ఈ స్కూళ్లకు ఇంకా సెలవులే..

29 Jun, 2017 02:19 IST|Sakshi
ఈ స్కూళ్లకు ఇంకా సెలవులే..

కురుపాం: మండలంలోని ఐటీడీఏ పరిధిలోని పది గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలు వేసవీ సెలవుల అనంతరం జూన్‌ 12 వతేదీకే తెరవాల్సి ఉండగా నేటి వరకు ఆ పాఠశాలలు తెరుచుకోలేదు. దీంతో ఆయా పాఠశాలల్లో 1, 2వ తరగతి విద్యార్థులకు నేటికి 15 రోజులు గడుస్తున్నా విద్యాబోధన జరగటం లేదు. దీంతో ఆ గిరిజన విద్యార్థులు బడికి దూరంగా తమ గ్రామాల్లోనే ఉండి చెట్ల కింద పుట్ల కింద ఆటలాడుకోవలసిన పరిస్థితి తలెత్తిందని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా వేసవి సెలవుల్లో ఐటీడీఏ పరిధిలో ఉన్న ఉపాధ్యాయులకు బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించి బదిలీలు చేశారు.

 దీంతో కురుపాం మండలంలోని ఏగులవాడగూడ, గుండాం, కోటకొండ, తోలుంగూడ, ఎగువ గొత్తిలి, వాడకొయ్య, టొంపలపాడు, దొమ్మిడి, చీడిగూడ, గుమ్మిడిగూడ తదితర గ్రామాల్లో ఉన్న గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లిపోవడంతో ఆయా ప్రాథమిక పాఠశాలలు మూత పడ్డాయి. నేటికి పాఠశాలలు ప్రారంభమై 17 రోజులు కావస్తున్నా ఆయా పాఠశాలలకు ఉపాధ్యాయులను నియమించక పోవడంతో గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఐటీడీఏ అధికారులు స్పందించి బడులు తెరిచే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఈ విషయాన్ని ఐటీడీఏ డిప్యూటీ డీఈఓ కె.వి.వి.రమణరాయుడు వద్ద ప్రస్తావించగా ఖాళీగా ఉన్న పాఠశాలల్లో 10 మంది రెగ్యులర్‌ ఉపాధ్యాయులను, 19 మంది సీఆర్‌టీలను బోధించేందుకు నియమించామని వీరంతా ఈ నెల 30 వతేదీ నుంచి విధుల్లో చేరుతారన్నారు. ఇంకా ఎక్కడైనా ఉపాధ్యాయ కొరత ఉంటే సీఆర్‌టీలతో పూరిస్తామని తెలిపారు.
 

మరిన్ని వార్తలు