పల్లెల్లో సౌకర్యాలు లేవు

11 Apr, 2018 01:59 IST|Sakshi

     హ్యాపీ సిటీ సమ్మిట్‌లో సద్గురు జగ్గీవాసుదేవ్‌

     ఆనందనగరంగా అమరావతి: సీఎం చంద్రబాబు 

సాక్షి, అమరావతి: గ్రామాల్లో సౌకర్యాలు లేవని, గ్రామాలు, పట్టణాల మధ్య సౌకర్యాల్లో అంతరం తగ్గితేనే ప్రజల్లో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుందని ఈషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ అన్నారు. మంగళగిరి సమీపంలోని సీకే కన్వెన్షన్‌ హాలులో సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో మూడురోజుల పాటు జరిగే హ్యాపీ సిటీస్‌ సమ్మిట్‌ (ఆనంద నగరాల సదస్సు) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేకంగా సంభాషించారు. సౌకర్యాలన్నీ పట్టణాల్లోనే కేంద్రీకృతమవుతుండటంతో పల్లెల నుంచి జనం పట్టణాలకు తరలివస్తున్నారని, దీనివల్ల పట్టణ జనాభా పెరిగి సౌకర్యాలు తగ్గిపోతున్నాయని చెప్పారు. పల్లెల్లోనూ ఆహ్లాద, వినోద కార్యకలాపాలు పెరిగితే పట్టణాల్లో జనసమ్మర్థం తగ్గుతుందన్నారు.

ఆనందం అనేది మానవులకే కాదని, అది అన్ని జీవరాశులకు ఉండాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేస్తూ అమరావతిని ఆనందనగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రపంచ సంతోష నగరాల సదస్సును దేశంలో తొలిసారిగా అమరావతిలో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఐజీబీసీ–2018 గ్రీన్‌సిటీ ప్లాటినమ్‌ రేటింగ్‌ అవార్డుకు అమరావతి నగరం ఎంపికైందని సదస్సులో ప్రకటించిన ఆ సంస్థ చైర్మన్‌ ప్రేమ్‌ జైన్‌ దాన్ని సీఎం చంద్రబాబుకు అందించారు. అమరావతిని ఆనంద నగరంగా తీర్చిదిద్దే మాస్టర్‌ప్లాన్‌ను జగ్గీవాసుదేవ్‌ ఆవిష్కరించారు.     

మరిన్ని వార్తలు