సేంద్రియ ‘స్వాహా’యం!

27 Jun, 2019 10:04 IST|Sakshi
నామమాత్రంగా పంపిణీ చేసిన ప్లాస్టిక్‌ డ్రమ్ములు, సేంద్రియ ఎరువులు, మందులు

మామిడి తోటల్లో సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం

ఉలవపాడు మండలాన్ని ఎంపిక చేసిన అధికారులు

వర్మీ కంపోస్ట్‌ పేరిట మట్టి సంచులు పంపిణీ

సాక్షి, ఒంగోలు సబర్బన్‌: జిల్లాలో ఉలవపాడు ప్రాంతం మామిడికి పేరెన్నిక గన్నది. దీనిని అవకాశంగా చేసుకున్న కొందరు ఉలవపాడు సేంద్రియ వ్యవసాయ సంఘం పేరిట ఒక సంస్థను రిజిస్టర్‌ చేయించుకున్నారు. దానికి కేరళకు చెందిన జిజో జోసెఫ్‌ అనే వ్యక్తి అధ్యక్షుడిగా మరో 7 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి ద రిజిస్ట్రార్‌ ఆఫ్‌ సొసైటీస్‌ నుంచి సర్టిఫికెట్‌ తీసుకున్నారు. ఈ జిజో జోసెఫ్‌కుగ్రిక ఇంటర్నేషనల్‌ కాంపెటెన్స్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్గానిక్‌ అల్చర్‌ (ఇకోవా) అనే సంస్థ ఉంది.

దీని పేరుతో టీడీపీ హయాంలో ఉలవపాడు మామిడిలో సేంద్రియ వ్యవసాయం చేయించేందుకు రైతులకు అవగాహన కల్పించటం, వారిని ప్రోత్సహించటంలాంటివి చేపట్టేందుకు ఒప్పందం చేసుకున్నారు. 2016 సంవత్సరం మే నెలలో మెమోరాండం ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌ (ఎంఓయూ)ను ప్రభుత్వంతో ఇకోవా సంస్థ కుదుర్చుకుంది. అప్పటి నుంచి మామిడి రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించేందుకు కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పుకుంటూ వచ్చారు. అంతా కాగితాలపైన, రికార్డుల్లోనే చూపించి రైతులను నిలువునా మోసం చేయటంతో పాటు లక్షలాది రూపాయలు దిగమింగారు.

రూ. 50 లక్షలకు పైగా నిలువు దోపిడీ
ఉలవపాడు సేంద్రియ వ్యవసాయ సంఘం పేరుతో ఇకోవా సంస్థ చేపట్టిన సేంద్రియ సాగు పేరిట దాదాపు రూ. 50 లక్షలకు పైగా దోపిడీ చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మామిడి రైతులను సేంద్రియ సాగు వైపు మరలించటానికిగాను ఇకోవా ఉలవపాడు మండలంలోని 7 గ్రామాలను ఎంపిక చేసుకుంది. ఉలవపాడుతో పాటు బద్దిపూడి, చాకిచర్ల, వీరేపల్లి, భీమవరం, ఆత్మకూరు, కరేడు గ్రామాల్లో కార్యకలాపాలు చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి దాదాపు రూ. కోటికి పైగా నిధులు రాబట్టుకుంది. అందుకుగాను ఈ ఏడు గ్రామాల్లోని 442 మంది రైతులకు సంబంధించి 500 హెక్టార్లలో సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టేందుకు పూనుకున్నారు.

మూడేళ్ల పాటు రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన సదస్సులు నిర్వహించాల్సి ఉంది. ఒక్కో హెక్టారుకు శిక్షణ తరగతులకు, అవగాహన సదస్సులకు రూ. 10 వేలు చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ఈ మూడేళ్లలో రెండు మూడు అవగాహన సదస్సులు మినహా పెట్టింది లేదు. అంటే 500 హెక్టార్లకు ఒక్కో హెక్టారుకు రూ. 10 వేలు చొప్పున రూ. 50 లక్షలు అవుతుంది. ఇంకెంత మోతాదులో దోచుకున్నారో ఇంకా లోతుకు వెళ్లి విచారిస్తే తప్ప పూర్తి దోపిడీ బయట పడదన్న విషయాలు అర్థమవుతున్నాయి.

నోరు మెదపని ఉద్యానవన శాఖాధికారులు
సేంద్రియ వ్యవసాయం పేరుతో భారీ దోపిడీ చోటుచేసుకున్నా జిల్లాలోని ఉద్యానవన శాఖ అధికారులు నోరు మెదపటంలేదు. ఎందుకంటే అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు, రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్‌ పాత్ర దీని వెనుక ఉండటంతో జిల్లా స్థాయి అధికారులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఇంకా జిల్లాలో ఇలాంటి సంస్థలు సేంద్రియ వ్యవసాయం పేరుతో ఎన్ని రూ. కోట్లు దోపిడీ చేశాయో అన్నది లోతుల్లోకి వెళ్లి చూస్తేకాని వెలుగుచూడవు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అసలు కార్యాలయమే లేని సంస్థ
సేంద్రియ వ్యవసాయం పేరుతో ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టిన ఇకోవా సంస్థకు ఉలవపాడులో అసలు కార్యాలయమే లేదు. అవసరమైన ఫీల్డ్‌ ఎగ్జిక్యూటివ్‌లు, సిబ్బంది ఉండాల్సి ఉంటే ఇద్దరు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. నామమాత్రంగా కొందరు రైతులకు కషాయాలు కలుపుకోవటానికి డ్రమ్ములు మాత్రం ఇచ్చారు. ఇకపోతే సేంద్రియ ఎరువులు, మందులు పేరుతో తూ.. తూ మంత్రమే చేశారు. వర్మీ కంపోస్ట్‌ పేరుతో తెనాలి నుంచి మట్టి సంచులు కొందరు రైతులకు పంపిణీ చేశారు.

మరిన్ని వార్తలు