లేని వజ్రాన్ని తెమ్మంటే ఎలా?: పుట్టా

22 May, 2018 16:11 IST|Sakshi
సీఎంతో భేటీ అనంతరం మీడియాతో టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌

సాక్షి, అమరావతి: శ్రీవారికి చెందిందిగా ప్రచారంలో ఉన్న గులాబీ వజ్రం అసలు లేనేలేదని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ అన్నారు. తిరుమల ఆలయంలో నగల మాయం, అర్చకుల తొలగింపు, విబేధాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలోని తాత్కాలిక సచివాలయంలో జరిగిన ఈ భేటీకి టీటీడీ ఈవో సింఘాల్ సహా ఇతర ఉన్నతాధికులు హాజరయ్యారు.
(చదవండి: చంద్రబాబు పదేపదే అదే చెప్పారు: సింఘాల్‌)

‘‘శ్రీవారి ఆభరణాల రికార్డుల్లో గులాబీ వజ్రం అనేది లేనేలేదు. రికార్డుల్లో లేని వజ్రాన్ని తీసుకురమ్మంటే ఎలా? ఎక్కడి నుంచి తెస్తాం? అసలు రమణదీక్షితులు ఇన్నాళ్లూ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు?’’ అని టీటీడీ చైర్మన్‌ ప్రశ్నించారు. కొద్దిరోజులుగా జరుగుతోన్న వ్యవహారాలపై సీఎం వివరాలు అడిగారని, అన్ని విషయాలూ సవివరంగా చెప్పామని, రమణదీక్షితులుగానీ మరొకరుగానీ చేస్తున్న ఆరోపణల్లో ఏ ఒక్కటీ నిజం లేదని పుట్టా స్పష్టం చేశారు. టీటీడీ ఈవో సింఘాల్‌ సైతం మీడియాతో మాట్లాడుతూ..  ఆగమశాస్త్రం ఒప్పుకుంటే శ్రీవారి ఆభరణాలను ప్రదర్శిస్తామని అన్నారు.

వేంకటేశ్వరుడికి చెందిన గులాబీ వజ్రంతోపాటు కొన్ని ఆభరణాలు కనిపించకుండా పోయాయని, పోటు(వంటశాల)ను మూసివేసి స్వామివారిని పస్తులు ఉంచారని శ్రీవారి ఆలయం మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులు ఇటీవల చేసిన ఆరోపణలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆమధ్య జర్మనీలో వేలం వేసిన గులాబీ వజ్రం శ్రీవారిదే అయి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు కూడా.

మరిన్ని వార్తలు