రూ.300 టికెట్ల కరెంట్ బుకింగ్ రద్దు లేదు

5 Sep, 2014 01:09 IST|Sakshi

సాక్షి, తిరుమల: తిరుమలలో రూ.300 టికెట్ల కరెంట్ బుకింగ్‌ను ఇప్పట్లోనే రద్దుచేసే యోచన లేదని జేఈవో కే ఎస్ శ్రీనివాసరాజు వెల్లడించారు. అడ్వాన్స్ బుకింగ్ విధానంలో రూ.300 టికెట్లు పొందిన భక్తులు దర్శనానికి వెళ్లే ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే కరెంట్ బుకింగ్‌లో టికెట్లు అమ్మబోమన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఆన్‌లైన్, ఈ-దర్శన్ రూ.300 టికెట్ల పనితీరు సజావుగా సాగుతోందన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల తర్వాత మాత్రమే  కొత్త విధానం అమలులో వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని జేఈవో చెప్పారు.
 
శ్రీనివాసరాజు వెల్లడించిన మరికొన్ని అంశాలివీ... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక పర్యాటక సంస్థలకు రూ.300 టికెట్లు ఇచ్చే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. బేడి ఆంజనేయ స్వామికి కూడా హారతి సమర్పించే పురాతన సంప్రదాయాన్ని పునరుద్ధరించాలని సంకల్పించారు. తిరుపతి పరకామణిలో మొత్తం 40 టన్నుల విదేశీ నాణేల్లో అమెరికా, మలేసియాకు చెందిన నాణేలను వేరు చేశారు. వీటిని ఐసీఐసీఐ బ్యాంకు ప్రతినిధుల ద్వారా విక్రయించనున్నారు. తిరుమలలో సరిపడా నీటి నిల్వలు ఉన్నందున బ్రహ్మోత్సవాల్లో ఇబ్బంది ఉండదని జేఈవో తెలిపారు. కాగా, టీటీడీపై జేఈవో శ్రీనివాసరాజు ఏపీ శాసనసభ స్పీకర్‌కు నేడు నివేదిక అందించనున్నారు.

మరిన్ని వార్తలు