మూడు రోజులుగా మరణాల్లేవు

29 Apr, 2020 03:49 IST|Sakshi

రాష్ట్రంలో మొత్తం 1,259కు చేరిన పాజిటివ్‌ కేసులు

కొత్తగా కోలుకున్న వారు 23 మంది.. ఇప్పటివరకు డిశ్చార్జ్‌ అయిన వారు 258 

సాక్షి, అమరావతి: కరోనా కారణంగా రాష్ట్రంలో మూడు రోజులుగా ఒక్క మరణం కూడా చోటుచేసుకోలేదు. దీంతో కోవిడ్‌–19 మృతుల సంఖ్య 31 వద్దే స్థిరంగా ఉంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన బులెటిన్‌ ఈ విషయం స్పష్టం చేస్తోంది. సోమవారం ఉ.9 గంటల నుంచి మంగళవారం ఉ.9 గంటల వరకు మొత్తం 5,783 మందిని పరీక్షించగా కొత్తగా 82 కేసులు పాజిటివ్‌గా నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,259కి చేరుకున్నట్లు ప్రభుత్వం అందులో పేర్కొంది. వీటిలో కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా 40 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 332కు చేరింది. గుంటూరు జిల్లాలో 17, కృష్ణా జిల్లాలో 13 కేసులు పాజిటివ్‌గా నమోదయ్యాయి. వైఎస్సార్‌ కడప జిల్లాలో 7, నెల్లూరు 3, అనంతపురం, చిత్తూరు జిల్లాలో కొత్తగా ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి.

23 మంది డిశ్చార్జి
ఇదిలా ఉంటే.. గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న 23 మందిని డిశ్చార్జ్‌ చేసినట్లు ప్రభుత్వం ఆ బులిటెన్‌లో పేర్కొంది. ఇందులో కర్నూలు జిల్లాలో 12 మంది, గుంటూరు 10, నెల్లూరులో ఒకరు ఉన్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 258కి చేరింది. అలాగే,  ప్రస్తుతం 970 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు