సొంత డబ్బాతో తొలిరోజు సరి!

11 Nov, 2017 04:08 IST|Sakshi

అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో పత్తాలేని ప్రజాసమస్యలు

అక్రమాల ఊసేలేని పట్టిసీమపై స్వల్పకాలిక చర్చ

ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ లేక బోసిపోయిన అసెంబ్లీ

మా డప్పు మేం కొట్టుకోడానికే ఈ సమావేశాలు అన్న సీనియర్లు

సాక్షి, అమరావతి : ప్రభుత్వ ఆప్రజాస్వామిక తీరును నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హాజరుకాని నేపథ్యంలో.. శుక్రవారం నుంచి ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తొలిరోజు కీలకమైన ప్రజాసమస్యల ప్రస్తావనేదీ లేకుండానే ముగిసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.. రైతులు, డ్వాక్రా రుణాల మాఫీ చేయాలని.. యువతకు ఉద్యోగ–ఉపాధి అవకాశాలు కల్పించాలని, పార్టీ ఫిరాయించిన వారిని తక్షణమే అనర్హులుగా ప్రకటించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

వీటిని నెరవేర్చడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఆ పార్టీ అసెంబ్లీని బహిష్కరించి పాదయాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్లింది. సమస్యలను పరిష్కరించి ప్రజలకు మేలు చేయాల్సిన ప్రభుత్వం వాటిని విస్మరించి ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించింది. సమావేశాల తొలి రోజున ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలుకొని చివరి వరకు ప్రభుత్వానికి వత్తాసుగానే తప్ప ప్రజలకు మేలు చేసే ఏ విధమైన చర్చ లేకుండాపోయింది. అనేక అక్రమాలకు ఆలవాలంగా మారి దాదాపు రూ.353 కోట్ల మేర అవినీతి జరిగిందని సాక్షాత్తూ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తప్పుబట్టిన పట్టిసీమ ప్రాజెక్టుపై వచ్చిన ప్రశ్నను స్వల్పకాలిక చర్చగా మార్చి ప్రభుత్వానికి కితాబులిచ్చే దిశగా ప్రసంగాలు కొనసాగాయి.  

ప్రధాన ప్రతిపక్షం లేక సభ వెలవెల
రాష్ట్రంలో తొలిసారిగా ప్రధాన ప్రతిపక్షం లేకుండా ప్రారంభమైన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు తొలిరోజునే వెలవెలబోయాయి. అధికారపక్ష సభ్యుల్లోనూ ఈ తేడా కొట్టొచ్చినట్లు కనిపించింది. ప్రధాన ప్రతిపక్షం లేకుండా ఇవేం సమావేశాలంటూ పలువురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు పెదవి విరిచారు. ‘‘ప్రధాన ప్రతిపక్షం హాజరై ప్రజాసమస్యలు ప్రస్తావించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దానిపై చర్చ జరిగి సభలో ఒక హుందాతనం ఏర్పడేది. ఈసారి అలాంటి పరిస్థితి లేనందున సమావేశాలు చప్పచప్పగా అనిపిస్తున్నాయి. ఏదో మా డప్పు మేము కొట్టుకోవడానికే తప్ప ఇవేవీ ప్రజాసమస్యల పరిష్కారానికి పనికి వచ్చేవిగా కనిపించడం లేదు’’ అని సీనియర్‌ శాసనసభ్యులు కొందరు వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం లేకుండా సాగిన సభ కళ లేకుండాపోయిందని పలువురు అభిప్రాయపడ్డారు.

విపక్షం లేకపోయినా సీఎం దిశానిర్దేశం
ఇదిలా ఉంటే.. వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ ప్రకటన చేసినప్పటికీ.. వ్యూహ కమిటీ సమావేశమంటూ సభ ప్రారంభానికి ముందే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హడావుడి చేశారు. ప్రతిపక్షం హాజరయ్యేలా ప్రయత్నించి సభను సజావుగా నిర్వహించాల్సిన ఆయన ఆ బాధ్యతను పట్టించుకోకుండా ప్రతిపక్షంగా మనమే వ్యవహరిద్దామంటూ సమావేశంలో టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేయడం విశేషం. ఆ తరువాత మంత్రులను నిలదీయండంటూ తన ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారని బయటకు లీకులిప్పించారు. అయితే.. సభలో మాత్రం అలాంటి సన్నివేశాలు ఏ దశలోనూ కనిపించలేదు. సభ ప్రారంభానికి ముందు సభా వ్యవహారాల కమిటీ సమావేశం మొక్కుబడిగా ముగిసింది. ఇందులో వైఎస్సార్‌సీపీపై విమర్శలకే అధికారపక్ష నేతలు ఎక్కువ సమయం కేటాయించారని సమాచారం.

ప్రజా సమస్యల ప్రస్తావన ఏదీ?
ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో శుక్రవారం ప్రారంభమైన సభ.. ప్రభుత్వానికి, అధినేత చంద్రబాబునాయుడికి జేజేలు పలకడమే తప్ప ఏ సమయంలోనూ ప్రజాసమస్యల ప్రస్తావన కనిపించలేదు. మొదటి ప్రశ్నగా  పట్టిసీమ ప్రాజెక్టుపై దాదాపు అరగంటసేపు చర్చ సాగించారు. ఈ పథకంలో జరిగిన అవినీతి అక్రమాల సంగతిని ప్రస్తావనకు లేకుండా కేవలం నదుల అనుసంధానం చేసిన అపర భగీరధుడిగా చంద్రబాబును కీర్తించే చర్చగా మార్చేశారు. దీనిపై మరింత లోతుగా మాట్లాడాల్సి ఉందని బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు ప్రతిపాదించగా మంత్రి యనమల రామకృష్ణుడు స్వల్పకాలిక చర్చను చేపట్టాలని సూచించారు. దీంతో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ తరువాత పట్టిసీమపై స్వల్పకాలిక చర్చను దాదాపు రెండు గంటలపాటు కొనసాగించారు. పట్టిసీమను చేపట్టిన చంద్రబాబును అభినందిస్తూ ప్రత్యేక తీర్మానం చేయాలని బీజేపీ ప్రతిపాదించడం విశేషం. అంబేద్కర్‌ స్మృతివనం, అమృత్‌ పథకం అమలు, ఎన్‌టీఆర్‌ పట్టణ గృహనిర్మాణ పథకం, చంద్రన్న బీమా, గిరిజన గ్రామాలకు రవాణా సదుపాయాలు, గ్రామ పంచాయతీలకు భవనాలు అనే అంశాలపై ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. 

మరిన్ని వార్తలు