మందకృష్ణ.. గో బ్యాక్

12 Aug, 2014 03:01 IST|Sakshi
మందకృష్ణ.. గో బ్యాక్

తాడిపత్రి రూరల్ : తాడిపత్రిలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకష్ణ మాదిగ పర్యటనను అడ్డుకునేందుకు ఆ సంఘం నాయకులు సోమవారం ప్రయత్నించారు. పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఎమ్మార్పీఎస్ (దండువీరయ్య, ఎంఎస్ రాజు వర్గాల)కు చెందిన నాయకులు రామాంజనేయులు, గురుశంకర్, సాయిశేఖర్, కంబయ్య, రమణ, రామ్మోహన్, వెంకటశివ, శివ తదితరులు ‘మందకృష్ణ మాదిగ గోబ్యాక్.. పర్యటన రద్దు చేసుకోవాలి’ అంటూ నినాదాలు చేశారు.

సీమాంధ్రకు వ్యతిరేకి అయిన నీవు ఇక్కడికెలా వస్తావంటూ విమర్శించారు. రోడ్డుపై బైఠాయించారు. సమాచారం తెలుసుకున్న పట్టణ, రూరల్ సీఐలు సుధాకర్‌రెడ్డి, వెంకటరెడ్డి తమ పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఆందోళనకారులు పోలీసు స్టేషన్‌లోనూ కాసేపు నిరసన తెలిపారు.
 
కేసీఆర్ రెచ్చగొడుతున్నారు
తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డా తెలంగాణవాదేనని, ఈ మాటను తాను ఆంధ్రప్రదేశ్-తెలంగాణలో ఎక్కడైనా చెబుతానని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. సోమవారం ఆయన తాడిపత్రిలోని రఘు ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ జిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. తొలుత బస్టాండ్ సర్కిల్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
 
అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మాదిగలలో చైతన్యం లేకే తనను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత కోసం మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలని మాదిగలకు పిలుపునిచ్చారు. సెప్టెంబరు నెలాఖరులోగా ఏపీ-తెలంగాణ రాష్ట్రాల నూతన కమిటీల సమన్వయంతో జాతీయ కమిటీని ప్రకటిస్తామని తెలిపారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ అనుకూలంగా ఉన్నారని,  తక్షణమే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా పోరాటాలు చేయాలన్నారు.

మరిన్ని వార్తలు