ఊటీ చేస్తామన్న బాబు లూటీకి సిద్ధం

15 Aug, 2014 03:11 IST|Sakshi
ఊటీ చేస్తామన్న బాబు లూటీకి సిద్ధం

పెద బయలు: విశాఖ మన్యాన్ని మరో ఊటీ చేస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసిన చంద్రబాబు మన్యాన్ని లూటీ చేసే పనిలో ఉన్నారని ఎంపీపీ సల్లంగి ఉమా మహేశ్వరరావు, జెడ్పీటీసీ జర్సింగి గంగాభవాని ఆరోపించారు.  పెదబయలులో గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాక్సయిట్‌కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ కూడలిలో గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ అభివృద్ధికి దూరమైన మన్యంలో గిరిజన యువతకు ఉపాధి, మౌలిక సదుపాయాలు కల్పించాల్సింది పోయి బాక్సయిట్ తవ్వకాలతో గిరిజనులను నిరాశ్రయుల్ని చేయాలని చంద్రబాబు భావిస్తున్నారన్నారు.
 
బాక్సయిట్ జోలికొస్తే తరిమి కొడతామని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాక్సయిట్‌కు వ్యతిరేకమని చెప్పి, అధికారంలో వచ్చాక తవ్వకాలు ప్రారంభిస్తామనడం విచారకరమన్నారు. బాక్సయిట్ తవ్వకాలతో లాభాల కంటే నష్టాలే ఎక్కువని ఎన్నోమార్లు శాస్త్రవేత్తలు చెప్పినా తవ్వకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయని విమర్శించారు. 1/70 చట్టానికి తూట్లు పొడిచే బాక్సయిట్ తవ్వకాలు చేపడితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. అంతకు ముందు పెదబయలు జెడ్పీ అతిథి గృహం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
 
అనంతరం తహశీల్దార్ అంబేద్కర్‌కు వినతి ప్రతం అందించారు. ముఖ్యమంత్రి డౌన్ డౌన్, చంద్రబాబు డౌన్ డౌన్, మన్యం లూటీ బాబును తరిమి కొట్టాలని, బాక్సయిట్ జోలికొస్తే ఖబడ్దార్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షురాలు వంతాల శాంతి, మాజీ ఎంపీపీ బాలంనాయుడు, సూర్యనారాయణ, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పాంగి సింహాచలం, వైఎస్సార్ సీపీ నేతలు సందడి కొండబాబు, పద్మాకరరావు, వంతాల అప్పారావు, ఎంపీటీసీలు కృష్ణారావు, మాధవరావు, బోడిరాజ్, సర్పంచ్‌లు, కార్యకర్తలు, రైతులు, మహిళలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు