నెలలో ‘థర్మల్’ అనుమతులు రద్దు

9 Nov, 2014 02:26 IST|Sakshi

 సోంపేట : మండలంలోని బీల ప్రాంతంలో నిర్మించదలచిన థర్మల్ పవర్ ప్రాజెక్టు అనుమతులు రద్దు జీవోను నెల రోజుల్లో విడుదల చేస్తామని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం సోంపేటలో సర్పంచ్ చిత్రాడ నాగరత్నం అధ్యక్షతన నిర్వహించిన జన్మభూమిలో సభలో పలాస, ఇచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేలు గౌతు శ్యామ సుందర శివాజీ, బెందాళం అశోక్‌బాబుతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో సుడిదోమ వల్ల వరి పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.15 వేలు అందించాలని ప్రభుత్వం నుంచి శనివారం ఆదేశాలు అందినట్టు చెప్పారు. నెలలోగా రైతులకు పరిహారం అందిస్తామన్నారు. హుదూద్ తుపాను పరిహారం చెల్లించిన అనంతరం గతేడాది పైలీన్ తుపాను నష్ట పరిహారాన్ని రైతులకు అందిస్తామన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్రం రూ.1800 కోట్లు కేటాయించిందన్నారు.
 
 రైతు, డ్వాక్రా రుణమాఫీ తప్పక అవుతుందన్నారు.
 సోంపేట పంచాయతీ స్థలాన్ని కేటాయిస్తే  అత్యాధునిక సౌకర్యాలతో సులభ కాంప్లెక్స్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తొలుత థర్మల్ ప్రాజెక్టు అనుమతులు రద్దు జీవో విడుదల చేయాలని మంత్రికి పర్యావరణ పరిరక్షణ సంఘం అధ్యక్ష ప్రతినిధులు వై.క్రిష్ణమూర్తి, తమ్మినేని రామారావు, మాదిన రాఘవయ్య, సనపల శ్రీరామమూర్తి తదితరులు వినతి పత్రం అందజేశారు. మంత్రి  ఆలస్యంగా రావడంతో జన్మభూమి మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభమైంది. వృద్ధులకు పడిగాపులు తప్పలేదు. పలాస ఎమ్మేల్యే శివాజి తన అసహానాన్ని వెళ్లగక్కారు. ఆర్డీవో ఎం.వెంకటేశ్వరరావు, ఎంపీపీ చిత్రాడ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ  సూరాడ చంద్రమోహన్, ప్రత్యేకాధికారి కె.ప్రసాద్, తహశీల్దార్ ఆర్.గోపాలరత్నం, ఎంపీడీవో ఎం.వి.సువర్ణరాజు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు