కార్పొరేషన్‌పై స్పష్టత ఏదీ?

4 Feb, 2016 02:00 IST|Sakshi

మంత్రి కొల్లును విమర్శించిన వైఎస్సార్ సీపీ నేత పేర్ని నాని
 
మచిలీపట్నం టౌన్ : మచిలీపట్నం మునిసిపాల్టీని కార్పొరేషన్‌గా మార్చే అంశంపై మంత్రి కొల్లు రవీంద్ర పూటకో మాట, అసత్యాలు వల్లిస్తూ ప్రజలను మోసగిస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ   డిసెంబరు 9న మునిసిపాల్టీని కార్పొరేషన్‌గా మారుస్తూ ప్రభుత్వం 268 జీవోను జారీ చేసిందన్నారు.జీవో విడుదల నాటి నుంచి ప్రస్తుతం ఉన్న మునిసిపల్ పాలకవర్గం రద్దయినట్లేనని 1994 మునిసిపల్ కార్పొరేషన్ చట్టం తేటతెల్లం చేస్తోందన్నా రు. జీవో వచ్చిన నాటినుంచి కార్పొరేషన్‌కు ప్రత్యేక అధికారి నియమించడం, ఒకవేళ ప్రభుత్వం ఆయనను నియమించకుంటే అక్కడ పనిచేస్తున్న కమిషనరే ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తారని ఈ చట్టంలో  పేర్కొన్నారన్నారు. చట్టంలో ఇంత స్పష్టంగా ఉంటే మంత్రి రవీంద్ర మాత్రం జీవో వచ్చిన రోజున చైర్మన్ బాబాప్రసాద్ మేయర్, కౌన్సిలర్లు కార్పొరేటర్లు అయ్యారని వారికి పలువురు సన్మానాలు కూడా చేసి మిఠాయిలు పంచారన్నారు.

ఇటీవల జరిగిన విలేకర్ల సమావేశంలో మంత్రి రవీంద్ర మచిలీపట్నం మునిసిపల్ పాలకవర్గ పదవీకాలం ముగిసే (2019) వరకు మునిసిపాల్టీగానే ఉంటుందని చెప్పారన్నారు. ప్రభుత్వం ఒక్కసారి జీవో విడుదల చేశాక ఆ జీవోను రద్దు చేయకుండా బాధ్యతాయుతమైన, గురుతరమైన పదవిలో ఉన్న మంత్రి రవీంద్ర నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. కార్పొరేషన్‌గా జీవో వచ్చిన అనంతరం మునిసిపాల్టీలో స్తబ్దత నెలకొని కనీసం సాధారణ సమావేశాలు కూడా నిర్వహించలేని దుస్థితి ఉందన్నారు. మునిసిపాల్టీని కార్పొరేషన్‌గా చేయాలని పాలకవర్గం తీర్మానం చేసే సమయంలో తమ పార్టీ ప్రతిపక్ష నాయకుడు షేక్ అచ్చాబా, ఉప ప్రతిపక్ష నాయకుడు శీలం బాబ్జి, కౌన్సిలర్లు చేయవద్దని ఒత్తిడి తెచ్చినా తాను మేయర్ అవుతానని, మీరు కార్పొరేటర్లు అవుతారని బాబాప్రసాద్ తీర్మానాన్ని ఆమోదింపజేశారన్నారు. బందరు ప్రాంతంలో రైతుల భూములను దోచుకునేందుకే మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఈ యత్నాలను భూపోరాట కమిటీ ఆధ్వర్యంలో తిప్పి కొడతామన్నారు.  సమావేశంలో అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ బొర్రా విఠల్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు, వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుమూడి విక్టర్‌ప్రసాద్, పార్టీ జిల్లా నాయకుడు మాదివాడ రాము, పార్టీ పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు తాడిబోయిన విజయలక్ష్మీ, మునిసిపల్ ఉపప్రతిపక్ష నాయకుడు శీలం బాబ్జి, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు