దొంగ పోలీసు అరెస్ట్‌

29 Jul, 2018 11:38 IST|Sakshi

నూజివీడు : పోలీస్‌ ఎస్‌ఐ డ్రెస్‌ కుట్టించుకుని దాన్ని ధరించి ఎస్‌ఐని అని చెప్పుకుంటూ తిరగడమే కాకుండా, బండిపై వెనుక, ముందు భాగంలో ‘పోలీస్‌’ అని రాసుకుని తిరుగుతున్న వ్యక్తిని పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నూజివీడు సీఐ మేదర రామ్‌కుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని కొత్తపేట ముస్లిం బజారుకు చెందిన షేక్‌ సలీంమాలిక్‌ (26) డిగ్రీ చదువుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో పోలీసు డ్రెస్‌ కుట్టించుకుని దాన్ని ధరించి వీధులలో తిరుగుతుండటమే కాకుండా తనకు ఎస్‌ఐ ఉద్యోగం వచ్చిందని చుట్టుపక్కల వారికి తెలియజేశాడు. ఈ నేపథ్యంలో స్థానిక ట్రిపుల్‌ ఐటీ వద్ద మధ్యాహ్న సమయంలో పట్టణ ఎస్‌ఐ రంజిత్‌కుమార్‌ వాహనాలను చెక్‌ చేస్తుండగా అనుమానం వచ్చి ఆపి ఎక్కడ ఎస్‌ఐగా పని చేస్తున్నారని ప్రశ్నించారు. సలీంమాలిక్‌ తడబడుతూ సమాధానం సరిగా చెప్పలేదు. దీంతో అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగ పోలీస్‌ అని తేలింది. దీంతో ఎస్‌ఐ ఉద్యోగాన్ని దుర్వినియోగం చేస్తుండటంపై అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో పట్టణ, రూరల్‌ ఎస్‌ఐలు రంజిత్‌కుమార్, చిరంజీవి పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు