అన్నదాతలపై అప్పుల మూట

23 Jul, 2018 02:43 IST|Sakshi

వడ్డీకి కూడా చాలని రుణమాఫీ

రైతుల రుణ వివరాలు వెల్లడించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ 

రుణమాఫీ కోసం సర్కారు అరకొరగానే నిధులు.. 

మాఫీ చేయాల్సిన రుణాలు రూ.24,000 కోట్లకు కుదింపు 

కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకుల నిరాకరణ 

ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న అన్నదాతలు 

అప్పుల భారంతో ఆత్మహత్యలు

చంద్రబాబు సీఎం అయ్యే నాటికి రైతుల రుణాలు రూ. 87,612 కోట్లు 

2018 మార్చి చివరి నాటికి బ్యాంకుల్లో రైతుల రుణాలు రూ.1,25,972.02 కోట్లు

సన్నకారు రైతుల రుణాలు రూ.46,747.30 కోట్లు

చిన్నకారు రైతుల రుణాలు రూ. 27,280.11 కోట్లు 

సాక్షి, అమరావతి: బ్యాంకుల నుంచి తీసుకున్న వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానంటూ నమ్మబలికి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర రైతాంగాన్ని నిలువునా వంచిస్తు న్నారు. రుణ మాఫీ హామీని అమలు చేయకపోవడంతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చంద్రబాబు నిర్వాకం వల్ల బ్యాంకుల నుంచి కొత్త రుణాలు వచ్చే దారిలేక ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయించి, అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది. అప్పులు, వడ్డీల భారం పెరిగిపోయి, అవి తీర్చే మార్గం కనిపించక రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడుతున్నారు. చంద్రబాబు అధికారంలో వచ్చే నాటికి బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలు రూ.87,612 కోట్లు కాగా, ఈ ఏడాది మార్చి చివరి నాటికి అవి ఏకంగా రూ.1,25,972.02 కోట్లకు చేరడం గమనార్హం. ఇక ప్రైవేట్‌ అప్పులు ఎన్ని రూ.వేల కోట్లు ఉంటాయో ఊహించుకోవాల్సిందే. 

రుణమాఫీకి షరతులు 
బ్యాంకుల్లో బంగారం కుదువ పెట్టి వ్యవసాయ రుణాలు తీసుకోండి, చంద్రబాబు అధికారంలోకి రాగానే విడిపించి ఇస్తారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ప్రచారం చేశారు. దీంతో చాలామంది రైతులు బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి వ్యవసాయ రుణాలను తీసుకున్నారు. అయితే, బంగారం కుదువ పెట్టి తీసుకున్న పంట రుణాలకు మాఫీ వర్తించదని చంద్రబాబు ప్రభుత్వం తేల్చేసింది. దీంతో రూ.35,000 కోట్ల రుణాలు మాఫీకి నోచుకోలేదు. తీసుకున్న రుణాలు వెంటనే చెల్లించాలని, లేకపోతే బంగారం వేలం వేస్తామంటూ బ్యాంకులు రైతులకు నోటీసులు జారీ చేశాయి. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి ఆంధ్రప్రదేశ్‌లో రైతుల వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు ఉన్నట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ స్పష్టం చేసింది. అయితే, ఈ రుణాలన్నీ మాఫీ చేయబోమంటూ టీడీపీ ప్రభుత్వం పలు కొర్రీలు విధించింది.

ఒక్కో కుటుంబంలో ఎంతమంది ఎంత రుణం తీసుకున్నప్పటికీ ఆ కుటుంబంలోని అందరికీ కలిపి కేవలం రూ.లక్షన్నర మాత్రమే మాఫీ చేస్తామని, అది కూడా పంటల రుణాలకే వర్తిసుందని షరతు విధించింది. ఉద్యానవన పంటలు, మత్స్య, కోళ్లు, పాడి పరిశ్రమ అవసరాలు, గోదాముల్లోని సరుకు తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించదని స్పష్టం చేసింది. మాఫీ చేయాల్సిన రుణాలను ఇలా షరతుల పేరిట రూ.24,000 కోట్లకు కుదించింది. అదైనా పూర్తిగా ఇవ్వకుండా మోసం చేస్తోంది. రుణమాఫీ కోసం ప్రతిఏటా అరకొరగా నిధులు విదిలిస్తూ చేతులు దులుపుకుంటోంది. ప్రభుత్వం ఇప్పటిదాకా ఇచ్చిన సొమ్ము రుణాలపై కనీసం వడ్డీలు చెల్లించడానికైనా ఏ మూలకూ చాలని పరిస్థితి నెలకొంది. గతంలో రుణాలపై వడ్డీని ప్రభుత్వాలే చెల్లించేవి. చంద్రబాబు గద్దెనెక్కాక దానికి ఎగనామం పెట్టారు. 

డిఫాల్టర్లుగా మారిన రైతులు 
ఈ ఏడాది మార్చి చివరి నాటికి రాష్ట్ర రైతాంగం రుణాలు రూ.1,25,972.02 కోట్లకు చేరినట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ఈ నెల 13వ తేదీన ఒక నివేదికలో వెల్లడించింది. ఇందులో సన్న, మధ్య తరగతి రైతుల రుణాలు రూ.74,027.41 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. వ్యవసాయ రుణాలను ప్రభుత్వం మాఫీ చేయకపోవడంతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రుణాలన్నీ మాఫీ చేస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీని నమ్మిన రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేదు. చంద్రబాబు మాట తప్పడంతో వారంతా డిఫాల్టర్లుగా మారారు. దాంతో బ్యాంకులు కొత్త రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. అసలు రుణాలు అలాగే ఉండడంతోపాటు వడ్డీల భారం నానాటికీ పెరిగిపోతోంది. దీంతో రైతులు పంటల సాగు కోసం అవసరమైన పెట్టుబడుల కోసం ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులపై ఆధారపడక తప్పడం లేదు. బ్యాంకుల్లో ఉన్న అప్పు, ప్రైవేట్‌ అప్పు కలిసి రైతులను కుంగదీస్తున్నాయి. అప్పుల భారం భరించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. 

మరిన్ని వార్తలు