దెయ్యం బూచి.. హాస్టల్‌ ఖాళీ

14 Jul, 2019 08:35 IST|Sakshi
సి.బెళగల్‌ ఆదర్శ బాలికల హాస్టల్‌

సాక్షి, సి. బెళగల్‌(కర్నూల్‌) : ఆదర్శ బాలికల హాస్టల్‌లో దెయ్యం బూచితో బాలికలు హడలిపోతున్నారు. రాత్రిపూట విచిత్ర అరుపులు, కేకలు, పసిపిల్లల ఏడుపులు వినిపిస్తున్నాయని పుకార్లు పుట్టించడంతో వారు   భయందోళన  చెందుతున్నారు. తల్లిదండ్రులను పిలిపించుకుని ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో శుక్రవారం రాత్రికి హాస్టల్‌ పూర్తిగా ఖాళీ అయింది.  ఒక్క విద్యార్థిని భయంతో మొదలు..హాస్టల్‌  9 వతరగతి నుంచి ఇంటర్‌ వరకు ఉంది. ఇందులో మొత్తం 75 మంది బాలికలు ఉన్నారు.  

ఇటీవల కొత్తగా 9వ తరగతి విద్యార్థిని చేరింది.  ఈ విద్యార్థిని భయపడి మిగతావారు కూడి భయపడేలా చేసింది. సదరు బాలికకు హాస్టల్‌లో ఉండేందుకు ఇష్టంలేక దెయ్యం బూచి పెట్టిందని హాస్టల్‌ సిబ్బంది, కొందరు తోటి విద్యార్థినులు చెబుతున్నారు. కొండప్రాంతంలో హాస్టల్‌ ఉండటంతో పక్షులు, జంతువుల అరుపులు వినిపించి ఉండొచ్చని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. వారిలో భయాన్ని పోగొట్టేందుకు  అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. 

నిస్సహాయక స్థితిలో ప్రిన్సిపాల్, వార్డెన్‌
హాస్టల్‌లో దెయ్యముందని పుకార్లు షికారు చేయడంతో  శుక్రవారం సాయంత్రం నుంచి పిల్లల తల్లిదండ్రులు హాస్టల్‌కు క్యూ కట్టారు.  తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్తామని స్కూల్‌ ప్రిన్సిపాల్‌ కిషోర్‌కుమార్, వార్డెన్‌ నాగలక్ష్మితో వాదనకు దిగారు. వారు ఎంత సముదాయించినా వినిపించుకోకుండా  పిల్లలను తీసుకెళ్లారు. దీంతో హాస్టల్‌ పూర్తిగా ఖాళీ అయింది. 

మరిన్ని వార్తలు