సచివాలయంలోనే మందుల్లేవ్‌.. 

13 May, 2019 04:12 IST|Sakshi

రెండు మాసాలుగా లేని డయాబెటిక్‌ మందులు

రక్త పరీక్షలకు కూడా బయటకు వెళ్లాల్సి వస్తోదంటున్న ఉద్యోగులు  

సాక్షి, అమరావతి: రాష్ట్ర పాలనకు కేంద్రంగా ఉండే సచివాలయంలోనే మందులకు దిక్కులేని పరిస్థితి నెలకొని ఉంది. గత రెండు మాసాలుగా మధుమేహం నివారణ (షుగర్‌)కు ఇచ్చే మాత్రలు లేకపోవడంతో ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ మందులను రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) సరఫరా చేయాలి. కానీ గడిచిన రెండు మాసాలుగా మధుమేహం నివారణ మందులు సరఫరా చేయలేదు. సచివాలయ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ ఇక్కడి నుంచే మందులు సరఫరా అవుతాయి.

సచివాలయ ఉద్యోగులు 2 వేల మంది ఉండగా, వారికే సకాలంలో సరఫరా చేయలేకపోతున్నారు. చాలా మంది ఉద్యోగులు సచివాలయంలోని డిస్పెన్సరీకి వెళ్లడం, మందులు లేవని చెప్పడంతో వెనుదిరిగి వస్తున్నారు. ఈ మందులతో పాటు మరికొన్ని యాంటీబయోటిక్స్, బీకాంప్లెక్స్, విటమిన్‌ మాత్రలు కూడా అందుబాటులో లేవని చెబుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ సచివాలయంలోని డిస్పెన్సరీలో ఎప్పుడూ మందులు లేవని చెప్పేవారు కాదని, కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడు మందులు ఉంటాయో, ఎప్పుడు ఉండవో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆరోపిస్తున్నారు. అలాగే సచివాలయం ఏర్పాటు చేసి మూడేళ్లు పూర్తయినా ఇప్పటివరకూ రక్తపరీక్షలు కూడా చేయలేని పరిస్థితి నెలకొని ఉందని ఉద్యోగులు వాపోయారు. ఏ రక్తపరీక్ష చేయించుకోవాలన్నా బయటికి వెళ్లి చేయించుకోవాల్సి వస్తోందని, ఇది చాలా ఇబ్బందిగా ఉందని రెవెన్యూ విభాగానికి చెందిన ఓ అధికారి వాపోయారు.

ఇప్పటివరకు లేబొరేటరీ కూడా ఏర్పాటు చేయలేక పోవడం దారుణమని, అంబులెన్సు కూడా అందుబాటులో ఉండదన్నారు. ఎవరైనా ఉద్యోగులు 108కు ఫోన్‌ చేస్తే తూళ్లూరు నుంచి గాని, మరెక్కడనుంచో ఇక్కడకు రావాలని, దీనికి బాగా సమయం పడుతోందని పేర్కొన్నారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా