ఎరక్కపోయి.. ఇరుక్కుపోయాడు!

15 Sep, 2018 06:54 IST|Sakshi
తెల్లవారుజామున పరారవ్వలేక ఆలయంలో దిక్కులు చూస్తున్న నిందితుడు

వేపగుంట పైడితల్లమ్మ ఆలయంలో చోరీకి యత్నం

తిరిగి రాలేక హుండీతో నిద్రపోయిన వైనం

తెల్లవారుజామున నిందితుడ్ని అరెస్టు చేసిన పోలీసులు

విశాఖపట్నం, గోపాలపట్నం: ఎరక్కపోయి.. ఇరుక్కుపోవడమంటే ఇదేమరి. ఆలయంలో చోరీకి యత్నించి, తిరిగి బయట పడలేక పోలీసులకు చిక్కిన ఘటన వేపగుంటలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వేపగుంట జంక్షన్‌లో పైడితల్లమ్మ ఆలయం ఉంది. శుక్రవారం వేకువజామున ఆలయ తలుపులు తెరవడానికి వచ్చిన నిర్వాహకులు, అర్చకుడికి ఇక్కడ వాతావరణం గందరగోళంగా కనిపించింది. హుండీ కనిపించలేదు. ఆలయ ప్రవేశం పైభాగంలో గ్రిల్స్‌ విరిచి ఉన్నాయి. ఆలయంలో చిల్లర డబ్బులు చిందరవందరగా పడి ఉన్నాయి. లోపల గర్భాలయం వెనక వ్యక్తి హుండీ పట్టుకుని నిద్రపోతూ కనిపించాడు. దీంతో విస్తుపోయిన ఆలయ చైర్మన్‌ మామిడి రాజు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఆలయంలోకి వెళ్లి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అన్ని తలుపుల తాళాలూ పెకిలించినా గర్భాలయ తలుపు తాళం తీయడానికి నిందితుడు సాహసించలేకపోయినట్టు తెలిసింది. నిందితున్ని పోలీసులు విచారిస్తున్నారు. ఆలయంలోకి ప్రవేశించినా బయటకు రాలేక ఇలా ఉండిపోయినట్లు ఆయన నుంచి సమాధానం వచ్చింది. ఇదిలా ఉండగా వేపగంట జంక్షన్‌లోనే పోలీసు అవుట్‌పోస్టు ఉంది. దీని పక్కనే పైడితల్లమ్మ ఆలయం ఉన్నా ఈ సంఘటన జరిగిందంటే పోలీసు నిఘా ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చని స్థానికులు విమర్శిస్తున్నారు. 

మరిన్ని వార్తలు