ఫెయిలైనా ' పీజీ' అడ్మిషన్‌ దొరుకుతుంది ఇక్కడ

19 Jul, 2019 11:28 IST|Sakshi

సాక్షి, కర్నూలు : రాయలసీమ విశ్వవిద్యాలయం అధికారుల తీరు తీవ్ర విమర్శల పాలు అవుతోంది. పరీక్షల విభాగంలో జరిగే అవకతవకలకు అంతే లేకుండా పోతోంది. ఇక్కడ అధికారులు అనుకుంటే ఏదైనా సాధ్యమే అనేది చాలా సార్లు నిరూపితమైంది. ‘నిబంధనలు వర్తించవు.. ఎన్ని సార్‌లైనా తప్పులు చేస్తాం..మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు’ అనే ధైర్యంతో చలామణి అవుతున్నారు. గతంలో డిగ్రీ రీవ్యాల్యుయేషన్‌ సమాధాన పత్రాలు మాయమైనా ఎలాంటి చర్యలు లేవు. గత నాలుగు రోజుల కిత్రం డిగ్రీ సమాధాన పత్రాలు తడిసినా పట్టించుకునే దాఖలాలు లేవు.

ఇన్ని తప్పిదాలు జరిగినా ఎలాంటి చర్యలు లేక పోవటంతో  తప్పులు చేస్తుండటం పరిపాటిగా మారింది. అలాంటిదే బుధవారం ఒక ఘటన జరిగింది. ఇది గురువారం రోజు బయట పడింది. ఫెయిల్‌ అయిన డిగ్రీ విద్యార్థినికి ఏకంగా పీజీ కౌన్సెలింగ్‌కు అనుమతి ఇచ్చారు. అయితే ఈ విద్యార్థిని ఫెయిల్‌ అయిన సబ్జెక్టులకు రీ వ్యాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఫలితాలు విడుదల కాలేదు. అయినా పరీక్షల విభాగం సీఈ డాక్టర్‌ వెంకటే«శ్వర్లు..‘‘ ఆ విద్యార్థిని ఫెయిల్‌ కాలేదు. ఉత్తీర్ణత సాధించారు. సీజీపీఏ 7.58 పాయింట్లు వచ్చాయి’’ అని   లిఖిత పూర్వకంగా ఒక కాపీ ఇచ్చారు. దీంతో ఆ అమ్మాయిలో పీజీ సెట్‌ రెండో విడత కౌన్సె లింగ్‌ హాజరయ్యారు.  

గాయత్రీ ఎస్టేట్‌లోని శంకరాస్‌ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ) డిగ్రీ చదివిన ఒక విద్యార్థిని డిగ్రీ నాలుగోసెమిస్టర్‌లో జువాలజీ, ఆరో సెమిస్టర్‌ బాటనీలో ఏడో పేపర్‌ ఫెయిల్‌ అయ్యారు. ఈ విద్యార్థిని ఆర్‌యూ పీజీ సెట్‌లో బాటనీ కోర్సుకు ప్రవేశ పరీక్ష రాసింది. అందులో 46వ ర్యాంక్‌ సాధించారు. ఫెయిల్‌ అయిన సబ్జెక్టులకు రీ వ్యాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వర్సిటీ పరీక్షల విభాగం సీఈని కలిశారు.

అయిన ఏమి ఆలోచన చేశారో కానీ ఆ విద్యార్థిని ఏప్రెల్, 2019లో డిగ్రీ బీఎస్సీ పూర్తి చేసిందని,  సీజీపీఏ 7.58 పాయింట్లతో ఉత్తీర్ణత సాధించిందని, ప్రొవిజినల్‌ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసుకున్నారని, అది ప్రాసెస్‌లో ఉందని ఒక లిఖిత పూర్వక లేఖను విద్యార్థినికి ఇచ్చారు. ఆ అమ్మాయి కౌన్సెలింగ్‌ కేంద్రంలోని అధికారులను కలిసి సంబంధిత లేఖను చూపించారు. కౌన్సెలింగ్‌లో ఉన్న వెరిఫికేషన్‌ అధికారులు సర్టిఫికెట్లు పరిశీలించినట్లు సంతకాలు చేశారు. 

సీఈ ఇచ్చిన కాపీని కాకుండా వెరిఫికేషన్‌ అధికారులు డిగ్రీ మార్కుల జాబితాలను జాగ్రత్తగా పరిశీలించి ఉంటే జరిగిన తప్పిదం బయట పడేది. ఇవేమీ పట్టించుకోకుండా సీఈ లేఖను ఆధారంగా చేసుకొని వెరిఫికేషన్‌ పూర్తి చేసి ఆప్షన్లు నమోదు చేసుకోడానికి అనుమతి ఇచ్చారు. ఇది వర్సిటీ అధికారులు నిర్వాకం. ఈ విషయమై సీఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ‘‘ఆ విద్యార్థిని డిగ్రీ ఆరో సెమిస్టర్‌లో ఒక పేపర్‌ ఫెయిల్‌ అయింది. రీ వ్యాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకుంది. వర్సిటీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ అమ్మాయి ఉత్తీర్ణత సాధించినట్లు బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ ఇచ్చాను. తరువాత ఆ అమ్మాయి సమాధాన పత్రాలను రీ వ్యాల్యు చేయించాను. పాస్‌ అయింది. మార్కుల జాబితా రావాల్సి ఉంది.’’ అని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు