‘పోలవరం’లో కనిపించని పురోగతి

15 May, 2018 02:17 IST|Sakshi

సీఎం చంద్రబాబు నిర్వహించిన వర్చువల్‌ రివ్యూలో వెల్లడి

సాక్షి, అమరావతి: పోలవరం స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ పనులను కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించినా పనుల్లో పురోగతి కనిపించడం లేదు. పోలవరం పనులపై సీఎం చంద్రబాబు సోమవారం నిర్వహించిన వర్చువల్‌ రివ్యూలో ఈ విషయం స్పష్టమైంది. అయితే యంత్రాలు మొరాయించడం వల్లే పనులు మందగించాయని సమర్థించుకోవడం గమనార్హం. సమీక్షా సమావేశంలో జలవనరుల శాఖ కార్యదర్శి, ఈఎన్‌సీ శశిభూషణ్‌ కుమార్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకూ 53.50 శాతం పూర్తయ్యాయని వివరించారు. ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణంలో కీలకమైన డయాఫ్రమ్‌ వాల్‌ పనులు 1,427 మీటర్లకుగానూ 1271.60 మీటర్లు పూర్తయ్యాయని.. ఎగువ దిగువ కాఫర్‌ డ్యామ్‌ల నిర్మాణానికి పునాది (జెట్‌ గ్రౌంటింగ్‌) పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు.

పోలవరం ప్రాజెక్టులో 1,115.59 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులకుగానూ ఇప్పటివరకు 817.32 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర పూర్తయ్యాయని పేర్కొన్నారు. స్పిల్‌ వే, స్టిల్లింగ్‌ బేసిన్, స్పిల్‌ చానల్‌లో 36.79 లక్షల క్యూబిక్‌ మీటర్ల వరకు కాంక్రీట్‌ పనులు చేపట్టాల్సి ఉండగా 8.03 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర పనులు పూర్తి చేశామని చెప్పారు. యంత్రాల్లో సమస్యలు తలెత్తడం వల్లే కాంక్రీట్‌ పనుల్లో వేగం మందగించిందన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పోలవరం కుడి కాలువ పనులను త్వరగా పూర్తి చేస్తే కృష్ణా డెల్టాకు ముందుగా నీటిని విడుదల చేయొచ్చునని సూచించారు. పోలవరం ప్రాజెక్టుపై సమావేశం ముగిసిన తర్వాత 54 ప్రాధాన్య ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. 

గుజరాత్‌ నుంచి అనుమతి లేని పత్తి విత్తనాలు
గుజరాత్‌ నుంచి అనుమతి లేని పత్తి విత్తనాలు వస్తున్నాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రైతుల్లో అవగాహన పెంచాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సోమవారం ఆయన అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. నాసిరకం పత్తి విత్తనాలు మార్కెట్లోకి రాకుండా కట్టడిచేయాలని ఆదేశించారు. వ్యవసాయ పనులు లేవు కాబట్టి ఉపాధి పనులను ముమ్మరం చేయాలని సూచించారు. గ్రామాల్లో తాగునీటి పథకాల పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. పదేళ్లలో దేశంలో పేదరికం 51 శాతం నుంచి 21 శాతానికి తగ్గిందన్నారు. గుజరాత్‌లో 16 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 17 శాతం, తెలంగాణలో 14 శాతం పేదరికం ఉండగా, ఏపీలో 13 శాతం ఉందన్నారు. పిడుగుల సమాచారం ముందే వస్తున్నా ప్రాణనష్టం జరుగుతుండడం దురదృష్టకరమన్నారు. 

జన్మభూమి కమిటీలకు తోడుగా సాధికార మిత్రలు.. 
జన్మభూమి కమిటీలకు తోడుగా గ్రామాల్లో సాధికార మిత్రలను కూడా జత కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా సంఘాల నుంచి నాలుగు లక్షల మందిని సాధికార మిత్రలుగా ఎంపిక చేశారు. ప్రభుత్వం నుంచి ఆయా కుటుంబాలకు అందుతున్న వివిధ కార్యక్రమాలు, పథకాలను సాధికార మిత్రలు పర్యవేక్షిస్తారు. ఎక్కడైనా లోపాలుంటే వాటిని సంబంధిత ప్రభుత్వ అధికారి దృష్టికి తీసుకెళ్తారు. ప్రతీ నెల 21న జన్మభూమి కమిటీలతో పాటు సాధికార మిత్రలతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తారు. 

కెల్లర్‌ ప్రతినిధులతో సీఎం భేటీ
ఆస్ట్రేలియన్‌ కంపెనీ కెల్లర్‌ ప్రతినిధులతో సీఎం సోమవారం భేటీ అయ్యారు. కాంక్రీట్‌ పనులకు సాంకేతిక సహకారం అందించే కెల్లర్‌ కంపెనీ పరిజ్ఞానాన్ని రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వినియోగిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జల సంరక్షణకు ఆ ప్రతినిధి బృందం ప్రజంటేషన్‌ ఇచ్చింది. అనంతరం ఈ–ప్రగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు.

>
మరిన్ని వార్తలు