జీతాల్లో కోత..అసౌకర్యాల వాత!

10 Dec, 2018 05:49 IST|Sakshi

గగ్గోలు పెడుతున్న కేజీబీవీ పార్ట్‌టైమ్‌ అధ్యాపకులు

తెలంగాణలో వీరి జీతం 23వేలు ఉంటే.. ఏపీలో 12వేలే

బోధనేతర సిబ్బందిలేక వార్డెన్ల బాధ్యతా ఈ లెక్చరర్లకే

పేరుకు పార్ట్‌టైమ్‌..పనిమాత్రం ఫుల్‌టైమ్‌

ప్రాథమిక సౌకర్యాలూ లేక బాలికలు, సిబ్బంది అవస్థలు

బడ్జెట్‌ కేటాయింపుల్లేక తిండికీ తిప్పలే

సాక్షి, అమరావతి: ఒకే రకమైన ఉద్యోగం.. విధులన్నీ ఇద్దరికీ సమానమే.. కానీ, వారికిచ్చే వేతనాల్లోనే భారీ తేడా. ఇది ఏపీ, తెలంగాణాల్లో కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల పరిధిలోని జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న పార్ట్‌టైమ్‌ అధ్యాపక సిబ్బంది పరిస్థితి. తెలంగాణ అధ్యాపకులకు అక్కడి ప్రభుత్వం రూ.23వేలు వేతనం ఇస్తుండగా ఏపీ సర్కారు మాత్రం ఇక్కడ రూ.12వేలు మాత్రమే ఇస్తోంది. అంతేకాక, వీరిని తగినంత సంఖ్యలో నియమించకపోవడం, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడంతో అధ్యాపకులపై రెట్టింపు భారం పడుతోంది. బోధనా కార్యక్ర మాలతో పాటు వసతిగృహాల్లో ఉండే బాలికల రక్షణ బాధ్యత కూడా వీరిపైనే ఉంది. మరోపక్క ముందస్తు ఏర్పాట్లు, నిధుల కేటాయింపు లేకుండా వీటిని ప్రారంభించడంతో విద్యార్థినులకు వసతి సమస్యలతో పాటు భోజనం, ఇతర సదుపాయాలూ అరకొరగా ఉంటున్నాయి. అలాగే, రాత్రి వేళల్లో బాలికలకు రక్షణగా ఉండే అధ్యాపక సిబ్బందికి ఇక్కడ సరైన వసతిలేక నానా అవస్థలు పడుతున్నారు.

స్కూళ్ల భవనాల్లోనే కాలేజీ విద్యార్థులు
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల పరిధిలో ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా బాలికల కోసం 33 జూనియర్‌ కాలేజీలను కూడా ఏర్పాటుచేశారు. వీటిని కేజీబీవీ స్కూళ్లలోనే ప్రారంభించారు. 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్నవిద్యార్థినులకే ఇక్కడి భవనాలు సరిపోక నానా ఇబ్బందులు పడుతుంటే ఇక్కడే కాలేజీలను సైతం ఏర్పాటుచేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిచోట్ల తాత్కాలిక రేకుల షెడ్లను ఏర్పాటుచేశారు. వీరందరికీ 2, 3 మరుగుదొడ్లు మాత్రమే ఉండడంతో బాలికలు నానా అవస్థలు పడుతున్నారు. 

ఫుల్‌టైమ్‌ వర్క్‌కు పార్టు టైమ్‌ వేతనమూ లేదు
ఈ 33 కేజీబీవీ కాలేజీల్లో మొత్తం 231 మంది పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. రెగ్యులర్‌ అధ్యాపకులతో సమానమైన అర్హతలుండి ఇంటర్వ్యూ, డెమోలను నిర్వహించిన అనంతరం మెరిట్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను అనుసరించి వీరిని ఎంపికచేశారు. వాస్తవానికి వీరిని కాంట్రాక్టు పద్ధతి మీద నియమించాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పార్ట్‌టైమ్‌ అని పేరుపెట్టి నియామకాలు జరిపింది. అలాగే, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ వేతనాల్లో భారీగా కోత పెడుతోంది. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బందికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రెగ్యులర్‌ సిబ్బంది మూల వేతనంతో సమానంగా వేతనం కల్పించారు. ఇటీవల పీఆర్సీ ప్రకారం కూడా రాష్ట్రంలోని కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు పెరిగాయి. ఈ తరుణంలో పార్ట్‌టైమ్‌ అధ్యాపకులకు ఆ మేర కూడా వేతనాలివ్వడం లేదు. పనిచేస్తున్నది ఫుల్‌టైమ్‌ అయినా పార్ట్‌టైమ్‌ పేరిట వేతనాల్లో భారీగా కోతపెట్టారు. పక్కనే ఉన్న తెలంగాణ కేజీబీవీ కాలేజీల్లో పనిచేస్తున్న ఇదే అధ్యాపకులకు అక్కడి ప్రభుత్వం రూ.23వేలు వేతనంగా చెల్లిస్తోంది.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని మరింత పెంచుతామని చెబుతోంది. ఇక్కడ మాత్రం కేవలం 12వేలు మాత్రమే ఇస్తున్నారు. ఇక్కడి వంట పనివారికి, అటెండర్లకు ఇచ్చే వేతనం కన్నా వీరికి వచ్చే జీతం తక్కువ. వీరికి నియామక ఉత్తర్వులు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. పార్ట్‌టైమ్‌ అని తీసుకుని వీరికి నైట్‌డ్యూటీ, హాలిడే డ్యూటీ, హౌస్‌టీచర్‌ డ్యూటీ ఇలా అన్ని రకాల డ్యూటీలు కేటాయిస్తున్నారు. కాలేజీ బోధన కోసం నియమితులైన వీరికి అక్కడి స్కూళ్లలోని బోధనేతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయకుండా ఆ పని కూడా చేయిస్తున్నారు. పగలు తరగతుల్లో బోధన.. రాత్రి బాలికలకు రక్షణగా ఉండి మళ్లీ బోధనకు సిద్ధం కావలసి వస్తోంది. కాగా, ఈ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపులను ఈ ఏడాది చాలా ఆలస్యంగా ప్రారంభించారు. డిసెంబర్‌కల్లా సిలబస్‌ పూర్తిచేయాలని ఆదేశాలివ్వడంతో అదనపు తరగతులు నిర్వహించి బోధిస్తున్నారు. కేజీబీవీల్లో స్పెషలాఫీసర్‌ తరువాత కేడర్‌ వీరిదే అయినా కనీసం జాబ్‌చార్టు కూడా ఇవ్వలేదు. మరోపక్క బాలికలను జేఈఈ, ఎంసెట్, జిప్‌మెర్‌ వంటి పరీక్షలకు సిద్ధం చేయాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ, అదనపు సిబ్బందిని నియమించకుండా ఈ సిబ్బందిపైనే రెట్టింపు భారం మోపుతోంది. 

మరిన్ని వార్తలు