విద్యుత్ ‘కట్’కటలు!

26 Jan, 2014 01:25 IST|Sakshi
విద్యుత్ ‘కట్’కటలు!
  •     అనధికారిక కోతలు మొదలు
  •      మండల కేంద్రాల్లో 2గంటలు
  •      షెడ్యూల్ తయారీ?
  •  
     సాక్షి, విశాఖపట్నం : తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) పరి ధిలో అనధికారిక విద్యుత్ కోతలు మొదలయ్యాయి. గ్రామీణ, మండల కేంద్రాల్లో రోజూ రెండు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు. ప్రస్తుతానికి సరఫరాలో వ్యత్యాసాల వల్ల మాత్రమే అప్పుడప్పుడు కోతలు అమలు చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే గత మూడు రోజులుగా క్రమం తప్పకుండా కోతలు విధిస్తుండటం గమనార్హం.

    పెరుగుతోన్న వినియోగం : విద్యుత్ వినియోగంలో వ్యత్యాసం భారీగా ఉంది. ఈపీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో సగటున రోజుకు 38 మిలియన్ యూనిట్లు కోటా అమలవుతుండగా, వాడుక మాత్రం 40 మిలియన్ యూనిట్లుగా ఉంది. దీంతో లోటు భర్తీకి ట్రాన్స్‌కో ఆదేశాల మేరకు ఐదు జిల్లాల్లోనూ కోతలు విధిస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరంలో మాత్రం కోటా కంటే ప్రస్తుత వినియోగం తక్కువగానే ఉంది. అయినప్పటికీ కోతలు తప్పట్లేదు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయి. ఉదయంపూట ఎక్కువగా వ్యవసాయ పంపుసెట్లు, గృహ వినియోగ పంపుసెట్లు అధికంగా ఉండటంతో 8 గంటల నుంచి 10 గంటల మధ్య డిమాండ్, సరఫరా మధ్య తీవ్ర వ్యత్యాసం ఏర్పడుతున్నట్టు అధికారులు చెప్తున్నారు.

    వ్యవసాయ పంప్‌సెట్లకు రాత్రిపూట కూడా సరఫరా ఉంటున్నా.. ఆ సమయంలో అంతగా వినియోగించకుండా.. అంతా ఉదయానికే ప్రాధాన్యతివ్వడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ నెలాఖరున హైదరాబాద్‌లో డిస్కంల ప్రతినిధులతో ప్రత్యేక భేటీ జరగనున్నట్టు తెలిసింది. ఈ భేటీలో రొటేషన్ పద్ధతిన కోతలు అమలు చేసేందుకు డిస్కంలవారీ షెడ్యూల్‌ను తయారు చేస్తున్నారు. వీటిలో గ్రామీణ ప్రాంతాలు, మండల కేంద్రాలను ముందు వరుసలో పెడ్తున్నారు.
     

మరిన్ని వార్తలు