నెలాఖరు వరకు దర్శన టికెట్ల పెంపు లేదు

5 Jul, 2020 04:43 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

ఆన్‌లైన్‌ ద్వారా కల్యాణోత్సవం సేవపై అర్చకులతో చర్చించాక నిర్ణయం

ఉద్యోగులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు 

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడి 

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం 

శ్రావణ మాసంలో కర్ణాటక సత్రాల సముదాయాలకు శంకుస్థాపన  

తిరుమలు: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించి రోజువారీ భక్తుల సంఖ్యను ఈ నెలాఖరు వరకు పెంచకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా జూన్‌ 8వ తేదీ నుంచి శ్రీవారి దర్శనం తిరిగి ప్రారంభించామని ఆయన చెబుతూ.. ఇంతవరకు స్వామి దర్శనానికి వచ్చిన ఏ ఒక్క భక్తుడికీ కరోనా పాజిటివ్‌ రాలేదని స్పష్టం చేశారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలసి వైవీ మీడియాతో మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాలివీ..  

ఆదాయ, వ్యయాలు చూసే ఆలోచనే లేదు.. 
► టీటీడీ ఆర్థిక వనరులు పెంచుకోవడానికే రోజువారీగా భక్తుల దర్శనాల సంఖ్యను పెంచుతూ పోతోందని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఇందులో వాస్తవం లేదు. ఆదాయ, వ్యయాలు చూసే ఆలోచనే ధర్మకర్తల మండలికి లేదు. 
► ఎక్కువమంది స్వామివారి దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందితే కరోనా త్వరగా దూరమవుతుందనే ఉద్దేశంతోనే దర్శనం టికెట్లను పెంచాం. 

ఉద్యోగులకు అత్యుత్తమ వైద్య సేవలు.. 
► ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నా టీటీడీలో 17 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరుంటున్న నివాస ప్రాంతాల్లోని పరిస్థితుల వల్లే కరోనా వచ్చిందని నిర్ధారణైంది. వీరందరినీ క్వారంటై¯Œన్‌కు పంపి అత్యుత్తమ వైద్యసేవలు అందించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశాం.  
► తిరుమలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ప్రస్తుతం వారానికోసారి షిఫ్ట్‌ అమలు చేస్తున్నాం. వారి ఆరోగ్య సంరక్షణ చర్యల్లో భాగంగా ఇకపై షిఫ్ట్‌ విధులను రెండు వారాలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. క్షురకులకు సౌకర్యవంతంగా ఉండే గ్లౌజ్‌లు, పీపీఈ కిట్లు అందిస్తాం.  
► భక్తుల నుంచి వస్తున్న విన్నపాల మేరకు కల్యాణోత్సవ సేవను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించే విషయంపై అర్చకులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటాం. తపాలా శాఖ ద్వారా భక్తులకు ప్రసాదాలు పంపే ఏర్పాట్లు చేయాలని సూచించాం. 
► తిరుపతిలోని స్థానిక ఆలయాల్లోనూ తిరుమల తరహాలో అన్ని జాగ్రత్తలు తీసుకుని భక్తులకు దర్శనం కల్పిస్తాం. 

శ్రావణంలో కర్ణాటక సత్రాల సముదాయాలకు శంకుస్థాపన 
► తిరుమలలోని కర్ణాటక సత్రాల ప్రాంతంలో టీటీడీ లీజుకిచ్చిన 7.05 ఎకరాల భూమిలో యాత్రికుల వసతి సముదాయం, కల్యాణ మండపం నిర్మాణానికి శ్రావణమాసంలో శంకుస్థాపన చేస్తాం. 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న యాత్రికుల వసతి సముదాయాల నిర్మాణాల వ్యవహారంపై శుక్రవారం కర్ణాటక సీఎం యడియూరప్పతో జరిగిన సమావేశంలో అవగాహనకు వచ్చాం. కర్ణాటక ప్రభుత్వం టీటీడీకి రూ.200 కోట్లు డిపాజిట్‌ చేస్తే, టీటీడీ నిబంధనల మేరకు టెండర్లు పిలిచి ఈ నిర్మాణాలు పూర్తి చేసేలా ఒప్పందం కుదిరింది.  
► ఈ సమావేశంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, శేఖర్‌రెడ్డి, కె.పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు