బదిలీల జాతర

30 Apr, 2016 23:54 IST|Sakshi

విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలోని ఉద్యోగుల్లో బదిలీ  సందడి నెలకొంది. త్వరలో బదిలీలు, ప్రమోషన్లకు తెరలేవనుంది. అన్ని శాఖలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా బదిలీలు ఈ నెలలోనే జరిగే అవకాశముందని సూత్రప్రాయంగా తెలియడంతో అధికారుల్లో హడావుడి మొదలైంది.  ముఖ్యంగా కోరుకున్న చోటకి బదిలీలు జరగడం కోసం జిల్లాలోని ఉద్యోగులు, అధికారులు ఉన్నతాధికారులు, నాయకులను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది తమ దరఖాస్తులను అందజేస్తున్నారు. గతంలో జరిగిన బదిలీలు ఆకస్మికంగా నిలిచిపోవడంతో చాలా మంది ఆశావహులు నిరుత్సాహం చెందారు. ఈ సారి జరిగే బదిలీల్లో అయినా న్యాయం జరుగుతుందేమోనని ఎదురు చూస్తున్నారు.
 
  ఈనెలలో బదిలీలు జరుగుతాయనే అంశంపై గత రెండు నెలల నుంచి ఊహాగానాలు వినబడుతున్నా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం బదిలీలపై ఉన్న నిషేధాన్ని కొద్దిరోజుల పాటు మాత్రమే ఎత్తివేసి తక్కువ వ్యవధిలో బదిలీల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు విడుదలవుతాయని భావిస్తున్నారు. ముఖ్యంగా బదిలీల్లో ఈ సారి పారదర్శకంగా నిర్వహించాలని అంటున్నా చాపకింద నీరులా రాజకీయ నాయకులతో పైరవీలు చేయించేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో 20 శాతానికి మించి బదిలీలు చేయకూడదని ఆదేశాలు, నిబంధనలు ఉన్నా పట్టించుకోకుండా కొన్ని శాఖల్లో బదిలీలు జరిగాయి. ఆడిట్ వంటి కొన్ని శాఖల్లో పరిమితికి మించి బదిలీలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. అయితే ఈ సారి కూడా ఇదే పరిస్థితి పునరావృతం కానుందా లేక 20 శాతానికి లోబడే బదిలీలు జరుగుతాయా అన్న విషయాలు నిషేధం ఎత్తివేశాక కానీ బయటపడే అవకాశాల్లేవు.  
 
 రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించే సమయంలో గతంలో ముందుగానే ఆర్‌ఐలుగా కొన్నాళ్లు కోర్సు కంప్లీట్ చేసేవారు. సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతులు పొందాలంటే తప్పనిసరిగా ఆర్‌ఐగా కనీసం రెండేళ్లు పనిచేయాల్సిన నిబంధనలున్నాయి. కానీ చాలా మందికి ప్రమోషన్లు ఇచ్చినా ఇంకా ఆర్‌ఐ కోర్సులకు అనుమతించలేదు. ఇలా జిల్లాలో సుమారు 35 మంది వరకూ ఉన్నట్టు భోగట్టా! అలాగే జిల్లా వ్యాప్తంగా సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందిన స్థానాల్లో జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. సీనియర్ అసిస్టెంట్ల స్థానాల్లో ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యార్హత పొందిన కింది స్థాయి సిబ్బందికి కూడా ఏదైనా అవకాశం రావచ్చనే ఆశలు ఉద్యోగుల్లో నెలకొన్నాయి. ఈ నెలలో అటు పదోన్నతులు, ఇటు బదిలీలతో   స్థాన చలనాలు, పైరవీలు, బెదిరింపులు, అలకలతో ముడిపడి ఉందనడంలో సందేహం లేదు.
 

మరిన్ని వార్తలు