ఇమేజ్ కోసం ఆరాటం

27 Aug, 2014 02:21 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: అందివచ్చిన అవకాశంతో ప్రాంతాభివృద్ధి కోసం పాటుపడే నేతలు కొందరైతే, అధికారాన్ని అడ్డుపెట్టుకొని వ్యక్తిగత ఇమేజ్ పెంచుకొనేందుకు ఆరాట పడేవారు మరికొందరు. జిల్లాకు చెందిన తెలుగు తమ్ముళ్లు రెండో కోవలోకి  చేరుతున్నారు. జిల్లాలోని పెండింగ్ పథకాల పూర్తి కోసం ఏమాత్రం ఆలోచించకుండా వ్యక్తిగత ప్రయోజనాలు చేకూర్చే పనుల పైనే దృష్టి సారిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ  స్వీకారం చేశాక జిల్లా అభివృద్ధికి గ్రహణం పట్టిందని పలువురు పేర్కొంటున్నారు.
 
జిల్లాలో ఇప్పటి వరకూ వరుసగా రాష్ట్ర మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, రావెళ్ల కిశోర్‌బాబు పర్యటించారు. మంత్రుల పర్యటనలకు జిల్లా తెలుగుదేశం నేతలు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఈ ప్రాంతం అభివృద్ధి గురించి  ఏ ఒక్కరూ దృష్టి సారించలేదని పలువురు ఆరోపిస్తున్నారు. మంత్రుల పర్యటనలోనూ నాయకులు వారిని అంటి పెట్టుకొని ఉండటం మినహా జిల్లాకు ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని వివరించిన దాఖలాలు లేవు. తక్కువ ఖర్చుతో అభివృద్ధి ఫలాలు అందించే పథకాన్ని సైతం గుర్తించలేని దుస్థితిలో తెలుగు తమ్ముళ్లు ఉండటం విచారకరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా అధికారుల దృష్టిలో మంత్రులకు అత్యంత సన్నిహితులు అన్పించుకునేందుకే వారు ఆరాటపడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
 
సన్మానాలతోనే సరి..
జిల్లాలో ముగ్గురు మంత్రులు పర్యటిస్తే జిల్లాకు సంబంధించిన అభివృద్ధి పనుల గురించి అడిగిన, కనీసం వినతిపత్రం ఇచ్చిన నాయకుడు లేడనే విమర్శలు వినవస్తున్నాయి. కొత్త భిక్షగాడు పొద్దు ఎరుగడు అన్నట్లు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు మంత్రులకు సన్మానాలు చేయడం, మెమెంటోలు ఇవ్వడం, అవకాశం దక్కితే డిన్నర్లు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వాస్తవానికి రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన నాయకులు ప్రాంతం కోసం, ప్రజాసేవ కోసం పరితపించాలి. అయితే వ్యక్తిగత ఇమేజ్ కోసం ఆరాటపడుతుండటం విచారకరమని పలువురు పేర్కొంటున్నారు.  
 
వర్గరాజకీయాలకు ప్రాధాన్యత..
అధికారం దక్కిందనే ఉద్దేశంతో జిల్లా టీడీపీ నాయకులు వర్గ రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత అండతో జిల్లాలోని డీలర్‌షిప్‌లు మార్చడమే లక్ష్యంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. జమ్మలమడుగు డివిజన్‌లో ఈ తరహా రాజకీయాలకు అధికారపార్టీ నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారని పలువురు భావిస్తున్నారు.
 
అలాంటి రాజకీయ సమీకరణలు మినహా, జిల్లా అభివృద్ధి కోసం ఒక్కరంటే ఒక్కరు కూడా సమగ్రమైన వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ల లేదని పలువురు ఆరోపిస్తున్నారు. సీఎంకు సన్నిహితుడిగా చెప్పుకునే మరో ముఖ్య నాయకుడు ఓ సామాజిక వర్గానికి చెందిన అధికారులు జిల్లాలో పనిచేయరాదనే తలంపుతో ఉన్నారని పలువురు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా తన బ్రాండ్ ఉండాలనే లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇలా ఎవరి పరిధిలో వారు వ్యక్తిగత ఇమేజ్ కోసం తాపత్రయ పడుతుండటం మినహా ప్రాంత అభివృద్ధి.. ప్రజల కోసం పాటుపడేవారు అధికార పార్టీలో మచ్చుకైనా కన్పించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు