగాయి. ఆధార్ వల్ల కార్డుల సంఖ్య కూడా తగ్గిపోయింది. బయోమెట్రిక్ అమలు చేస్తే చౌక డిపో నిర్వహణ మరింత భారంగా మారుతోంది. ఈ విధానం అమలు చేస్తే డీలర్లకు నిర్వహణ ఖర్చు పోను నెలకు రూ.15 వేలు వేతనం ఇవ్వాలి. ఇప్పటికే చాలామంది డీలర్లు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు.    
 - వెంకటేష్ గౌడ్, డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు
 
 మూన్నాళ్ల ముచ్చటే
 రేషన్‌కార్డు ద్వారా 9 సరుకుల పంపిణి మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ప్రస్తుతం బియ్యం, కిరోషిన్, చక్కెర మాత్రమే ఇస్తున్నారు. చక్కెర అర కిలో మాత్రమే ఇవ్వడంపై ప్రభుత్వం పునరాలోచించాలి. ప్రతి వినియోగదారుడు ఇష్టపడే గోధుమలు,గోధుమ పిండి,చింతపండు, పామాయిల్ సప్లయిని నిలిపి వేయడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. పేద ప్రజల ఇబ్బందులను గమనించి ప్రభుత్వ నిలిపివేసిన సరుకులను పంపిణి చేయవలసిన అవసరముంది.  
 - షేక్ జమాల్‌వలి, రేషన్ కార్డుదారుడు, బనగానపల్లె
 
 చక్కెర కోటా పెంచాలి  
 చౌక డిపోల ద్వారా అరకిలో మాత్రమే చక్కెర ఇస్తున్నారు. కనీసం రెండు కిలోలు చౌక డిపోల ద్వారా సరఫరా చేస్తే పేద ప్రజలకు ఊరట ఉంటుంది. చౌకదుకాణల ద్వారా పంపిణి చేస్తున్న 9 రకాల సరకులు నిలిచిపోవడానికి ప్రభుత్వమే కారణం. ప్రతి నెలా వినియోగదారులు పొందే పామాయిల్, గోధుమలు, కందిపప్పు, గోధుమ పిండి సప్లయిని ప్రభుత్వం నిలిపివేయడం బాధగా ఉంది. ఈ సరుకులను బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధరకు వేచ్చించి కొనుగొలు చేయాల్సి వస్తుంది.
 - బుచ్చిరెడ్డి, మిట్టపల్లి
 
 మూడు నెలలుగా బియ్యం వేయడం లేదు
 ఆధార్ నెంబర్లు డీలర్లకు ఇచ్చాం. ఆన్‌లైన్‌లో ఆధార్ నెంబర్ ఎక్కలేదని మూడు నెలలుగా డీలరు బియ్యం వేయడం లేదు. కార్డులో నేను, నా భార్య, ఇద్దరు పిల్లలం ఉన్నాం. నెలకు 16 కేజీలు వచ్చేవి. బియ్యం వేయాలని ఎమ్మార్వో ఆఫీస్‌లో అర్జీ పెట్టుకున్నాను. అయినా ఇంతవరకు ఆన్‌లైన్‌లో ఆధార్ నెంబర్ ఎక్కలేదు. డీలర్ బియ్యం వేయడం లేదు.   
 - బోయ వీరన్న, కోడుమూరు
 

మరిన్ని వార్తలు