జనం కరువాయే.. దీక్షలు బరువాయే..!

6 Jun, 2018 15:32 IST|Sakshi
సింహాద్రిపురం మండలం చెర్లోపల్లెలో చిన్నారులు, వృద్ధులతో నవ నిర్మాణ దీక్ష 

జిల్లాలో సభల్లో ఎక్కడా కనిపించని జనం

చిన్నారులు, వృద్ధులతో కాలం వెళ్లదీస్తున్న అధికారులు

సాక్షి, కడప : రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ఈనెల శుక్రవారం నుంచి చేపట్టిన నవ నిర్మాణ దీక్షలకు జనాలు కరువయ్యారు. తమ పరువు కాపాడుకోవడానికి అధికారులు నానా తిప్పలు పడుతున్నారు. జనాలు రాక సభల నిర్వహణ అధికారులకు బరువవుతోంది. ఎక్కడ చూసినా జనం నుంచి నవ నిర్మాణదీక్షలకు స్పందన లేదు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని అధికారులు, టీడీపీ నాయకులు ఎంత ప్రయత్నిస్తున్నా లాభం లేకుండాపోతోంది. కేవలం పింఛన్‌ ఇస్తామని లబ్ధిదారులు సభలకు తిప్పుకోండం.. ఇవ్వకుండా రేపురండని అంటూ ఉద్యోగులు చెప్పడం పరిపాటిగా మారిందనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

సభలకు జనాలు రాకపోవడానికి కారణం.. నాలుగేళ్లుగా రైతులకు రుణమాఫీ అందలేదు. దీంతో వారు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అలాగే డ్వాక్రా రుణమాఫీకి ఎసరుపెట్టి కేవలం పసుపు కుంకుమగా మార్చి అంతో ఇంతో ఇచ్చే సొమ్మును కూడా కంతుల రూపంలో ఆలస్యం చేయడంపై మహిళలు ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుకున్నారు. ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకం కింద రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్‌ వాటర్, నిరుద్యోగ భృతి, ఇంటింటికి ఉద్యోగం, నిరుపేదలకు ఇల్లు ఇలా అనేక రకాల హామీలిచ్చి అంతంత మాత్రంగా కూడా అమలు చేయకపోవడంపై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ గ్రామసభలకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన రావడంలేదు. కేవలం దీక్షల్లో అధికారులు మాత్రమే ఉంటున్నారు.

 
అంతటా.. అంతంత మాత్రంగానే
జిల్లాలో ఎక్కడ చూసినా నవ నిర్మాణ దీక్షలు వెలవెలబోతున్నాయి. కలెక్టర్‌ హరికిరణ్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరైన దీక్షలు మినహా అన్ని చోట్ల జనం కరువవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని తరహాలో ఈ సారి మండల కేంద్రాలతోపాటు పంచాయతీల్లో ఎనిమిది రోజుల నవ నిర్మాణ దీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పల్లెల్లో ఎక్కడా జనం లేని దీక్షలే కనిపిస్తున్నాయి. జనాలు నిండుగా ఉండే దీక్షలు మచ్చుకైనా కనిపించడం లేదు. 


దీక్షల్లో ఒక అంకె దాటని జనం..
జిల్లాలో నిర్వహిస్తున్న నవ నిర్మాణ దీక్షల్లో జనం ముగ్గురు, అయిదు మంది, ఏడు మంది, పది మంది ఇలా కనిపిస్తున్నారు. వీరపునాయునిపల్లె మండల కేంద్రంలో నిర్వహించిన నవ నిర్మాణ దీక్షల్లో కేవలం ఐదారు మందే కనిపించారు. అలాగే రైల్వేకోడూరు, పుల్లంపేట మండలాల్లోని పలు చోట్ల కేవలం పది మందిలోపే జనాలు కనిపించా రు. పులివెందులలోని మిస్సమ్మ బంగ్లాలో నిర్వహించిన దీక్షకు జనం లేక చిన్న పిల్లలను తీసుకొచ్చి నిర్వహించారు. రాయచోటి నియోజకవర్గంలోని మండలాల్లో నిర్వహిస్తున్న సభలకు కూ డా జనాలు లేక కేవలం డ్వాక్రా మహిళలను తీసుకొచ్చి నడిపిస్తున్నారు.

రాజంపేట నియోజకవర్గంలోని నందలూరు మండలంలో ప్రజలు లేక నవ నిర్మాణదీక్ష బోసిపోయింది. ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు, బద్వేలు, కడప ఇలా అన్నిచోట్ల జనం లేని సభలే దర్శనమిస్తున్నా యి. అందునా పింఛన్ల కోసం వృద్ధులను తీసుకొ స్తుండగా.. డ్వాక్రా మహిళలు, అంగన్‌వాడీ వర్క ర్లు, ఇతర ప్రభుత్వ సిబ్బంది ఖచ్చితంగా హాజరు కావాలని అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నారు. జనం లేకపోవడంతో ఎవరో ఒకరు కనిపిస్తే కొంతైనా దీక్షలకు స్పందనగా చూపించవచ్చని అధికార యంత్రాంగం ఆరాట పడుతోంది.

మరిన్ని వార్తలు