టీడీపీ నేతల కోడ్‌ ఉల్లంఘన పట్టదా..?

5 Mar, 2019 17:56 IST|Sakshi
నిమ్మలవలసలో టీడీపీ మాజీ సర్పంచ్‌ వర్మతో కలిసి వివరాలు సేకరిస్తున్న వ్యవసాయశాఖాధికారులు 

టీడీపీ నాయకులతో కలిసి వ్యవసాయశాఖ ఇంటింటికీ కార్యక్రమం

అన్నదాత సుఖీభవ రాని వారి పత్రాల సేకరణ

ప్రభుత్వ కార్యాలయాలు వదలని టీడీపీ నాయకులు

పత్తా లేని కోడ్‌ అమలుచేయాల్సిన అధికారులు

సాక్షి, చీపురుపల్లి: ఓ వైపు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోడ్‌ అమల్లో ఉంది. మరోవైపు సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్‌ నేడో, రేపో విడుదలకానుంది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని సాక్షాత్తూ కలెక్టరే దిశా నిర్దేశం చేశారు. అదే విషయంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడుకు ఎన్నికల కమీషన్‌ నోటీసులు కూడా ఇచ్చింది. ఇంత జరుగుతున్నా చీపురుపల్లి నియోజకవర్గంలో ఎన్నికల కోడ్‌ అమలు చేయాల్సిన అధికారులు పత్తా కనపడడం లేదు.

దీనికి తోడు మరికొంత మంది అధికారులు ఇంకా తెలుగుదేశం నేతలతో బంధుత్వాలు వదులుకోలేక వారే సర్వసం అన్నట్లు వ్యవహరిస్తున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇంత జరుగుతున్నా కోడ్‌ ఉల్లంఘనకు గురవుతున్నా పట్టించుకోవాల్సిన అధికారులు మాత్రం కనీసం స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో పక్కాగా కోడ్‌ ఉల్లంఘనకు దారి తీసిన సంఘటనలో తాజాగా ఎన్నో జరుగుతున్నాయి. రెండు రోజులు క్రితమే మెరకముడిదాం మండలంలోని గర్భాం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు సైకిళ్లు పంపిణీ చేశారు.

తాజాగా వ్యవసాయశాఖ మండల, గ్రామ స్థాయి అధికారులు గ్రామాల్లోకి వెళ్లి తెలుగుదేశం గ్రామస్థాయి నేతలను వెంటబెట్టుకుని అన్నదాత సుఖీభవ పథకం కోసం రైతుల వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇంకా ప్రభుత్వ కార్యాలయాల్లోనే కూర్చుంటూ వారి రాజకీయాలు సాగిస్తున్నారు. జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా చీపురుపల్లి నియోజకవర్గంలో కోడ్‌ ఉల్లంఘన జరుగుతున్నా సరే ఇక్కడున్న అధికారులు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. ఇలాంటి పరిస్థితులు ఉంటాయనే ఎన్నికల సందర్భంగా ఎంపీడీఓ, తహసీల్దార్‌ను ఎన్నికల కమీషన్‌ మార్చినా కొత్తగా వచ్చిన అధికారులు సైతం అధికార పార్టీకు అండగా ఉంటూ వారికి కోడ్‌ వర్తించదు అనే విధంగా వ్యవహరిస్తుండడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ కార్యాలయాల్లోనే టీడీపీ నాయకులు
నియోజకవర్గంలోని చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం, గుర్ల మండలాల్లో గల ప్రభుత్వ కార్యాలయాలైన పంచాయతీ నుంచి మండల పరిషత్‌ వరకు అన్ని కార్యాలయాల్లోను అధికార తెలుగుదేశం పార్టీ నేతలు కూర్చుని పంచాయతీలు, రాజకీయాలు చేసుకుంటున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానంత వరకు ప్రజాప్రతినిధులగా వారి ఇష్టం. కాని కోడ్‌ అమల్లోకి వచ్చినా సరే ప్రభుత్వ కార్యాలయాల్లోనే కూర్చుని తెలుగుదేశం పార్టీ పరంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తుందని పలువురు అబిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ నేతలతో వ్యవసాయశాఖ కార్యాక్రమాలు
ఇది ఇలా ఉండగా ఎన్నికల నేపథ్యంలోనే కొద్ది రోజులు క్రితం ప్రారంభమైన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో డబ్బులు పడని రైతుల వివరాలు సేకరించే పనిలో వ్యవసాయశాఖ మండల, గ్రామ స్థాయి అధికారులు నిమగ్నమయ్యారు. అయితే వీరంతా గ్రామాల్లోకి వెళ్లి అక్కడ టీడీపీ నేతలను వెంటబెట్టుకుని రైతులు వద్దకు వెళుతున్నారు. అన్నదాత సుఖీభవ పథకంలో డబ్బులు వస్తాయని, వివరాలు ఇవ్వాలని అడుతున్నారు. దీంతో ఆ కార్యక్రమం మొత్తాన్ని ఆ గ్రామంలో టీడీపీ నేతలే చేసినట్లు ప్రజలు భావించాల్సి వస్తుంది. అసలు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో ఇలా వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లోకి వెల్లి వారే స్వయంగా చేసుకోవాల్సి ఉన్నప్పటికీ అక్కడి టిడీపీ నేతలు సహకారంతో, వారిని పక్కనే పెట్టుకుని ఇలా చేయడం కోడ్‌ ఉల్లంఘన జరిపినట్లేనని పలువురు విమర్శిస్తున్నారు. దీనిపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకులు సైతం జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

సమాచారం ఇవ్వలేదు
నిమ్మలవలస గ్రామంలో వ్యవసాయశాఖ అధికారులు రైతుల వివరాల సేకరణకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. గ్రామస్థాయిలో ఉండే తెలుగుదేశం నేతలను తీసుకుని రైతులు వివరాలు సేకరిస్తున్నారు. కోడ్‌ ఉన్న సమయంలో కూడా ఇలా అధికార పార్టీకు చెందిన నాయకులతో అధికారులు కార్యక్రమాలు నిర్వహించడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం.
– అధికార్ల శ్రీనుబాబు, మాజీ సర్పంచ్, నిమ్మలవలస

మరిన్ని వార్తలు