మహిళల భద్రత దైవాదీనం!

21 Sep, 2017 03:18 IST|Sakshi
మహిళల భద్రత దైవాదీనం!
- రాష్ట్రంలో నాలుగు నెలల్లో 5,673 మంది మహిళలపై అకృత్యాలు
ఆందోళన కలిగిస్తున్న అత్యాచారాలు..
ఎస్సీ, ఎస్టీ మహిళలపై మితిమీరిన అఘాయిత్యాలు
పలు జిల్లాల్లో పెరిగిపోయిన హత్యలు.. కిడ్నాప్‌లు..
వీటికి తోడు కలవరపెడుతున్న రోడ్డు ప్రమాదాలు.. ఆస్తి తగాదాలు
‘నేరా’oధ్రప్రదేశ్‌గా మారిందని జిల్లా కలెక్టర్ల సదస్సు నివేదిక స్పష్టీకరణ
 
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయా? మహిళలపై నేరాలు, అఘాయిత్యాలు పెరిగిపోయాయా? వీటికి తోడు హత్యలు, కిడ్నాప్‌లు, ఆస్తుల గొడవలు, రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా పెరిగిందా? తదితర ప్రశ్నలకు జిల్లా కలెక్టర్ల నివేదిక అవుననే చెబుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌– జూలై (4 నెలలు) మాసాల మధ్య  ఏకంగా 5,673 మంది మహిళలు వివిధ ఘటనల్లో బాధితులయ్యారని,  పిల్లలపై అఘాయిత్యాలతో పాటు ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలు కూడా పెరిగిపోయాయని ఆయా జిల్లాల కలెక్టర్లు నివేదించారు. బుధవారం నుంచి ప్రారంభమైన రెండు రోజుల జిల్లా కలెక్టర్ల సదస్సు నివేదిక ద్వారా ఈ వివరాలు వెలుగు చూశాయి.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను అరికడుతున్నామని, ఎక్కడ ఏం జరిగినా చిటికెలో పసిగడుతున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం మహిళలపై నేరాలను తగ్గించడంలో, రోడ్డు ప్రమాదాలను నివారించడంలో వైఫల్యం చెందినట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సీసీటీవీలు, కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాలు ఉన్నప్పటికీ మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయినట్లు నివేదిక ఎత్తి చూపింది. చిత్తూరులో మినహా మిగతా అన్ని జిల్లాల్లో నాలుగు నెలలుగా వివిధ ఘటనల్లో మహిళా బాధితుల సంఖ్య పెరిగినట్లు స్పష్టం చేసింది. ఏప్రిల్‌ నుంచి జూలై వరకు అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో మహిళలపై నేరాలు, అఘాయిత్యాలు బాగా పెరిగిపోయాయి.

రాజధాని ప్రాంతమైన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సైతం నాలుగు నెలల్లో 400 మంది చొప్పున మహిళలు వివిధ ఘటనల్లో బాధితులుగా నమోదవ్వడం గమనార్హం. ఇందులో చైన్‌ స్నాచింగ్‌ ఘటనలు కూడా ఉన్నాయి. వీధి వీధినా సీసీటీవీలున్నా నిందితులను పట్టుకుని, సొమ్ము రికవరీ చేయడంలో ఆశించిన ప్రగతి లేదు. రాజధాని ప్రాంతంలోని కాలనీల్లోనే మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లేందుకు జంకుతున్నారంటే ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిజంగా పని చేస్తున్నాయా.. లేక మొక్కుబడిగా బిగించి చేతులు దులుపుకున్నారా.. అనే సందేహం కలుగుతోంది. ఇదే నాలుగు నెలల వ్యవధిలో ఇతర రాష్ట్రాల్లో చోటుచేసుకున్న ఘటనలు ఇందులో పాతిక వంతు కూడా లేకపోవడం గమనార్హం. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ మహిళలపై అత్యాచారాలకు అంతే లేకుండా పోయింది. నాలుగు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 771 కేసులు నమోదైతే ఒక్క నెల్లూరులోనే 106 కేసులుండటం ఆందోళన కలిగిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఇలాంటిది ఒక్క ఘటన కూడా చోటుచేసుకోలేదు. ఈ లెక్కన రాష్ట్రంలో శాంతిభద్రతలు, నేరాలు అదుపు తప్పాయనడానికి ఇంతకంటే నిదర్శనం అక్కర లేదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. 
 
పెరిగిపోయిన రోడ్డు ప్రమాదాలు  
రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూలై వరకు జరిగిన 6,211 రోడ్డు ప్రమాదాల్లో 2,661 మంది మృతి చెందినట్లు కలెక్టర్ల నివేదిక స్పష్టం చేసింది. తూర్పుగోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అత్యధికంగా రోడ్డు ప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ మూడు జిల్లాల్లో నాలుగు నెలల్లో 700 చొప్పున ప్రమాదాలు జరిగాయి. రాష్ట్రంలో ఆస్తి తగాదాల నేరాలు కూడా నాలుగు నెలలుగా బాగా పెరిగిపోయాయి. ఏకంగా 5,688 ఘటనలు నమోదు కావడం అటు ఉన్నతాధికారులు, ఇటు ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. వైఎస్‌ఆర్, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 400 చొప్పున ఈ తరహా ఘటనలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి.  
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా