సమ్మెబాట

2 Dec, 2014 03:26 IST|Sakshi

గుంటూరు సిటీ : అందరికీ వెలుగులు పంచే వారి జీవితాల్లో మాత్రం చీకట్లు తొలగిపోవడం లేదు. రోజంతా కష్టపడినా బతుకులు మారడం లేదు. సెలవులు లేకుండా పనిచేస్తున్నా ఉద్యోగ భరోసా లేదు. అందుకే వారంతా సమ్మెకు సమాయత్తమవుతున్నారు. మంగళవారం తిరుపతిలో జరగనున్న రాష్ట్రసదస్సులో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు.

విద్యుత్‌శాఖలో టెక్నికల్, నాన్ టెక్నికల్ కలిపి మొత్తం 70 రకాల విభాగాలు ఉన్నారుు. నవ్యాంధ్రప్రదేశ్‌లో అన్ని విభాగాల్లో కలిపి రమారమి 18 వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు.

ఒక్క గుంటూరు జిల్లాలోనే రెండు వేల మంది వరకు కాంట్రాక్ట్ పద్ధతిన విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ఒక పండగనీ, పబ్బమనీ అధికారికంగా ఒక్క సెలవు కూడా మంజూరు కాదు.

పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా దక్కేది అంతంత మాత్రం వేతనమే. పెపైచ్చు తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి ఉద్యోగం. అయినా, ఏనాటికైనా పర్మనెంట్ కాకపోతుందా అన్న ఆశతో ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు.

ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు గత హయాంలో ఈ ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిన నియూమకాలు చేపట్టి వారి హక్కులను హరించారు.

గతంలో ప్రభుత్వ, కార్మిక యజమానుల ప్రతినిధులతో కాంట్రాక్ట్ లేబర్ అడ్వయిజరీ పేరిట ఒక బోర్డు ఉంది. కాంట్రాక్ట్ కార్మికుల చట్టం అమలు కాకపోతే కార్మికులు అప్పట్లో దానికి ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు ఉండేది. అయితే ఇప్పుడా అవకాశం లేకుండా చేశారు.

ఆ తరువాత అధికారంలోకి వచ్చిన డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి దీనిపై దీనిపై ప్రత్యేకంగా జీవో నంబర్ 649 జారీ చేసి మళ్లీ కాంట్రాక్టు కార్మికుల్లో కొత్త ఆశలు చిగురింపజేశారు. ఆయన హఠాన్మరణంతో మళ్లీ సమస్య మొదటికొచ్చింది.

ఎన్నికల్లో కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరిస్తానని చంద్రబాబు హామీఇచ్చినా అది నేరవేరలేదు. దీంతో వారు సమ్మె బాట పట్టేందుకు సమాయత్తమవుతున్నారు.
 
సమ్మె తప్పదు.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని కోరుతూ ఇప్పటికే పలు రూపాల్లో దశలవారీ ఆందోళనలు నిర్వహించాం. పాలకులకు మహాజరులు సమర్పించుకున్నాం. ప్రజాప్రతినిధులను వేడుకున్నాం. అయినా గడచిన 18 సంవత్సరాలుగా ఈ సమస్య సజీవంగానే ఉంది. విసిగెత్తిపోయూం. ఇక ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని భావించాం. అందులో భాగంగానే ప్రభుత్వానికి ఇప్పటికే సమ్మె నోటీసు కూడా ఇచ్చాం. డిసెంబర్ 15లోగా దీనిపై సముచిత నిర్ణయం తీసుకోవాలని కోరాం. డిసెంబర్ 2న తిరుపతిలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నాం. 15లోగా ప్రభుత్వం స్పందించకుంటే సమ్మె తప్పదు.

- సీహెచ్.నాగబ్రహ్మాచారి, యునెటైడ్ ఎలక్ట్రిసిటీ
ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

మరిన్ని వార్తలు