ఇన్ని అక్రమాలా?

12 Sep, 2015 23:45 IST|Sakshi
ఇన్ని అక్రమాలా?

అడ్డగోలుగా నడుస్తున్న కళాశాలలు
పట్టించుకోని అధికారులు

 
పేరుకే న్యాయ కళాశాలలు. చేసేవి అక్రమాలు. నామమాత్రపు భవనాలు.. ఫ్యాకల్టీ ఉండరు. హాజరులో ఉన్న విద్యార్థులు తరగతుల్లో కనిపించరు. నిబంధనల మేరకు మౌలిక సదుపాయాలుండవు. రికార్డుల్లో మాత్రం అన్నీ సవ్యంగా ఉన్నట్టు చూపిస్తారు. దానికి సంబంధిత అధికారులు తలూపుతారు. ఫలితంగా కొన్నాళ్లకు ఈ కాలేజీల నుంచి కొత్త న్యాయవాదులు పుట్టుకొస్తారు..! ఇదంతా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కాదు.. సాక్షాత్తూ విద్యాశాఖా మంత్రి ఇలాకాలో జరుగుతున్న వ్యవహారం!
 
విశాఖపట్నం :జిల్లాలో భీమిలి మండలంలో ఒకటి, అనకాపల్లిలో మరో న్యాయ కళాశాల కొన్నేళ్లుగా నడుస్తున్నాయి. వీటికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎఫిలియేషన్ కూడా ఉంది. ఈ కాలేజీల్లో మూడు, ఐదేళ్ల లా కోర్సులు నిర్వహణకు అనుమతి ఉంది. దీంతో ఏటా విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం 11 క్లాస్ రూమ్‌లు, ఒక మ్యూట్ కోర్టు, సెమినార్ హాలు, ప్రిన్సిపాల్ చాంబర్, గ్రంథాలయం, ఆట స్థలం, పూర్తి స్థాయి ఫ్యాకల్టీ, ఇతర మౌలిక వసతులు ఉండాలి. ఏటా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు తనిఖీలు చేస్తుండాలి. ఆంధ్ర విశ్వ విద్యాలయం అధికారులు కూడా పర్యవేక్షించాలి. అన్నీ సక్రమంగా ఉంటేనే వాటి కొనసాగింపునకు అనుమతివ్వాలి. కానీ ఈ కాలేజీల్లో బోర్డులు, చిన్నపాటి నామమాత్రపు భవనాలు తప్ప నిబంధన ప్రకారం ఉండాల్సినవేమీ లేవని విద్యార్థులు చెబుతున్నారు. పైగా ఏయూ అధికారుల పర్యవేక్షణ కూడా ఉండడం లేద న్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 డబ్బులిస్తే చాలు.. కళాశాలకు వెళ్లనక్కర్లేదు
 భీమిలి మండలంలో నడుస్తున్నట్టు చెబుతున్న కాలేజీ ఒక్కో స్టూడెంట్ నుంచి రూ.60 వేల నుంచి లక్ష వరకూ, అనకాపల్లి కళాశాలలో చేరే వారికి రూ.30-40 వేల వరకూ వసూలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ మొత్తం చెల్లించి కాలేజీల్లో చేరిన వారు తరగతులకు, వైవాకు హాజరు కానక్కర్లేదని, రికార్డులు రాయాల్సిన పని కూడా ఉండదని, అన్నీ యాజమాన్యాలే చూసుకుంటాయని అంటున్నారు. పరీక్షలకు హాజరైతే అప్పుడు కూడా వీరు సాధ్యమైనంత సాయం చేసి గట్టెక్కిస్తారన్న ప్రచారం ఉంది.

 తమిళులే అధికం..!
 భీమిలి మండలంలో ఉన్న కాలేజీలో తెలుగు వారికంటే తమిళులే ఎక్కువగా చేరుతుంటారు. ఎందుకంటే తమిళనాడులో న్యాయ విద్యాభ్యాసానికి 23 ఏళ్ల వయో పరిమితి ఉంది. మన రాష్ట్రంలో ఆ నిబంధన లేకపోవడం ఈ కాలేజీలకు వరమైంది. ఇది తమిళ విద్యార్థులకు అనుకూలంగా మారడంతో మూడొంతులు వారే ఉంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఈ న్యాయ కళాశాలల బాగోతంపై ఏబీవీపీ నాయకులు గతంలోనే ఏయూ వీసీ జీఎస్‌ఎన్ రాజుకు వినతిపత్రం ద్వారా ఫిర్యాదులు కూడా చేశారు. దీనిపై ఆయన సీడీసీ డీన్ కోటేశ్వరరావు నేతృత్వంలో కమిటీని వేశారు.
 
 లోపాలు నిజమే..

 ఈ న్యాయ కళాశాలలపై వచ్చిన ఫిర్యాదులపై విచారణకు అధికారులను వేశార . వారు దర్యాప్తు చేసి నివేదికలను సిద్ధం చేశారు. ప్రాథమికంగా ఆ కాలేజీల్లో ఫ్యాకల్టీతో పాటు మరికొన్ని నిబంధనలు పాటించడం లేనట్టు తేలింది. నిజమని తేలితే ఎఫిలియేషన్ ఆగుతుంది. త్వరలోనే నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తాం.      - కోటేశ్వరరావు, డీన్, సీడీసీ, ఏయూ
 
 చర్య లేకుంటే గవర్నర్‌కు ఫిర్యాదు..

 నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఈ రెండు న్యాయ కళాశాలలపైన, బాధ్యులైన ఏయూ అధికారులపైన చర్యలు తీసుకోవాలి. వాటి గుర్తింపు రద్దు చేయాలి. అధికారులు న్యాయ విద్యా ప్రమాణాలు కాపాడాలి. లేనిపక్షంలో గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం.
  - కె.వాసు, జిల్లా కన్వీనర్, ఏబీవీపీ
 
 

మరిన్ని వార్తలు