రాజధాని ఇంకెంత దూరం?

24 Oct, 2017 01:33 IST|Sakshi
రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితి ఇదీ..

మూడు డిజైన్లు.. ఆరు శంకుస్థాపనలు

రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి రెండేళ్లు పూర్తి

భూమిపూజలు, శంకుస్థాపనలే తప్ప పనుల్లేవ్‌..  ఆ ప్రాంతంలో బీడువారిన పొలాలు

సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం అంతుచిక్కని స్వప్నంగా మారింది. నవ నగరాలు, ఐకానిక్‌ టవర్లు, ఐకానిక్‌ బ్రిడ్జీలు, వాటర్‌ చానళ్లు, ఎనిమిది వరుసల రహదారులు, గోల్ఫ్‌ కోర్సులతో ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ రాజధానుల అధ్యయనం కోసం ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు పలు దేశాల్లో పర్యటించారు. స్థూపాకృతి, వజ్రాకృతి, ఈఫిల్‌ టవర్‌ వంటి రకరకాల గ్రాఫిక్‌ డిజైన్లు పలు దఫాలుగా విడుదల చేశారు.

అత్యద్భుత నిర్మాణాలు, అంతర్జాతీయ స్థాయి రహదారులంటూ ప్రభుత్వం పదే పదే చేస్తున్న ప్రకటనలతో వాటిని కళ్లారా చూసేందుకు ఆసక్తిగా వచ్చిన వారికి మాత్రం తీవ్ర నిరాశే మిగులుతోంది. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం తప్ప రాజధాని ప్రాంతం మొత్తంలో మరే నిర్మాణమూ కనిపించడంలేదు. పచ్చని పంటపొలాలు ఎండిపోయి పిచ్చిమొక్కలతో కనిపిస్తున్నాయి. రాజధాని నిర్మాణ ప్రక్రియను ప్రారంభించి మూడేళ్లయినా, అమరావతి నగరానికి శంకుస్థాపన చేసి ఆదివారానికి రెండేళ్లు పూర్తయినా ఇప్పటికీ ఒక్క నిర్మాణం మొదలవ్వకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ఖరారు కాని డిజైన్లు
ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తామంటూ ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నగరం డిజైన్ల బాధ్యతను మొదట జపాన్‌కు చెందిన మకి అసోసియేట్స్‌కి అప్పగించారు. ఆ సంస్థ అందించిన డిజైన్లు అద్భుతమంటూ ఆకాశానికెత్తి, ఆ తర్వాత ఆ డిజైన్లు బాగోలేవంటూ మకిని తొలగించారు. ఆ తర్వాత లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ఐదారుసార్లు డిజైన్లు రూపొందించినా ముఖ్యమంత్రికి నచ్చలేదు. చివరకు ఫోస్టర్‌ సంస్థకు సలహాలిచ్చి డిజైన్లు రూపొందించే బాధ్యతను బాహుబలి దర్శకుడు రాజమౌళికి అప్పగించారు. ఆ డిజైన్లు ఎప్పుడు వస్తాయో, అమరావతి నిర్మాణం ఎప్పటికి సాకారమవుతుందో అంతుచిక్కడం లేదు. 

శంకుస్థాపనలతోనే సరి...
ప్రభుత్వం మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా అంతర్జాతీయ నగరం, అద్భుత నిర్మాణాలంటూ రెండేళ్ల క్రితం శంకుస్థాపన సమయంలో ప్రధాని మోదీతో పాటు దేశ, విదేశీ ప్రముఖుల సమక్షంలో చెప్పిన మాటలనే ఇప్పటికీ తిప్పి తిప్పి వల్లెవేస్తోంది. పవిత్రత కోసం రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, నగరాలు, దేశంలోని పుణ్య క్షేత్రాలు, నదుల నుంచి మట్టి, నీరు తెచ్చి శంకుస్థాపన జరిగే చోట వాటిని ఉంచి హడావుడి చేసినా అవేవీ ఇప్పుడు అక్కడ కనిపించడం లేదు.

రాజధాని శంకుస్థాపన  కార్యక్రమం జరిగిన ఏడాది తర్వాత లింగాయపాలెం వద్ద కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు (ప్రస్తుత ఉపరాష్ట్రపతి), అరుణ్‌ జైట్లీలతో రాజధాని పరిపాలనా నగరానికి శంకుస్థాపన చేయించారు. ఇప్పటికీ అక్కడ ఒక్క ఇటుక కూడా ఉపయోగించిన దాఖలాలు లేవు. రోడ్ల కోసం ఎర్రబాలెంలో, స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు కోసం తాళ్లాయపాలెంలో సీఎం చంద్రబాబు స్వయంగా శంకుస్థాపనలు చేసిన ప్రదేశాలన్నీ పిచ్చి మొక్కలతో నిండి కనిపిస్తున్నాయి. 

డెడ్‌లైన్‌ ప్రకటించినా..
రాజధాని నిర్మాణ పనులు ఈ సంవత్సరం జులైలో ప్రారంభించి 2018 డిసెంబర్‌కల్లా నిర్మాణం పూర్తి చేస్తామని ప్రభుత్వం కొద్ది నెలల క్రితం డెడ్‌లైన్‌ ప్రకటించింది. సచివాలయం నిర్మాణాన్ని మే 10న, అసెంబ్లీని జూలై 20న, హైకోర్టు నిర్మాణాన్ని ఆగస్టు 17న మొదలు పెట్టి 2018 కల్లా పూర్తి చేస్తామని షెడ్యూల్‌ విడుదల చేసింది. కానీ ఇప్పటివరకూ డిజైన్లే ఖరారు కాకపోతే నిర్మాణాలు పూర్తయ్యేదెప్పుడని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

కేంద్ర నిధులకు లెక్కల్లేవు...
రాజధాని నిర్మాణంకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1500 కోట్లు విడుదల చేసింది. అయితే వాటిని ఎలా వినియోగించారనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పలేదు. కేంద్రం విడుదల చేసిన నిధులను అసెంబ్లీ, సచివాలయం, కార్యాలయాల్లాంటి శాశ్వత నిర్మాణాలకు వెచ్చించి ఉంటే వాటిని చూపి మరిన్ని నిధులను కేంద్రాన్ని అడిగే అవకాశం ఉండేది. కానీ ఒక్క తాత్కాలిక సచివాలయానికే రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం పక్కాగా లెక్కలు చూపే పరిస్థితిలో లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వాన్ని మరిన్ని నిధులు అడిగే ధైర్యం చేయలేకపోతోందని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

అక్టోబర్‌ 22, 2015... 
ప్రధాని చేతుల మీదుగా తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన 
 విజయదశమి రోజున శంకుస్థాపన చేశామని, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామన్న సీఎం
 రాష్ట్రంలోని 16 వేల గ్రామాల్లోని మట్టి, నీరు, దేశంలోని పుణ్యక్షేత్రాలు, పవిత్ర స్థలాల నుంచి మట్టి, పుణ్య నదుల నుంచి నీరు సేకరణ 
 యమునా నది నుంచి నీరు, పార్లమెంటు నుంచి మట్టి తెచ్చి చంద్రబాబుకు ఇచ్చిన ప్రధాని మోదీ 

 అక్టోబర్‌ 22, 2017... 
 బీడు భూమిగా పనికి రాకుండా ఉన్నశంకుస్థాపన చేసిన ప్రాంతం  
 పుణ్యక్షేత్రాలు, పవిత్ర ప్రాంతాల నుంచి సేకరించిన మట్టి జాడ లేదు 
 ఒక్క నిర్మాణమూ చేపట్టని ప్రభుత్వం
 ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా అమరావతిని నిర్మిస్తున్నామని తాజాగా దుబాయ్‌ పర్యటనలో సీఎం ప్రకటన

ఒక భూమిపూజ... నాలుగు శంకుస్థాపనలు
 06–06–2015 : మందడంలో రాజధానికి భూమిపూజ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు
 22–10–2015 : ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోడీ చేతుల మీదుగా రాజధానికి శంకుస్థాపన
 25–06–2016 : సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు 
 28–10–2016 : పరిపాలనా నగరానికి లింగాయపాలెం వద్ద శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ, ముఖ్యమంత్రి చంద్రబాబు
 29–03–2017 : ఎర్రబాలెంలో రాజధాని ప్రాధాన్యతా రోడ్లకు ముఖ్యమంత్రి శంకుస్థాపన 

మరిన్ని వార్తలు